చదువుల గుడికి యావదాస్తి విరాళం! | Librarian revealed to have $4 million fortune, leaves to university he worked at for 50 years | Sakshi
Sakshi News home page

చదువుల గుడికి యావదాస్తి విరాళం!

Published Sun, Sep 4 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

చదువుల గుడికి యావదాస్తి విరాళం!

చదువుల గుడికి యావదాస్తి విరాళం!

ఏ దానం చేసినా.. ఎదుటివారు దాని నుంచి ప్రతిఫలం పొందేది కొన్నిరోజులే అందుకే అన్ని దానాల్లోకెళ్ల ఉత్తమమైనది విద్యాదానమంటారు. ఎందుకంటే.. మనిషిని తన కాళ్లమీద తాను నిలబడేలా చేసేది విద్య మాత్రమే. మరి విద్యాదానమంటే.. మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే. అమెరికాకు చెందిన రాబర్ట్‌ మొరిన్‌ అనే వ్యక్తి కూడా విద్యాదానం చేశాడు..కానీ జ్ఞానాన్ని పంచడం ద్వారా కాదు.. తన యావదాస్తిని ఇవ్వడం ద్వారా..ఆస్తి దానమివ్వడం విద్యాదానమెలా అవుతుంది? ...కదా అదెలాగో ఓసారి మీరే చదవండి...

జీవితంలో బాగా డబ్బు సంపాదిస్తున్నవారు... చిన్నప్పుడు తాము చదువుకున్న పాఠశాలకు ఎంతోకొంత విరాళామివ్వడం గురించి ఎన్నోసార్లు విన్నాం. ఎందుకంటే తాము ఇంత గొప్పవాళ్లుగా ఎదగడానికి కారణమైన పాఠశాల రుణం తీర్చుకునేందుకేనని చెబుతారు. కానీ అమెరికాలో ఓ వ్యక్తి తన యావదాస్తిని తాను చదువుకొని, ఉద్యోగం చేసిన యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చేశాడు. వివరాల్లోకెళ్తే..
అమెరికాలోని న్యూ హంప్‌షైర్‌ యూనివర్సిటీకి ఇటీవల 4 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 27కోట్ల రూపాయలు) చెక్కు విరాళంగా అందింది. అంతటి భారీ విరాళాన్ని ఎవరు ఇచ్చారా? అని చూస్తే... దానిమీద రాబర్ట్‌ మొరిన్‌ అని రాసి ఉంది. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొరిన్‌ అదే విశ్వవిద్యాలయంలో చదువుకొని, అందులోనే లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేరి, యాభై సంవత్సరాలపాటు విధులు నిర్వర్తించి ఇటీవలే చనిపోయిన వ్యక్తి. యూనివర్సిటీలో ఉద్యోగం చేసిన ఓ సామాన్య వ్యక్తి ఇంత భారీ విరాళం ఇవ్వడం గురించి తెలిసి అంతా అవాక్కయ్యారు.

న్యూ హంప్‌షైర్‌ యూనివర్సిటీలో 1961లో డిగ్రీ పూర్తి చేసిన మొరిన్‌ అందులోనే లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేస్తూ... గత ఏడాది మరణించాడు. అయితే తన మరణాంతరం తాను సంపాదించిన డబ్బు అంతా యూనివర్సిటీకే చెందాలని తన ఆర్థిక సలహాదారుతో చెప్పాడట. అందుకే అతను యూనివర్శిటీకి ఆ చెక్‌ను అందించారు. మొరిన్‌ జీవితకాలంలో ఎప్పుడూ విహారయాత్రలకు వెళ్లలేదని.. ఎక్కువగా ఖర్చు చేసేవాడు కాదని.. పాత కారులోనే తిరిగేవాడని మొరిన్‌ ఆర్థిక సలహాదారు తెలిపారు. మొరిన్‌ పంపించిన డబ్బులో లక్ష డాలర్లు లైబ్రరీ అభివృద్ధికి.. మిలియన్‌ డాలర్లు యూనివర్సిటీ ఫుట్‌బాల్‌ స్టేడియం మరమ్మతులకు ఖర్చు చేస్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మిగతా డబ్బుతో విద్యార్థుల కోసం ఒక కెరీర్‌ సెంటర్‌ను స్థాపించనున్నారట. జ్ఞానాన్ని నేర్పి.. జీవితాన్ని ఇచ్చిన చదువులగుడికి సంపన్నులు కొంత డబ్బును ఇవ్వడం సాధారణమే కానీ.. సాధారణ ఉద్యోగి తన ఆస్తినంతా విరాళంగా ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే కదా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement