బెర్లిన్: ఫోక్స్‌వాగన్‌ను ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా మార్చడానికి ఎంతో కృషి చేసిన, మాజీ చైర్మన్ ఫెర్డినార్డ్ పీచ్(82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచంలోనే అదిపెద్ద కార్ల తయారీదారు, విలాసవంతమైన, ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన ఫోక్స్ వ్యాగన్. రెండు దశాబ్దాల పాటు జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజ కంపెనీలో అనేక పదవులు చేపట్టి విశిష్ట సేవలందించారు.
కంపెనీ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగేలా చేసిన ఘనత ఆయన సొంతం. పీచ్ కెరీర్ విషయానికి వస్తే ప్రఖ్యాత కార్ల తయారీదారు ఫెర్డినార్డ్ పోర్షే మనమడైన పీచ్... ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడిలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఫోక్స్‌వాగన్‌లో 1993 లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2002 లో చైర్మన్‌గా ఎదిగారు. ఆ తర్వాత లంబోర్ఘిని, బెంట్లే లాంటి బ్రాండ్లను కలుపుకొని ఫోక్స్‌వాగన్ కంపెనీని ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా తయారు చేశారు. ప్రస్తుతం పీచ్ కుటుంబం వాటాలు ఫోక్స్‌వాగన్ గ్రూపులో 53 శాతంగా ఉన్నాయి.
సీఈఓ మార్టిన్ వింటర్‌కాన్ విషయంలో వివాదం కారణంగా పీచ్ 2015 ఏప్రియల్ లో చైర్మన్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కంపెనీ బోర్డ్ విశ్వాసం కోల్పొయినందునే పీచ్ తన పదవి నుంచి తప్పుకున్నారని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రకటించింది. అయితే పీచ్ తప్పుకున్న కొన్ని రోజులకే ఫోక్స్‌వాగన్ వివాదాలు చుట్టుముట్టాయి. డీజిల్ ఉద్గారాల స్కాంలో కంపెనీ చిక్కుకుంది. ఈ వివాదం నేటీకీ కొనసాగుతున్నా ఇప్పటీకీ ఫోక్స్‌వాగన్ కార్ల అమ్మకం విషయంలో ప్రధమ స్ధానంలోనే కొనసాగుతోంది. అయితే కంపెనీని ఈ స్థాయికి తీసురావడంలో కీలక భూమిక పోషించిన పీచ్ మృతి పట్ల కంపెనీకి చెందిన పలువురు ఆటో పరిశ్రమ పెద్దలు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమలో నాణ్యత, పర్‌ఫెక‌్షన్‌ను తీసుకురావడానికి ఫెర్డినాండ్ పిచ్.. ఎంతో కృషిచేశారని కంపెనీ ప్రస్తుత సీఈఓ హెర్బర్ట్ డైస్ అన్నారు. పీచ్ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన చేసిన కృషి పట్ల తనకెంతో గౌరవం ఉందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment