డొయన్ థి హ్యుంగ్, దాతుక్ నారన్ సింగ్
కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న వియత్నాం మహిళ డొయన్ థి హ్యుంగ్(30)కు విముక్తి లభించింది. రెండేళ్లుగా మలేసియా జైల్లో ఉన్న డొయన్ శుక్రవారం విడుదలైనట్టు ఆమె తరపు న్యాయవాది దాతుక్ నారన్ సింగ్ తెలిపారు. 2017, ఫిబ్రవరి 13న కౌలాలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జాంగ్ నామ్ హత్యకు గురయ్యారు. ఆయన ముఖ్యంపై ప్రమాదకరమైన వీఎక్స్ అనే రసాయన ద్రవ పదార్థాన్ని చిమ్మడంతో నామ్ మృతి చెందారు. ఈ కేసులో డొయన్‌తో పాటు ఇండోనేసియాకు చెందిన మరో మహిళ సితీ ఐశ్యాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై మోపిన హత్యారోపణలను మలేసియా న్యాయాధికారులు ఉపసంహరించడంతో మార్చి నెలలో జైలు నుంచి సితీ ఐశ్యా విడుదలయ్యారు.
కిమ్ జాంగ్ నామ్ హత్యకేసులో వీరు పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని డిఫెన్స్ లాయర్లు వాదించారు. కిమ్ ముఖ్యంపై చిమ్మింది విష పదార్థమని నిందితురాళ్లకు తెలియదని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన డొయన్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పుత్రజయకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం విమానంలో వియత్నాం రాజధాని హనోయ్‌కు ఆమెను పంపించనున్నారు. విమానం ఎక్కే ముందు డొయన్.. విలేకరుల సమావేశం నిర్వహిస్తారని ఆమె తరపు న్యాయవాది నారన్ సింగ్ తెలిపారు. డొయన్‌కు స్వాగతం పలికేందుకు ఆమె తండ్రి, సోదరుడు హనోయ్ విమానాశ్రయానికి వస్తారని వెల్లడించారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత గతంలో మాదిరిగానే నటన, సింగింగ్ కెరీర్‌ను ఆమె కొనసాగిస్తుందన్నారు.
డొయన్ జైలు నుంచి విడుదల కావడం పట్ల తనతో పాటు, తమ గ్రామం కూడా ఎంతో సంతోషంగా ఉందని ఆమె తండ్రి రాయిటర్స్ వార్తా సంస్థతో ఫోన్‌లో చెప్పారు. డొయన్ రాకను పురస్కరించుకుని ఆదివారం తమ గ్రామంలో పార్టీ ఏర్పాటు చేశామని, పందులను కోసి విందు భోజనం పెడతామని.. ఎవరైనా పార్టీకి రావొచ్చని అన్నారు. తన కూతురికి వేయించిన చేపలు అంటే ఇష్టమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment