పారిస్‌లో నరమేధం | massacre in paris causes 128 dead, several injured | Sakshi
Sakshi News home page

పారిస్‌లో నరమేధం

Published Sun, Nov 15 2015 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

పారిస్‌లో నరమేధం

పారిస్‌లో నరమేధం

ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి మారణహోమం సృష్టించారు. సరిగ్గా ఏడేళ్ల కిందట భారతదేశంలోని ముంబై నగరంపై ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన తరహాలోనే ఉగ్రవాదులు పారిస్‌పై దాడికి తెగబడ్డారు. ఎనిమిది మంది ఉగ్రవాదులు బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో పాటు ఆత్మాహుతి దాడులతో అమాయక ప్రజలపై పంజా విసిరారు. ఫుట్‌బాల్ క్రీడ జరుగుతున్న పారిస్ అంతర్జాతీయ స్టేడియం, రాక్ బ్యాండ్ ప్రదర్శన జరుగుతున్న బాతాక్లాన్ థియేటర్‌లతో పాటు.. పలు కెఫేలపై విచక్షణారహితంగా తూటాలు, బాంబులు పేల్చారు.  ఈ మారణహోమంలో 128 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

 

స్టేడియం వద్ద బాంబులు పేలినప్పుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు స్టేడియం లోపల ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. పేలుళ్ల అనంతరం ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:30 గంటల (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3:00 గంటలు) నుంచి మొదలైన ఈ మారణకాండ అర్ధరాత్రి 12 గంటల వరకూ కొనసాగింది. దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో ఏడుగురు ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోగా.. ఒకరిని పారిస్ పోలీసులు హతమార్చారు. ఇంకా ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న అనుమానాలతో ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి.. సరిహద్దులను మూసివేశారు.

 

ఈ దాడి తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా) ప్రకటించింది. ఇది ఇస్లామిక్ స్టేట్ దురాగతమేనన్న హోలాండ్.. దాడిని తమ దేశంపై యుద్ధంగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తామని.. అందులో నిర్దయగా వ్యవహరిస్తామని ప్రకటించారు. పారిస్‌పై ఉగ్రదాడితో ప్రపంచం యావత్తూ నివ్వెరపోయింది. ఇది మానవ జాతిపైనే దాడి అని... భారత్, అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్, ఇరాన్ సహా ప్రపంచ దేశాల అధినేతలంతా ముక్తకంఠంతో ఖండించారు.

 

  •                 బాంబులు, తుపాకులు, ఆత్మాహుతి దాడులతో తెగబడ్డ ముష్కరులు
  •                 బాతాక్లాన్ థియేటర్‌లో ప్రజలను బంధించి 82 మంది ఊచకోత
  •                 స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం వద్ద ఆత్మాహుతి, బాంబు దాడులు
  •                 స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న అధ్యక్షుడు హోలాండ్ సురక్షితం
  •                 సమీపంలోని రెస్టారెంట్లు, కెఫేలపై తుపాకీ కాల్పులతో బీభత్సం
  •                 ఏడు చోట్ల ఉగ్రదాడులు.. 128 మంది మృతి, 300 మందికి గాయాలు
  •                 8 మంది ఉగ్రవాదులు హతం.. వారిలో ఏడుగురు ఆత్మాహుతి
  •                 ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితి విధింపు.. సరిహద్దుల మూసివేత
  •                 దాడి చేసింది మేమే.. సిరియాలో దాడులకు ప్రతీకారం: ఐఎస్‌ఐఎస్
  •                 ఇది ఫ్రాన్స్‌పై యుద్ధం.. నిర్దయగా తిప్పికొడతాం: హోలాండ్
  •                 దాడిపై ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి.. మోదీ సహా దేశాధినేతల ఖండన

 

 

 ప్రపంచ కళాసాహిత్యాల కాణాచి పారిస్.. ఉగ్రరక్కసి కరాళనృత్యంతో నెత్తురోడింది. ఉగ్రవాదుల రక్తపిపాసకు ఫ్రాన్స్ రాజధానిలో అమాయక ప్రజలు బలయ్యారు. పగటి పూట పనులు ముగించుకుని సాయంత్రం దాటాక క్రీడా, సాహిత్య, సంగీత కార్యక్రమాలతో సేదతీరుతున్న జనంపై ముష్కర మూకలు పంజావిసిరాయి. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులుగా భావిస్తున్న దుండగులు ఆత్మాహుతి దాడులు, బాంబులు, తుపాకీ కాల్పులతో విరుచుకుపడ్డారు. ఏడేళ్ల కిందట ముంబై మహానగరంలో సాగించిన తరహాలోనే నరమేధానికి తెగబడ్డారు. వారి దాడిలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయపడ్డారు.

 

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:30 గంటలకు.. తొలుత స్టేడ్ డి ఫ్రాన్స్ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అది మొదలు అర్ధరాత్రి 1 గంట వరకూ.. మూడున్నర, నాలుగు గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మారణహోమం సాగించారు. నగరంలోని పలు రెస్టారెంట్లు, కెఫేలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఏడేళ్ల కిందట ముంబై నగరంపై జరిగిన ఉగ్రదాడి తరహాలోనే.. సంగీత ప్రదర్శన మందిరమైన బాతాక్లాన్ థియేటర్‌లో ప్రజలను బంధించి 82 మందిని ఊచకోత కోశారు. పోలీసుల ప్రతి దాడితో రాత్రి 1 గంట తర్వాత మారణకాండ ముగిసింది. మొత్తం 8 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొనగా.. వారిలో ఏడుగురు ఆత్మాహుతితో చనిపోయారు. ఒకరు పోలీసు కాల్పుల్లో హతమయ్యారు.

 

స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం గేట్లు

 సెంట్రల్ పారిస్‌కు ఉత్తరంగా ఉన్న ఫ్రాన్స్ అంతర్జాతీయ స్టేడియం స్టేడ్ డి ఫ్రాన్స్‌లో.. ఫ్రాన్స్ - జర్మనీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ కూడా స్టేడియంలో ఈ మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. స్టేడియంలో 80 వేల మంది ప్రేక్షకులు ఉన్నారు. రాత్రి 8:30 గంటల సమయంలో స్టేడియం రెండు ప్రవేశ మార్గాల వద్ద రెండు ఆత్మాహుతి దాడులతో పేలుళ్లు సంభవించాయి. స్టేడియం సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ దగ్గర ఒక బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారు. స్టేడియం వద్ద పేలుళ్లతో లోపలున్న ప్రేక్షకులు భీతావహులయ్యారు. ఆట ముగిసిన తర్వాత అందరూ మైదానంలోకి చేరుకుని భయంభయంగా కాలం గడిపారు కానీ.. బయటకు వెళ్లేందుకు సాహసించలేదు. పేలుళ్ల నేపథ్యంలో అధ్యక్షుడు హొలాండేను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

 

పెటిట్ కాంబోడ్జే, లె కారిలాన్ రెస్టారెంట్లు

 స్టేడియం వద్ద పేలుళ్లు జరిగిన దాదాపు గంట తర్వాత.. అక్కడికి సుమారు ఐదు మైళ్ల దూరంలోని పెటిట్ కాంబోడ్జే, లె కారిలాన్ రెస్టారెంట్లపై ఉగ్రవాదులు కాల్పులతో దాడులు జరిపారు. ఈ దాడిలో రెస్టారెంట్లలో ఉన్న వారిలో 14 మంది చనిపోయారు.

 

బాతాక్లాన్ సమీపంలోని రెస్టారెంట్లు

 పెటిట్ కాంబోడ్జే రెస్టారెంట్‌కు దక్షిణంగా ఉన్న బాతాక్లాన్ థియేటర్ సమీపంలో లా బెలె ఎక్విపె బార్, బౌల్వార్డ్ వాల్టేర్ కెఫేలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దాడిలో కెఫేల్లో ఉన్న వారిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

బాతాక్లాన్ థియేటర్

 అమెరికాకు చెందిన రాక్ బ్యాండ్ (రాక్ మ్యూజిక్ బృందం) ‘ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్’ సంగీత ప్రదర్శన జరుగుతున్న బాతాక్లాన్ థియేటర్‌లో ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు దాదాపు 100 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసిరి 82 మంది ప్రాణాలను బలిగొన్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి మారణ కాండ సాగింది. పోలీసులు, కమెండోలు దూసుకొచ్చేసరికి ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు జాకెట్లు పేల్చుకుని చనిపోయారు. మరొక ఉగ్రవాది పోలీసు కాల్పుల్లో చనిపోయాడు.

 

కాసా నో స్ట్రాపిజేరియా

 బాతాక్లాన్‌కు కూత వేటు దూరంలోని కాసా నోస్ట్రాపిజేరియా కెఫేపై ఉగ్రవాదులు తుపాకులతో దాడి చేశారు. ఐదుగురు చనిపోయారు.

 

దాడి చేసింది మేమే: ఐఎస్‌ఐఎస్

పారిస్‌లో దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ప్రకటించింది. అరబిక్, ఫ్రెంచి భాషల్లో ఇంటర్‌నెట్‌లో విడుదల చేసిన ప్రకటనను.. ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు. అది నిజంగా ఐఎస్‌ఐఎస్ విడుదల చేసిన ప్రకటనేనా అనేది నిర్ధారించటం సాధ్యం కాకపోయినప్పటికీ.. ఆ సంస్థ గత ప్రకటనల్లాగే ఉండటంతో పాటు ఐఎస్ లోగో కూడా ఉంది. ఇదిలావుంటే.. బతాక్లాన్ థియేటర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఫ్రాన్స్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేస్తున్నామని వ్యాఖ్యానించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడిలో హతులైన ఉగ్రవాదుల్లోని ఒక మృతదేహం సమీపంలో సిరియా పాస్‌పోర్ట్ లభించిందని పారిస్ పోలీసులు తెలిపారు. బతాక్లాస్ వద్ద దాడికి పాల్పడ్డ వారిలో ఒకరిని వేలిముద్రల ద్వారా గుర్తించినట్లు చెప్పారు.

 

ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి...

ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు హోలాండ్ ప్రకటించారు. దేశ సరిహద్దులను మూసివేశారు. నగరంలో ఇంకా ఉగ్రవాదులు సంచరిస్తున్నారేమోనన్న అనుమానంతో భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు అధ్యక్షుడు హోలాండ్ బాతాక్లాన్ థియేటర్‌ను సందర్శించారు. పారిస్‌లోని పాఠశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణాలు, టెన్నిస్ కోర్టులు, ఆహార మార్కెట్లు, మ్యూజియంలతో పాటు.. విఖ్యాత ఈఫిల్ టవర్ సహా డిస్నీల్యాండ్ పారిస్ తదితర ప్రధాన పర్యాటక కేంద్రాలను శనివారం మూసివేశారు.

 

శనివారం జరగాల్సిన క్రీడలు, ఇతర కార్యక్రమాలను రద్దుచేశారు. యూరోపియన్ చాంపియన్స్ కప్ రగ్బీ మ్యాచ్, ఐరిష్ రాక్ బ్యాండ్ యూ2 ప్రదర్శనలు రద్దయ్యాయి. నగరంలో అర్థరాత్రి వరకూ ఉగ్రదాడి జరగటంతో పారిస్‌లో అత్యధికులు ప్రజలు శనివారం ఉదయం ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. అయితే.. క్షతగాత్రులకు సాయం చేయటం కోసం వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. దాడులు జరిగిన ప్రాంతాలకు చేరుకుని మృతులకు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాలులు అర్పించారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు.

 

ఐఎస్‌కు గుణపాఠం నేర్పుతాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్

పారిస్: తమ దేశ రాజధాని నగరంలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థకు తగిన బుద్ధి చె బుతామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండ్ అన్నారు. ఇప్పటికే ఐఎస్ స్థావ రాలపై అమెరికన్ సైన్యంతో కలిసి దాడులు జరుపుతున్న ఫ్రాన్స్ సైన్యం ఆ మతోన్మాద ఉగ్రవాద సంస్థ చర్యలను ఏ మాత్రం సహించదని హోలాండ్ స్పష్టం చేశారు.

 

పారిస్‌లోని కేఫ్‌లలో జరిగిన కాల్పులు, నేషనల్ స్టేడియంలో జరిగిన ఆత్మాహుతి దాడి, కన్సర్ట్‌హాల్ లోపల ఉగ్రవాదులు సాగించిన హత్యాకాండతో మొత్తం 127 మంది అమాయక ప్రజలు బలయ్యారని హోలాండ్ వివరించారు. అత్యవసర భద్రతా సమావేశం అనంతరం హోలాండ్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛవాద దేశమైన ఫ్రాన్స్‌పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఈ యుద్ధోన్మాద చర్యలకు పాల్పడిందన్నారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఎంతమంది, వారి ఉద్దేశాలేమిటి, వారి జాతీయత ఏది, అనే అంశాల గురించి పరిశోధన జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement