మలాలాకు ఈయూ ప్రతిష్టాత్మక అవార్డు
లండన్: పాకిస్థాన్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌కు ప్రతిష్టాత్మక ఐరోపా పార్లమెంటు(ఈయూ) అవార్డు దక్కింది. తాలిబన్లకు ఎదురొడ్డి బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న వీరోచిత పోరాటానికిగాను ఈయూలో ఉన్నతస్థాయి అవార్డుగా భావించే ‘సఖరోవ్’ మానవ హక్కుల పురస్కారాన్ని ఆమెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్ ష్లూజ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. మలాలాలోని అద్భుత సామర్థ్యాన్ని ఐరోపా పార్లమెంటు గుర్తించిందని అన్నారు. ‘‘పిల్లలందరికీ చదువుకొనే హక్కు ఉందని, అది వారికి దక్కాల్సిందేనని మలాలా ధైర్యంగా పోరాడింది.
బాలికల విషయంలో ఈ హక్కును సాధారణంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో బాలల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 16 ఏళ్ల మలాలాపై గతేడాది తాలిబన్లు దాడిచేశారు. దీంతో మరణం అంచుల దాకా వెళ్లి ఆమె ఎట్టకేలకు బతికి బట్టకట్టింది. ప్రస్తుతం మలాలా నోబెల్ శాంతి బహుమతి రేసులో కూడా ఉంది. సఖరోవ్ అవార్డు కింద మలాలాకు 65 వేల డాలర్లు(దాదాపు రూ.40 లక్షలు) ఇవ్వనున్నారు.