ఈ చిన్నారి కోట్ల హృదయాలు గెలుచుకుంది
కాలిఫోర్నియా: పక్కవాడి కష్టాన్ని గుర్తించడం సాధరణంగా మంచి మనసున్నవారికే సాధ్యమవుతుంది. అలా గుర్తించగలిగేవారే నిజమైన మనుషులని అనిపించుకుంటారు కూడా. ఒక వేళ గుర్తించినా సహాయం చేయలేని పరిస్థితి ఉండే వారు కొందరైతే.. సహాయం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కష్టం గుర్తించి కూడా దూరంగా తొలిగిపోయేవారుంటారు. ఇలా చివరగా పేర్కొన్న వారి కళ్లు తెరుచుకునేందుకు ఈ సంఘటన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలా కళ్లు తెరిపించేలా చేసింది కూడా పట్టుమని పదేళ్లు నిండని ఓ బాలిక. అది అమెరికాలోని కాలిఫోర్నియా.. తండ్రితో కలిసి 'ఎల్లా' అనే బాలిక ఓ రెస్టారెంటుకు వెళ్లింది.
అందులో ఉన్నవారంతా ఏం చక్కా తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని లాగించేస్తున్నారు. అలాగే ఎల్లా తండ్రి ఎడ్డీ స్కాట్ కూడా వారిద్దరి కోసం ఓ స్పెషల్ ఫుడ్ ఆర్డరిచ్చాడు. అది రాగానే తినేద్దామనుకున్న ఎల్లా.. అలా కిటికీలో నుంచి బయటకు చూసింది. అప్పుడు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ నిలువ నీడలేని పెద్దాయన కూర్చుని కనిపించాడు. అతడు ఆకలితో ఉన్నాడని ఎలా గుర్తించిందో వెంటనే తండ్రికి తాను చేయబోయే పనిచెప్పి చక్కగా అతడివైపుగా నడిచి వెళ్లింది. తన కూతురు ఏం చేస్తుందా అని ఆసక్తితో వీడియో తీసుకుంటూ ఉన్నాడు. నేరుగా ఆ పాప వెళ్లి ఆ ముసలి తాతకు తాను తీసుకున్న ఆహారాన్ని అతడికి అందించింది.
ఆ ఆహారం చూసి వణుకుతున్న చేతులతో ఆత్రుతగా తీసుకొని ఆ పసిదాని వైపు ఓ చల్లని చూపు చూస్తూ అతడు సంతోషంగా తినేశాడు. ఇదంతా వీడియో తీస్తున్న తన తండ్రి మనసు ఉప్పొంగింది. చిన్నవయసులోనే ఓ వ్యక్తి ఆకలి బాధను గుర్తించిన తన చిన్నారి ఎల్లాను మరింత ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇలా చేయడం వల్ల ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటూ ప్రశ్నించాడు. ఇలా చేయడమంటే నాకు చాలా ఇష్టం అంటూ బోసినవ్వులు నవ్వడంతో తండ్రి గుండెకు హత్తుకున్నాడు. ఆ వీడియోను ఫేస్ బుక్ లో ఈ నెల 1న షేర్ చేయగా ఇప్పటి వరకు నాలుగు కోట్లమంది(42 మిలియన్లు)కి పైగా వీక్షించారు.