కిమ్ జోంగ్ నామ్(ఫైల్ ఫోటో)
కౌలాలంపూర్: ఇటీవల కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో హత్యకు గురైన కిమ్ జోంగ్ నామ్ మృతదేహాన్ని అప్పగించే విషయంలో మలేసియా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలపై మలేసియా పోలీసు ఉన్నతాధికారి ఖలీద్ అబు బకర్ ఘాటుగా స్పందించారు. కిమ్ జోంగ్ నామ్‌కు సంబంధించిన వారు డీఎన్‌ఏ వివరాలను అందించనంతవరకు విచారణ పూర్తి కాదని, అప్పటివరకు మృతదేహాన్ని అప్పగించడం కుదరదని ఆయన తెగేసి చెప్పారు.
ఈ వ్యవహారంలో మలేసియాలోని చట్టాలకు ఉత్తరకొరియా కట్టుబడి ఉండాల్సి ఉంటుందని ఖలీద్ స్పష్టం చేశారు. 'కావాలంటే మా న్యాయవాదులు వారికి సలహా ఇస్తారు. మలేసియా చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే' అని ఖలీద్ అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు.. 45 ఏళ్ల కిమ్ జోంగ్ నామ్ కౌలాంలంపూర్ నుంచి మకావు వెళ్తుండగా సోమవారం విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. ఇద్దరు మహిళలు అతడిపై విషప్రయోగం చేసినట్లు వార్తలొచ్చాయి. సన్నిహిత కుటుంబవర్గాల వారికి మృతదేహాన్ని అప్పగిస్తామని మలేసియా అధికారులు చెబుతుండగా.. మృతదేహాన్ని కోరుతున్న ఉత్తర కొరియా రాయబార కార్యాలయం అధికారులు ఎలాంటి డీఎన్‌ఏ అధారాలను సమర్పించలేదు.