UK man
-
డీ విటమిన్ డోస్ ఎక్కువైతే.. యమడేంజర్!
మన శరీరానికి విటమిన్-డి ఎంత కీలకమో అందరికీ తెలుసు. కానీ మన శరీరంలో అదే డీ విటమిన్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఒక్కోసారి ప్రాణంకూడా పోవచ్చు. యూకేకు చెందిన 89 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం రిటైర్డ్ వ్యాపారవేత్త డేవిడ్ మిచెనర్ హైపర్ కాల్సీమియాతో బాధపడుతున్నారు. దీంతో అతను గత ఏడాది మేలో ఆసుపత్రిలో చేరాడు. విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు ఎక్కువైనాయని వైద్యులు గుర్తించారు. పది రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తరువాత, స్థానిక వైద్య సంఘం సభ్యులు అప్రమత్తమై ఒక నివేదికను రూపొందించారు. అలాగే విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మిచెనర్ పోస్ట్‌మార్టం నివేదిక అతని విటమిన్ డీ స్థాయిలు 380 వద్ద ఉన్నట్టు తేలింది. దీంతో పెద్దల్లో విటమిన్ డీ-30 వద్ద ఉంటే చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పెద్దలకు 600 అంతర్జాతీయ యూనిట్లు (IUలు) డోసేజ్ చాలని చెప్పారు. మితిమీరిన వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విటమిన్ డీ సప్లిమెంట్ ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలను తప్పనిసరి చేయాలని నియంత్రణ సంస్థలను కోరుతూ సర్రే అసిస్టెంట్ కరోనర్ నివేదికను విడుదల చేశారు. విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కలిగే నిర్దిష్ట నష్టాలు లేదా దుష్ప్రభావాల గురించి వివరించే ప్యాకేజింగ్‌లో లేదా ప్యాకేజింగ్‌లో ఎటువంటి హెచ్చరిక లేదని కరోనర్ జోనాథన్ స్టీవెన్స్ తన అధికారిక నివేదికలో రాశారు. ఇకనైనా దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
68 ఏళ్ల సర్వీస్‌లో.. ఒక్కరోజు లీవ్ పెట్టలేదు మరి!
నిబద్ధతతో, నిజాయితీతో పని చేసే ఉద్యోగులే ఒక కంపెనీకి నిజమైన సంపద!. ఇలాంటి డెడికేషన్తోనే ఇక్కడో పెద్దాయన ఒకే కంపెనీలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పని చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్కు కంపెనీ అవకాశం ఇచ్చినా.. ఇంకా కొన్నేళ్లపాటు సర్వీస్‌లోనే కొనసాగాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్లలో జబ్బు చేసిందని ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదు ఆయన. అందుకే కంపెనీ సైతం సర్వీస్‌ను ఆయన ఇష్టమైనంత కాలం పొడిగించింది. 83 ఏళ్ల వయసులోనూ హుషారుగా పనిచేస్తున్న బ్రెయిన్ క్రోలే గురించి ఆసక్తికర కథనం.. సౌత వెస్ట్ ఇంగ్లండ్ సోమర్సెట్లో నివాసం ఉండే బ్రియన్ కోర్లే.. 1953లో తన 15 ఏళ్ల వయసులో సీ అండ్ జే క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. పేదరికం కారణంగా తండ్రి ఆర్మీలో చేరితో.. కుటుంబ పోషణలో భాగం కావాలని చిన్నవయసులో బ్రియన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏజ్ వల్ల మొదట కంపెనీ అతన్ని తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చదువుకుంటూనే పనికి వస్తానని చెప్పడంతో అప్పుడు ఓకే చెప్పింది. అలా ఓవైపు స్కూల్.. మరోవైపు ఫ్యాక్టరీ.. సమ్మర్ హాలీడేస్ పూర్తిస్థాయి పనికే అంకితం అయ్యాడు. వారంలో 45 గంటల పని.. వచ్చిన డబ్బంతా అమ్మకు ఇచ్చేసేవాడు. అలా ఏళ్లు గడిచినా.. క్లార్క్స్ కంపెనీతో అతని బంధం కొనసాగుతూ వస్తోంది. ఇంతలో కంపెనీ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి.. అవుట్లెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి బ్రియన్ వయసు 50 ఏళ్లు. అన్నేళ్లపాటు కంపెనీలో కొనసాగినందుకు ప్రతిగా.. అతని అవుట్లెట్ విభాగానికి బదిలీ చేసింది. దీంతో బ్రియన్ సేవలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్రియన్ వయసు 83 ఏళ్లు. కంపెనీ రికార్డుల్లో ఈయనగారు ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదని ఉంది. ఇంకో వందేళ్లైనా ఇదే కంపెనీలో పని చేస్తానంటూ హుషారుగా చెప్తున్నాడు ఈ తాత. ఇంతకీ ఈ పెద్దాయన ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ ఫ్రెడెరిక్ అట్టెన్బర్గ్. 95 ఏళ్ల వయసులో హుషారుగా ఈ పెద్దాయన రిటైర్మెంట్ లేకుండా పని చేస్తున్నాడు. ఒకవైపు ప్రకృతి ప్రేమికుడిగా వైల్డ్ లైఫ్ ఫిల్మ్‌మేకింగ్‌తో, మరోవైపు బ్రాడ్‌కాస్టింగ్ ప్రొఫెషనలిజంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అట్టెన్బర్గ్. అందుకే సర్ డేవిడ్లా తాను సుదీర్ఘకాలం ఇష్టమైన పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడట!. పనిలో ఇష్టం.. నిజాయితీ.. దేవుడంటే నమ్మకం.. ఆరోగ్యవంతమైన జీవనం ఇదే తన కెరీర్ రహస్యం అంటున్నారు బ్రియన్ కోర్లే. -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే.. -
ఆమె వల్లే 9 కోట్ల రూపాయలు గెలిచాను
ఆ మహిళకు అప్పుడు తాను చేస్తున్న పని విలువ ఇంత అధికంగా ఉంటుందని తెలియదు. అందుకే అతన్ని తన కంటే ముందు వెళ్లడానికి ఒప్పుకుంది. ఒకవేళ తెలిసుంటే ఇలా ఎంత మాత్రం జరగనిచ్చేది కాదు. పాపం ఇప్పుడు ఎంత బాధపడుతుందో. ఆ రోజు ఆమె చేసిన ఆ చిన్న మేలు వల్ల అతనికి కలిగిన లాభం విలువ దాదాపు 9 కోట్ల రూపాయలు. నమ్మలేకపోతున్నా ఇది నిజం. వివరాల ప్రకారం.. లండన్‌కు చెందిన మిస్టర్ వాల్షా లాటరీ టికెట్ కొనడానికి షాపు దగ్గరికి వెళ్లాడు. అదే సమయంలో మరో మహిళ కూడా టికెట్ కొనడానికి అదే షాప్ దగ్గరకు వచ్చింది. కానీ వాల్షా కాస్తా తొందరగా వెళ్లాలని హడావుడి పడుతుంటే సదరు మహిళ వాల్షాను టికెట్ ముందే కొనుగోలు చేయడానికి అనుమతిచ్చింది. పాపం ఆ సమయంలో ఆమె దాన్ని చిన్న సాయంగానే భావించింది. కానీ తీరా లాటరీ ఫలితాలు ప్రకటించిన రోజు ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ రోజు సదరు మహిళ పాపం అని వాల్షాను ఆమె కన్న ముందు టిక్కెట్ కొనడానికి అనుమతిచ్చింది కదా.. తీరా అదే ఆమె కొంప ముంచింది. ఎందుకంటే వాల్షా కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. లాటరీ ఖరీదు 1 మిలియన్ పౌండ్. అంటే మన కరెన్సీలో దాని విలువ అక్షరాల 8,98,62,361.22 రూపాయలు. ఇప్పుడు చెప్పండి.. ఇంతటి అదృష్టం వరిస్తుందని ఆ మహిళకు ముందు తెలిస్తే పాపం ఆ రోజు వాల్షాను తన కంటే ముందే టికెట్ కొనడానికి అనుమతిచ్చేది కాదేమో. అయినా మన తెలుగు సినిమాల్లోని పాపులర్ డైలాగ్ ప్రకారం ‘మనకు రాసి పెట్టి ఉంది మనకు దక్కకుండా పోదు.. మనకు చెందని దాని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన సొంతం కాదు’. ఈ మాటలు అక్షరాల వాల్షాకు వర్తిస్తాయి. ఆ లాటరీ వాల్షాకు రాసి పెట్టి ఉండటం వల్లే ఆ రోజు ఆ మహిళ తనకంటే ముందు వాల్షా టికెట్ కొనడానికి అనుమతిచ్చింది. ఆ మహిళ సంగతి ఎలా ఉన్నా వాల్షా మాత్రం సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ముఖ్యంగా ఆ మహిళకు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఈ విషయం గురించి వాల్షా.. ‘ఆ రోజు ఆ మహిళ ఆమె కంటే ముందు నన్ను టిక్కెట్ కొనడానికి అనుమతిచ్చి ఉండకపోతే నేను ఈ లాటరీని గెలుపొందే వాడిని కాదు. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని తెలిపాడు. గెలుపొందిన డబ్బుతో ఏం చేయబోతున్నారని అడగ్గా.. ‘చాలా వైభవంగా నా ప్రియురాలు సెయిరి హల్‌ను వివాహం చేసుకోవాలి. ఒక కారు కొనాలి, పెద్ద ఇళ్లు కట్టుకోవాలి’ అని బదులిచ్చాడు. -
శృంగారానికి పర్మిషన్ తీసుకోవాల్సిందే..!
లండన్: ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి నార్త్ యార్క్‌షైర్ మేజిస్ట్రేట్ కాస్త భిన్నమైన శిక్ష ఖరారు చేశారు. గతంలో ఎప్పడు ఇలాంటి తీర్పును మనం విని ఉండకపోవచ్చు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 2015లో ఓ వ్యక్తి(40) మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకూ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదు. గత డిసెంబర్ లో మొదటసారి ఈ కేసుపై విచారణ జరిగింది. తాజాగా రెండోసారి ఆ అత్యాచారం కేసు విచారణకు వచ్చింది. నార్త్ యార్క్‌షైర్ లోని నార్త్అలర్టన్ మేజిస్ట్రేట్ నాలుగు నెలలపాటు అతడికి ఓ శిక్ష ఖరారు చేశారు. సెక్స్ చేయాలనుకున్న ఒక రోజు ముందే తమకు వివరాలు తెలపాలని సూచించారు. అందరిలాగా అతను తనకు నచ్చిన ఏ మహిళతోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ, సెక్స్ చేయాలని అతడు భావించినప్పుడు కచ్చితంగా 24 గంటల ముందే పోలీసులకు వివరాలందించాలని తీర్పు ఇచ్చారు. ఎవరితో(యువతి, మహిళలు)అయితే శృంగారంలో పాల్గొంటాడో వారి పూర్తి వివరాలను తెలియజేయాలట. అంతేకాకుండా ఆ యువతి పేరు సహా పుట్టినతేదీ, ఈ-మెయిల్ అడ్రస్ లాంటి వివరాలను కచ్చితంగా అందించాలట. ఒకవేళ సమాచారం ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా శృంగారంలో పాల్గొంటే అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. 2015 మార్చిలో వచ్చిన కొన్ని నూతన చట్టాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఏ వ్యక్తి నుంచి అయినా స్త్రీలకు సెక్స్ పరమైన ఇబ్బందులు, వారిపై అత్యాచార దాడులు జరగవచ్చని భావిస్తే అలాంటి వారికి ఈ శిక్ష విధించవచ్చని ఇంగ్లండ్ నూతన చట్టాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నిందితుడు వాడుతున్న సెల్ ఫోన్ వివరాలు.. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంటర్నెట్ లో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాడు తదితర అంశాలపై కూడా ఆంక్షలు విధించారు. వినడానికి వింతగా ఉన్నా ఇంగ్లండ్, వేల్స్ లలో ఈ రకమైన చట్టాలను గతేడాది అమల్లోకి తీసుకొచ్చారు.