ఇద్దరమ్మాయిలు ముద్దుపెట్టుకున్నారని..
హవాయి: బహిరంగంగా ఓ షాపింగ్ మాల్లో ముద్దు పెట్టుకున్నామని తమను అరెస్టు చేశారని ఇద్దరు హవాయి మహిళలు(లెస్బియన్స్) పోలీసులపై కోర్టులో దావా వేశారు. తాము ఎంత చెప్తున్నా వినకుండా అక్కడే తమను విసిగించారని, వేధింపులకు గురిచేసి అవమానించారని, అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ ఎంజెల్స్ కు చెందిన కార్ట్నీ విల్సన్, టేలర్ గ్వెర్రెరో హవాయి ద్వీపంలోకి సరదాగా గడిపేందుకు వచ్చారు. అక్కడే ఓ ఫుడ్ లాండ్ స్టోర్లో అందరూ చూస్తుండగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని బహిరంగంగా ముద్దుపెట్టుకున్నారు.
ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి పోలీసు అధికారి హే అమ్మాయిలు.. మీరు ఇక్కడ అలాంటి పనులు చేయొద్దంటూ బిగ్గరగా కేకలు వేశారు. దీంతో తాత్కాలికంగా వారు ఆపేసినా ఆ అధికారి వెళ్లిన తర్వాత షాపింగ్ చేస్తూనే తిరిగి మరోసారి ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసు.. వారిని బలవంతంగా షాపింగ్లో నుంచి ఈడ్చి బయటపడేశారు. అనంతరం అరెస్టు చేసి వదిలి పెట్టారు. దీంతో వారు తీవ్ర అవమానంగా భావించి కోర్టులో దావా వేశారు. హవాయిలో స్వలింగ సంపర్కులకు సాధారణ వ్యక్తుల్లాగే అన్ని రకాల హక్కులు ఉన్నా బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో ఇలాంటి పనులను సహించరు.