ఆ మహిళకు అప్పుడు తాను చేస్తున్న పని విలువ ఇంత అధికంగా ఉంటుందని తెలియదు. అందుకే అతన్ని తన కంటే ముందు వెళ్లడానికి ఒప్పుకుంది. ఒకవేళ తెలిసుంటే ఇలా ఎంత మాత్రం జరగనిచ్చేది కాదు. పాపం ఇప్పుడు ఎంత బాధపడుతుందో. ఆ రోజు ఆమె చేసిన ఆ చిన్న మేలు వల్ల అతనికి కలిగిన లాభం విలువ దాదాపు 9 కోట్ల రూపాయలు. నమ్మలేకపోతున్నా ఇది నిజం.
వివరాల ప్రకారం.. లండన్‌కు చెందిన మిస్టర్ వాల్షా లాటరీ టికెట్ కొనడానికి షాపు దగ్గరికి వెళ్లాడు. అదే సమయంలో మరో మహిళ కూడా టికెట్ కొనడానికి అదే షాప్ దగ్గరకు వచ్చింది. కానీ వాల్షా కాస్తా తొందరగా వెళ్లాలని హడావుడి పడుతుంటే సదరు మహిళ వాల్షాను టికెట్ ముందే కొనుగోలు చేయడానికి అనుమతిచ్చింది. పాపం ఆ సమయంలో ఆమె దాన్ని చిన్న సాయంగానే భావించింది. కానీ తీరా లాటరీ ఫలితాలు ప్రకటించిన రోజు ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఆ రోజు సదరు మహిళ పాపం అని వాల్షాను ఆమె కన్న ముందు టిక్కెట్ కొనడానికి అనుమతిచ్చింది కదా.. తీరా అదే ఆమె కొంప ముంచింది. ఎందుకంటే వాల్షా కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. లాటరీ ఖరీదు 1 మిలియన్ పౌండ్. అంటే మన కరెన్సీలో దాని విలువ అక్షరాల 8,98,62,361.22 రూపాయలు. ఇప్పుడు చెప్పండి.. ఇంతటి అదృష్టం వరిస్తుందని ఆ మహిళకు ముందు తెలిస్తే పాపం ఆ రోజు వాల్షాను తన కంటే ముందే టికెట్ కొనడానికి అనుమతిచ్చేది కాదేమో.
అయినా మన తెలుగు సినిమాల్లోని పాపులర్ డైలాగ్ ప్రకారం ‘మనకు రాసి పెట్టి ఉంది మనకు దక్కకుండా పోదు.. మనకు చెందని దాని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన సొంతం కాదు’. ఈ మాటలు అక్షరాల వాల్షాకు వర్తిస్తాయి. ఆ లాటరీ వాల్షాకు రాసి పెట్టి ఉండటం వల్లే ఆ రోజు ఆ మహిళ తనకంటే ముందు వాల్షా టికెట్ కొనడానికి అనుమతిచ్చింది. ఆ మహిళ సంగతి ఎలా ఉన్నా వాల్షా మాత్రం సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ముఖ్యంగా ఆ మహిళకు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నాడు.
ఈ విషయం గురించి వాల్షా.. ‘ఆ రోజు ఆ మహిళ ఆమె కంటే ముందు నన్ను టిక్కెట్ కొనడానికి అనుమతిచ్చి ఉండకపోతే నేను ఈ లాటరీని గెలుపొందే వాడిని కాదు. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని తెలిపాడు. గెలుపొందిన డబ్బుతో ఏం చేయబోతున్నారని అడగ్గా.. ‘చాలా వైభవంగా నా ప్రియురాలు సెయిరి హల్‌ను వివాహం చేసుకోవాలి. ఒక కారు కొనాలి, పెద్ద ఇళ్లు కట్టుకోవాలి’ అని బదులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment