
పుస్తకావిష్కరణలో మాల్యా ప్రత్యక్షం
- కార్యక్రమానికి హాజరైన బ్రిటన్‌లోని భారత హైకమిషనర్
- మాల్యాకు ఆహ్వానం లేదన్న నిర్వాహకులు
- మాల్యాను చూడగానే హై కమిషనర్ వెళ్లిపోయారన్న రచయిత
లండన్: మనీలాండరింగ్ కేసులో ప్రకటిత నేరగాడు, పరారీలో ఉన్న విజయ్ మాల్యా.. లండన్‌లో శుక్రవారం రాత్రి భారత హైకమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రత్యక్షమయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో.. రచయిత సుహేల్ సేథ్ కొత్త పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి బ్రిటన్‌లో భారత హై కమిషనర్ నవతేజ్ సర్నా ప్రత్యేక అతిథిగా హాజర వగా.. మాల్యా ప్రేక్షకుడిలా వచ్చారు. దీనిపై సామాజిక మాధ్యమం వేదికగా భారత్‌లో విమర్శలు మొదలయ్యాయి. భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ఆయనపై వారెంట్ జారీ చేస్తే.. భారత హైకమిషనర్ ఒకే కార్యక్రమంలో పాల్గొనడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి.
అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ.. హై కమిషనర్‌తో మాట్లాడిన తర్వాత ప్రకటన విడుదల చేసింది. ‘పుస్తకావిష్కరణ తర్వాత చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరుగుతుండగా.. మాల్యాను చూడగానే చర్చాగోష్టి మధ్యలోనుంచే సర్నా వెళ్లిపోయారు’అని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని రెండు భాగాలుగా విభజించారని.. మొదటిది బ్రిటన్ మంత్రి జో జాన్సన్‌తో పుస్తకావిష్కరణ-చర్చాగోష్టి కాగా.. రెండోది.. హై కమిషన్ కార్యాలయంలో పలువురు ముఖ్య అతిథులకు విందు ఏర్పాటు. అయితే, హై కమిషన్‌లో జరిగిన ఇతర కార్యక్రమంలో మాల్యాకు ఆహ్వానం లేదు. ఆయన పాల్గొనలేదు’ అని పేర్కొంది.
బహిరంగ ఆహ్వానంతోనే..
సభకు పంపిన ఆహ్వానాలపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ను వివరణ కోరగా.. అందులో మాల్యా పేరు లేదని తెలిసింది. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి ప్రచారం, ఆహ్వానితులు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవటం వల్ల మాల్యా రాక గురించి తెలియలేదని హై కమిషనర్‌కు ఎల్‌ఎస్‌ఈ తెలిపింది. అయితే.. ఇది బహిరంగ ఆహ్వానం కావటంతో ఎవరైనా రావొచ్చని, మాల్యాకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపలేదని కార్యక్రమ నిర్వాహకుడు సుహేల్ సేథ్ తెలిపారు.
‘మాల్యాను కార్యక్రమం మధ్యలో చూడగానే హైకమిషనర్ అసంతృప్తిగా లేచి వెళ్లిపోయారు. వారు మాట్లాడుకున్నారనటం అబద్ధం’ అని ట్వీట్ చేశారు. ‘మంత్రాస్ ఫర్ సక్సెస్: ఇండియాస్ గ్రేటెస్ట్ సీఈవోస్ టెల్ యు హౌ టు విన్’ అనే పుస్తకాన్ని సేథ్ రచించారు. దీని ఆవిష్కరణను 100 ఫుట్ జర్నీ క్లబ్ (భారత్-యూకే దేశాల మధ్య సమకాలీన పరిస్థితులపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన వేదిక) నిర్వహించింది.