చిలీలో భూకంపం..
సాంటియాగో: నాలుగు రోజుల కిందట పక్కదేశం పెరూలో సంభవించిన ప్రకంపనలకు వణికిపోయిన చిలీలో మళ్లీ భారీ భూకంపం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2గా నమోదయింది. తాల్తాల్ నగరానికి ఉత్తర దిశలో 69 కిలోమీటర్ల వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియాలజికల్ సర్వే సంస్థ తెలిపింది. మంగళవారం పెరూలో 7.5 తీవ్రతగా నమోదయిన భూకంపం పొరుగుదేశాలు చిలీ, అర్జెంటీనాలను వణికించిన సంగతి తెలిసిందే.
కాగా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిదీ లేనిదీ తెలియాల్సిఉంది. దక్షిణ అమెరికా ఖండంలో తరచూ భూకంపాలు చోటుచేసుకునే చిలీలో గత సెప్టెంబర్ లో సంభవించిన భూకంపం కారణంగా ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. 2010లో 8.8 తీవ్రత సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలోనే అతిభారీ భూకంపం. నాటి దుర్ఘటనలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు.