paris attacks
-
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు మళ్లీ కుట్ర!
పారిస్: న్యూ ఇయర్ దగ్గర పడతున్న కొద్దీ ఇతర దేశాలు ఎలా ఉన్నాయో కానీ, ఫ్రాన్స్ మాత్రం చాలా అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్లు ఫ్రాన్స్ అధికారులు గుర్తించి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం ఫ్రాన్స్ నైరుతి దిశగా అధికారులు చేపట్టిన విస్తృత తనిఖీలలో భాగంగా ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. టోలూస్ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా చేసుకుని దాడుకలు పథకం పన్నిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరిని అదుపులోకి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల వరకూ తనిఖీలు చేపట్టి, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని నగరాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆ దేశాల నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకే ముఖ్యంగా ఈ దేశాలలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే మార్కెట్లు, ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. పారిస్ దుర్ఘటన తర్వాత అగ్రరాజ్యం అమెరికాలోనూ కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 130 మందికి పైగా మృతిచెందగా, దాదాపు 300 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. -
ఫ్రాన్సులో మళ్లీ ఉగ్రదాడి?
ఫ్రాన్సులో మరో ఉగ్రదాడి ఘటన శనివారం కలకలం రేపింది. మధ్య ప్యారిస్‌లోని ఒక చర్చిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అక్కడ సెక్యూరిటీ ఆపరేషన్ కొనసాగుతోందని.. అందువల్ల ప్రజలు ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. అయితే ఆపరేషన్ నిర్వహించిన భద్రతా సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని తేల్చింది. పారిస్‌లో కనీవినీ ఎరగని రీతిలో 2015 నవంబర్ 13న జరిగిన ఉగ్రదాడిలో 130 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఫ్రాన్స్ ప్రభుత్వం నరమేధానికి కారకులైనవానిని కొద్ది గంటల్లోనే మట్టుపెట్టామని ప్రకటించింది. -
పారిస్ ప్రభుత్వంపై పదుల కేసులు
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫ్రెంచ్ గవర్నమెంటుపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల కారణంగా తమవారిని కోల్పోయామని, తీరని నష్టం చవిచూశామని ఈ విషయంలో ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొంటూ ఆ దేశ అగ్ర న్యాయస్థానంలో మూకుమ్మడిగా అభియోగాలు మోపనున్నారు. ఈ మేరకు వారి తరుపు న్యాయవాది మీడియాకు వెల్లడించాడు. గత ఏడాది నవంబర్ 13న పారిస్ నగరంపై ఉగ్రవాదులు విరుచుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 130మంది ప్రాణాలుకోల్పోగా 250మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది ఇప్పుడు ఫ్రెంచ్ సర్కారుని బాధ్యురాలిగా చేస్తూ కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘ఉగ్రవాదుల దాడులను ముందుగా పసిగట్టి నిలువరించలేకపోయిన ఫ్రాన్స్ సర్కారును ఎండగట్టేందుకు సాధ్యమైనన్ని అన్ని పనులు చేస్తాం అని వారు ప్రకటించారు’ అని మైత్రీ సమియా మక్తోఫ్ అనే న్యాయవాది చెప్పారు. -
క్షణాల్లో దేహం రెండుగా చీలిపోయింది..!
ఫ్రాన్స్: ప్యారిస్ రెస్టారెంట్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బ్రహీం అబ్దేస్లామ్ (31) ఆత్మాహుతి దాడి ఘటన లైవ్ సీసీటీవీ ఫుటేజీని తొలిసారి ఫ్రాన్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో అబ్దెస్లామ్ శరీరం రెండు ముక్కలు కావడం కనిపించింది. గత ఏడాది నవంబర్ 13న కాంప్టాయిర్ వోల్టేయిర్ బ్రస్సేరిలో అబ్దెస్లామ్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 130 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియోలో చూపిన ప్రకారం తొలుత బ్రహీం ఓ కారులో దిగాడు. అనంతరం రెస్టారెంటులోపలికి అడుగుపెట్టి ఓ ఖాళీ టేబుల్ వద్దకు వచ్చాడు. మరోసారి టేబుల్ నుంచి లేచి డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఏదో ఆలోచించి కొంత కలత చెందుతున్నట్లుగా కలత చెందాడు. ఆ తర్వాత తిరిగి అదే టేబుల్ వద్దకు వచ్చికి తన ఎడమ చేత్తో ముఖాన్ని కవర్ చేస్తూ.. కిందికి చూశాడు. అనంతరం స్యూసైడ్ బెల్ట్ బటన్ నొక్కాడు. క్షణాల్లో భారీ శబ్ధం రావడంతోపాటు రెస్టారెంటుమొత్తం పొగలు కమ్మింది. అతడి దేహం రెండు ముక్కలుగా చీలిపోయింది. -
పారిస్ దాడులు: భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు
పారిస్: వేగంగా దూసుకొచ్చిన కారు.. సర్రుమంటూ బ్రేకుల శబ్ధంచేస్తూ ఆగింది. కారులోనుంచి ఒకడు కిందికి దిగాడు. 'వాళ్లు' ఎప్పుడూ వేసుకున్నట్లే నలుపు రంగు దుస్తులు ధరించి లోపలికి వచ్చాడు. తన ముఖంలోని భావాలు ఎవరికీ కనిపించకుండా చేతిని అడ్డంపెట్టుకున్నాడు. లోపల ఓ ఖాళీ టేబుల్ వైపునకు నడుస్తూ.. మధ్యలోనే ఆగిపోయాడు. పెదవులు, చేతులు ప్రార్థన చేస్తున్నట్టున్నాయి. చేతిని నడం మీదకు పోనిచ్చి మీట నొక్కినట్లనిపించింది. అంతే. బ్రహిమ్ అబ్దేస్లామ్ రెండు ముక్కలైపోయాడు. నడుము కట్టుకున్న బెల్ట్ బాంబు అతడి శరీరాన్ని ముక్కలుచేస్తూ పక్కనున్నవాళ్ల ప్రాణాలనూ హరించింది. గత ఏడాది నవంబర్ 13న పారిస్ నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రమూక సృష్టించిన నరమేధానికి సంబంధించిన భయంకరమైన దృశ్యమిది. కాంప్టైర్ వోల్టెయిర్ రెస్టారెంట్ లో ఐఎస్ ఉగ్రవాది బ్రహిమ్ తనను తాన పేల్చుకున్నప్పుడు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్ కు చెందిన ఎం6 మీడియా సంస్థ మొదటిగా ఈ దృశ్యాలను ప్రసారంచేసింది. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో కనీవినీ ఎరగని రీతిలో 2015 నవంబర్ 13న జరిగిన ఉగ్రదాడిలో 130 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఫ్రాన్స్ ప్రభుత్వం నరమేధానికి కారకులైనవానిని కొద్ది గంటల్లోనే మట్టుపెట్టామని ప్రకటించింది. కాగా, ఇంకొంతమంది సూత్రధారులకోసం వేట కొనసాగుతోంది. ఫ్రాన్స్ లో మరో ఏడాది వరకు అత్యవసరపరిస్థితులు కొనసాగనున్నాయి. -
మా తల్వార్లకు వారే లక్ష్యం!!
-
మా తల్వార్లకు వారే లక్ష్యం!!
బీరట్, లెబానాన్: పారిస్‌లో 130 మందిని పొట్టనబెట్టుకున్న నరమేధానికి పాల్పడిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు వీరేనంటూ ఐఎస్ఐఎస్ గ్రూపు ఓ వీడియో విడుదల చేసింది. నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు, ఇద్దరు ఇరాకీలు పారిస్ దాడిలో పాల్గొన్నారని తమ వెబ్సైట్లలో పోస్టుచేసిన ఈ వీడియోలో పేర్కొంది. 'వాళ్లు ఎక్కడ కనిపిస్తే.. అక్కడ చంపండి' పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటనే తమ తదుపరి లక్ష్యమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. 2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ ఫైటర్లపై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలన్నింటికీ ఈ సందేశం వర్తిస్తుందని ఫ్రెంచ్, అరబ్ భాషలో ఉగ్రవాదులు ఈ వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియోలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఫొటోను చూపించి.. దానితోపాటు 'అవిశ్వాసులతో జతకలిసే ప్రతి ఒక్కరూ మ తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే' అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నారు. పారిస్ దాడితో ఫ్రాన్స్‌ను గడగడలాడించిన తొమ్మిది మంది ఉగ్రవాదులు 'సింహాల్లాంటి' వారని ఈ వీడియోలో పేర్కొన్నారు. పారిస్ దాడికి ముందు ఈ ఉగ్రవాదులు తమకు చిక్కిన నిస్సహాయుల్ని తలనరికి చంపుతున్న దృశ్యాలను ఇందులో చూపించారు. ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన 'అల్ హయత్' ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో పారిస్ దాడి ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా చూపించారు. -
అగ్రరాజ్యంలో ముస్లింలపై పెరిగిన దాడులు!
వాషింగ్టన్: పారిస్ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అమెరికాలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ తాజా నివేదికలో వెల్లడించింది. సాన్‌బెర్నార్డినో కాల్పుల ఘటన కూడా ఇందుకు ఓ కారణమని నివేదిక అభిప్రాయపడింది. పారిస్ ఘటన అనంతరం అమెరికాలో మత విద్వేషంతో ముస్లింలపై జరుగుతున్న దాడులు మూడు రెట్లు పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా దాడులు సరాసరిగా నెలకు 12 గా నమోదు కాగా, పారిస్ ఉగ్రదాడుల అనంతరం ఆ సంఖ్య 38 గా నమోదైనట్లు నివేదిక తెలిపింది. ఇటీవల రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్.. ముస్లింలను అమెరికాలోకి రాకుండా చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటం అగ్రరాజ్యంలోని ముస్లింలను కలవరపెడుతోంది. -
'అటాక్‌కు వాట్సాప్ వాడారు'
వాషింగ్టన్: పారిస్ దాడులకు సంబంధించి విచారణ అధికారులు తొలిసారి కొన్ని అధికారిక ప్రకటనలు చేశారు. దాడులకు పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సంకేత సంక్షిప్త సందేశ యాప్స్‌ను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. దాడి అంశాన్ని ఎవరూ గుర్తించకుండా ఈ యాప్స్ ద్వారానే దాచిపెట్టి ఉంచినట్లు చెప్పారు. అయితే, ఆ సంకేత రూపంలో ఉన్న సందేశాల్లో ఉన్న సమాచారం ఏమిటనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆ భాషను ఇంకా వారు గుర్తించలేకపోయారని కూడా తెలుస్తోంది. పారిస్ దాడులు జరిగిన తర్వాత విచారణ అధికారులు చేసిన తొలి అధికారిక ప్రకటన ఇదే. గతంలో దాడులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో కొన్ని సంకేత సంక్షిప్త సందేశ యాప్స్ ఉన్నాయని చెప్పారు.. కానీ ఆ అంశాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అనంతరం కొద్ది రోజులపాటు వాటిని పరిశీలించిన అధికారులు కుట్రకు సంబంధించి ఉగ్రవాదులు తమనుతాము సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్, టెలిగ్రాంవంటి యాప్స్ ను ఉపయోగించారని, తమ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారని గుర్తించారు. అయితే, ఈ యాప్స్ లలో ఇంకా ఎలాంటి ఆధారాలు మాత్రం అధికారులకు తెలియలేదు. విచారణ పూర్తయితేగానీ, మొత్తం సమాచారం వివరించలేమని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. -
ఆల్‌ఖైదా వర్సెస్ ఐఎస్ఐఎస్!
బీరుట్: మాలిలో జరిగిన తాజా ఉగ్రవాద దాడి ఓ విషయాన్ని బట్టబయలు చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలైన ఆల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ మధ్య అస్సలు పొసగడం లేదని, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు శత్రువులుగా వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని చాటింది. ఆఫ్రికా దేశం మాలిలో ఓ హోటల్లో ఆల్‌ఖైదాకు చెందిన అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాడులకు తెగబడి 18మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. భద్రతా దళాలు హోటల్లో చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. ఈ ఆపరేషన్ ఇలా ముగిసిందో లేదో.. ఆన్లైన్లో ఆల్‌ఖైదా-ఐఎస్ఐస్ మద్దతుదారులు పరస్పర విమర్శలతో వాగ్యుద్ధానికి తెరలేపారు. మాలిలో దాడుల నుంచి ఐఎస్ఐఎస్ పాఠాలు నేర్చుకోవాలని ఆల్‌ఖైదా మద్దతుదారుడైన ఓ వ్యక్తి ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఆల్‌ఖైదా తరఫున తాను సిరియాలో ఫైటర్‌గా ఉన్నానని పేర్కొన్న అతను ఐఎస్ఐఎస్ వ్యూహాలను తప్పుబట్టాడు. 'అల్లాహు ఆలం' పేరిట ఉన్న మరో యూజర్.. 'మాలి తరహా దాడులు చేయడం ఐఎస్ఐఎస్కు చేతకాదని దెప్పిపొడిచాడు. మాలిలో దాడి వారం రోజుల ముందు గత శుక్రవారం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పారిస్‌లో నరమేధం తలపెట్టి 130మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐఎస్ఐఎస్ మొదట సిరియాలో ఆల్‌ఖైదా ఆధ్వర్వంలోనే పనిచేసింది. సిరియాలో వ్యూహాల విషయలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బయటకొచ్చిన ఐఎస్ఐఎస్ ఆ తర్వాత ప్రబల ఉగ్రవాద గ్రూపుగా మారింది. ఆల్‌ఖైదాను అధిగమించి.. అంతర్జాతీయంగా వణుకు పుట్టిస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య వైరం ఆన్లైన్లో తరచూ దర్శనమిస్తూనే ఉంది. -
సూసైడ్ బాంబర్ ను బతికించాలనుకున్నా...
పారిస్ : ఫ్రెంచ్ కు చెందిన ఓ నర్స్ కాంప్తోయిర్ వోల్టైర్ వోల్టైర్ కేఫేలో కాల్పులు సందర్భంగా తనను తనను తాను పేల్చుకున్న ఉగ్రవాదిని కాపాడబోయాడట. పారిస్ లో వరస ఉగ్రదాడుల్లో భాగంగా కెఫే లో కూడా కాల్పుల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారిస్ లో ఒక హాస్పిటల్ లో పనిచేసే డేవిడ్ (46) అతని స్నేహితునితో కలిసి కెఫేకి డిన్నర్ కి వచ్చాడు. ఇంతలో పెద్ద పేలుడు సంభవించింది. డేవిడ్ వెంటనే అప్రమత్తమయ్యాడు. హెటోల్ లో ఉన్న గ్యాస్ ఆఫ్ చేయమంటూ గట్టిగా అరుస్తూ గాయపడిని వారిని ఆదుకునే పనిలో పడ్డాడు. ఇంతలో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉన్న వ్యక్తిని గమనించాడు. అతని నడుముకు రకరకాల రంగుల్లో ఉన్న వైర్లను చూసి షాకయ్యాడు. వెంటనే అతనికి పరిస్థితి అర్థమై ప్రాణాలను దక్కించుకున్నాడు. 'భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ హడావుడిగా పరుగెత్తుతున్నారు. నెత్తురోడుతున్న ఓ మహిళను, ఓ యువకుడిని కాపాడాను. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పృహలేనట్టుగా పడి ఉన్నాడు. అతను మామూలు కస్టమర్ అనుకున్నా. అతడిని సేవ్ చేయాలనుకున్నా... కృత్రిమ శ్వాస (సీపీఆర్) అందించే క్రమంలో అతని చొక్కాను తొలగించా. పెద్ద గాయమైంది. దాదాపు 30 సెం.మీ మేర లోతైన గాయంతో పాటు తెలుపు,ఎరువు, నలుపు, ఆరెంజ్ రంగుల్లో వైర్లు అవీ చూస్తే దిమ్మతిరిగింది. ఏదో పేలుడు పదార్థం అని, అతను సూసైడ్ బాంబర్ అని అర్థమైంది. వెంటనే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్న పైర్ సిబ్బందిని అలర్ట్ చేసి.. డైనింగ్ రూం వదిలి టెర్రస్ మీదికి పరుగెత్తా..లేదంటే నా ప్రాణాలు కూడా గాల్లోకి కలిసేవే అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే కెఫే లో ఉగ్రవాదిని ఇద్దరు వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసిన ఘటన వీడియోలో రికార్డయింది. ఒకరు డేవిడ్ కాగా మరొకరు ఎవరో ఇంకా తెలియలేదు. ఈ ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాది అబ్దె సలాం హతమయ్యాడు. -
సూత్రధారి హతం
పారిస్ షూటౌట్లో చనిపోయిన ఉగ్రవాది అబౌదే: ఫ్రాన్స్ ఆత్మాహుతి చేసుకున్న మహిళా ఉగ్రవాది అతడి బంధువు ► ఉగ్రదాడుల వల్ల యూరప్ దేశాల్లో భద్రతా చర్యలు ముమ్మరం ► బెల్జియంలో పోలీసు దాడులు ► ఇటలీలో అనుమానితుల కోసం గాలింపు పారిస్: పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడి సూత్రధారి అబ్దెల్హమీద్ అబౌద్ (27) బుధవారం పోలీసుల షూటౌట్లో చనిపోయాడని అధికారులు ప్రకటించారు. అబౌద్ పారిస్ నగర శివార్లలోని సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్మెంట్లో దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేయటం.. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపటంతో ఏడు గంటల పాటు ఆపరేషన్ కొనసాగటం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో ఒక మహిళా ఉగ్రవాది బాంబులతో కూడిన జాకెట్‌తో తనను తాను పేల్చివేసుకోగా.. పోలీసు కాల్పుల్లో మరొక ఉగ్రవాది చనిపోయిన విషయమూ విదితమే. అతడు పారిస్ దాడుల సూత్రధారి, బెల్జియంకు చెందిన ఐసిస్ ఉగ్రవాది అబౌదేనని అతడి చర్మం నమూనాల పరీక్ష ద్వారా నిర్ధారించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయ్ మొలిన్ గురువారం తెలిపారు. అతడితో పాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు అపార్ట్మెంటును చుట్టుముట్టగానే తొలుత కాల్పులు ప్రారంభించింది ఆమేనని.. ఆ వెంటనే తనను తాను పేల్చివేసుకునే ముందు ‘నాకు సాయం చేయండి’ అంటూ కేకలు వేయటం ద్వారా పోలీసులను తన దగ్గరకు రప్పించుకుని, తనతో పాటు పేల్చివేయాలనే ప్రయత్నం చేసిందని వివరించారు. అపార్ట్‌మెంట్‌పై పోలీస్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యూరప్ అంతటా భద్రతా చర్యలు... ఫ్రాన్స్‌తో పాటు యూరప్ దేశాల్లోనూ పొంచివున్న ఉగ్రప్రమాదంపై ఆందోళన తీవ్రమవుతోంది. పలు దేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ముమ్మరమవుతున్నాయి. యూరప్‌లో ఉగ్రవాద ముప్పు చాలా తీవ్రంగా పెరిగిపోయే అవకాశముందని యూరోపోల్ డెరైక్టర్ రాబ్ ఆందోళన వ్యక్తంచేశారు. పారిస్ దాడిలో పాల్గొన్న ముష్కరుల్లో చాలా మంది బెల్జియం వాసులే కావటంతో దేశంలో అదనపు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్లు బెల్జియం ప్రధాని మైఖేల్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కోసం 40 కోట్ల యూరోలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికా, మిలాన్ చర్చి, లా స్కాలా ఒపెరా హౌస్‌లతో పాటు, థియేటర్లు తదితరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ప్రమాదముందంటూ అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఎఫ్‌బీఐ గుర్తించిన ఐదుగురు అనుమానితుల కోసం దేశంలో గాలిస్తున్నట్లు ఇటలీ మంత్రి పౌలో తెలిపారు. న్యూయార్క్‌పై దాడి చేస్తాం: ఐసిస్ వీడియో ఈసారి న్యూయార్క్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ ఐఎస్ వీడియోను విడుదల చేసింది. పారిస్ దాడుల భయానక దృశ్యాలతో పాటు.. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ను, బాంబు జాకెట్‌ను ధరిస్తున్న ఉగ్రవాదిని చూపుతూ అక్కడ దాడి చేస్తామన్న హెచ్చరిక జారీ చేసింది. హెరాల్డ్ స్క్వేర్, మన్హటన్ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాలనూ చూపింది. సిరియాలో వైమానిక దాడుల్లో తమ వారందరి మరణానికీ ప్రతీకారం తీర్చుకుంటామని.. తమ దాడులు కొనసాగిస్తామని ఐసిస్ తన మేగజీన్‌లో హెచ్చరించింది. రసాయన దాడులు చేసే ప్రమాదం... రాజధాని పారిస్‌లో 129 మందిని బలిగొన్న శుక్రవారం నాటి ఉగ్రదాడి మిగిల్చిన పెను విషాదం ఇంకా ఫ్రాన్స్‌ను వీడలేదు. ఐసిస్ ఉగ్రవాదులు రసాయన ఆయుధాలు లేదా జీవరసాయన ఆయుధాలతో దాడి చేసే ప్రమాదం పొంచివుందని దేశ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ హెచ్చరించారు. ఆయన గురువారం పార్లమెంటు దిగువసభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని మూడు నెలలు పొడిగించాలని పార్లమెంటు సభ్యులను కోరారు. మరోవైపు సిరియాలో ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. పారిస్ దాడులు జరిగిన శుక్రవారం నుంచి ఇప్పటివరకూ 35 ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఫ్రాన్స్ సైన్యం గురువారం తెలిపింది. గురువారం ఆరు స్థావరాలపై 60 బాంబులు వేసినట్లు పేర్కొంది. మొత్తం 30 వేల మంది ఉన్న ఐసిస్‌ను అంతం చేయటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ కోరారు. -
ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
-
ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నరమేధానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది అబ్దుల్ హమీద్ అబౌద్ (27) పోలీసుల ఆపరేషన్‌లో చనిపోయినట్టు మీడియా కథనాలు తెలిపాయి. అబ్దుల్ హమీద్‌ను పట్టుకునేందుకే సెయింట్ డెనిస్‌లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల షూటౌట్ అనంతరం అతడు చనిపోయాడా? లేదా? అన్నది పోలీసులు ధ్రువీకరించలేదు. తాను దాగున్న అపార్ట్మెంట్ చుట్టూ పోలీసులు మాటువేసి.. కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో అతడు తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అతడు తనను తాను కాల్చుకొని చనిపోయినట్టు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ రీచీర్ అనధికారికంగా పేర్కొన్నారు. అయితే, పోలీసుల షూటౌట్లో అబ్దుల్ హమీద్ చనిపోయాడని, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. సెయింట్ డెనిస్‌లో బుధవారం భారీ ఎత్తున జరిగిన ఈ షూటౌట్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఏడుగురిని అరెస్టు చేశారు. చనిపోయిన వారిలో ఓ మహిళ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుంది. ఆత్మాహుతి బాంబర్ అయిన ఆమె అబ్దుల్ హమీద్ భార్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆంక్షలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అక్రమంగా చేరకుండా లక్షిత ఆర్థిక ఆంక్షలు అమలు చేయటం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. టైస్టులకు అందిన ఆర్థిక సహకారం, అక్రమ సొమ్ము వల్ల ప్రపంచానికి జరుగుతున్న నష్టానికి పారిస్ మారణహోమం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు వాహనాల దొంగతనం మొదలుకుని తీవ్రమైన క్రిమినల్ నేరాల ద్వారా నిధులు అందుతున్నాయన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించే ఆర్థిక మూలాలను నియంత్రిస్తే వారి దాడులకు అడ్డుకట్ట వేసినట్లేనన్నారు. బుధవారమిక్కడ 6వ గ్లోబల్ ఫోకల్ పాయింట్ కాన్ఫరెన్స్, సీబీఐ, స్టేట్ యాంటీ కరప్షన్, విజిలెన్స్ బ్యూరో 21వ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు. బహుళత్వమే మా బలం: మోదీ బహుళత్వం సహా భారత్‌కు అద్భుతమైన సామాజిక సామర్ధ్యాలు అనేకం ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్డీయే పాలనలో దేశంలో నెలకొన్న అసహనంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై మోదీ మరోసారి స్పందించారు. గతవారం లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో మాట్లాడుతూ.. భారత దేశ బలం వైవిధ్యత, బహుళత్వమేనని, అదే భారత్ ప్రత్యేకత అని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత ‘ఎకనమిస్ట్’ పత్రికలో రాసిన వ్యాసంలో అదే అంశాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మోదీ వ్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలను ఆ పత్రిక విలేకరి బుధవారం ట్వీట్ చేశారు. నా ప్రమాణానికి రండి: నితీశ్ పట్నా: ఈ నెల 20న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నితీశ్ కుమార్, ఆ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఫోన్ చేసి ఆహ్వానించారు. -
‘అప్పుడు పోలీసులు నన్ను గుర్తుపట్టలేదు!’
బ్రసెల్స్: పారిస్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్హమీద్ అబౌద్ ఫ్రాన్స్‌కు పొరుగునే ఉన్న బెల్జియం దేశ నివాసి. మొరాకో సంతతికి చెందిన అతడి స్వ స్థలం బ్రసెల్స్ నగరం. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. స్కూల్లో సహ విద్యార్థులను వేధించేవాడు. గత రెండేళ్లుగా యూరప్‌లో ఐసిస్ ఉగ్రవాద కుట్రలు, ఉగ్రవాద సంస్థలోకి రిక్రూట్మెంట్లు వంటి కార్యకలాపాల్లో అతడి ప్రమేయం ఉంది. గతంలో ఈయూ చెక్‌పోస్ట్ వద్ద ఒక పోలీసు అధికారి తనను ఆపి, తన ఫొటోతో సరిపోల్చి చూసికూడా గుర్తుపట్టకుండా వదిలేశాడంటూ అరెస్ట్ నుంచి తాను ఎలా తప్పించుకన్నాడో.. అతడు ఐసిస్ మేగజీన్ దబీక్లో గర్వంగా చెప్పాడు. అలాగే ఈ ఏడాది మొదట్లో బెల్జియం భద్రతాదళాలపై దాడికి ప్రణాళిక రచిస్తున్న సమయంలో ఆ విషయం బయటపడటంతో పోలీసులు దాడి చేశారని.. ఆ దాడిలో తన సహచరులు ఇద్దరు చనిపోయినా తాను తప్పించుకుని, ఈయూ నుంచి ఎలా బయటపడ్డాననేదీ వివరించాడు. బెల్జియంలో పోలీసుల దాడి అనంతరం అతడు సిరియా వెళ్లాడు. ఇటీవల సిరియా లోని ఐసిస్ స్థావరం నుంచి పశ్చిమ దేశాలకు హెచ్చరికలు కూడా చేశాడు. అక్కడ ఉగ్రవాదులు తలలు నరికిన కొందరి మృతదేహాలను కట్టిన జీపును అబౌద్ నవ్వుతూ నడుపుతున్న ఐసిస్ వీడియో గత ఏడాది మొదట్లోనే భద్రతా దళాలకు అందింది. అప్పటికే అతడి గురించి వారికి పూర్తిగా తెలుసు. సిరియాలోని ఉగ్రవాద సంస్థలో జిహాదీలను చేర్పిస్తున్నాడన్న అభియోగంపై.. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బ్రసెల్స్ కోర్టు అతడి పరోక్షంలో తీర్పు చెప్పింది. ఐసిస్ విదేశీ కార్యకలాపాల విభాగంలో అబౌద్ కీలకమైన వ్యక్తి అని.. అతడి కదలికలను అమెరికా నిఘా సంస్థలు కొన్ని నెలలుగా గమనిస్తున్నాయని యూఎస్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. -
అడుగు తడబడొద్దు!
ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం పర్యవసానంగా ఏర్పడ్డ భీతావహ స్థితినుంచి పారిస్ వాసులు ఇంకా కోలుకోలేదు. నాలుగు రోజులుగా ఫ్రాన్స్ భద్రతా బలగాలు అనుమానిత ప్రాంతాల్లో సాగిస్తున్న గాలింపువల్లా.... అనుమానితుల్ని, వారి సన్నిహితులనూ ప్రశ్నించడంవల్లా సత్ఫలితాలొస్తున్నాయి. మారణహోమం సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి, అతనితో ఉన్న మరో మహిళ బుధవారం భద్రతా బలగాల దాడిలో మరణించగా మరికొందరు అరెస్టయ్యారు. ఇంకొక ఉగ్రవాది జాడ తెలియవలసి ఉన్నదని చెబుతున్నారు. దాడులను ముందే పసిగట్టి నివారించడంలోనూ, దాడులు జరిగిన వెంటనే సాగించిన తనిఖీల్లోనూ వైఫల్యాలను మూటగట్టుకున్న భద్రతా బలగాలకు ఇది ఊరటనిచ్చే విషయం. 'మనం ఉగ్రవాదంపై యుద్ధం సాగిస్తున్నాం...భీతావహులు కావొద్దు...అతిగా ప్రతిస్పందించి యూదులపైనో, ముస్లింలపైనో దాడులకు దిగొద్దు' అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ దేశ ప్రజలను కోరుతున్నారు. ఆయన సరిగానే చెప్పారు. ఇలాంటపుడు ఎవరూ సహనం కోల్పోకూడదు. ప్రతివారినీ అనుమానించి, ద్వేషించేచోట ప్రేమాభిమానాలు అడుగంటుతాయి. కలహాలు ముదురుతాయి. ఉగ్రవాదులకు కావలసింది సరిగ్గా ఇదే. కాలుష్యాన్ని, మురికిని ఆశ్రయించుకుని ప్రమాదకర బ్యాక్టీరియాలు, వైరస్లు పెరిగినట్టుగానే కలహించుకునే సమాజాల్లో ఉగ్రవాదం పుట్టి విస్తరిస్తుంది. ఉగ్రవాద భూతంపై అందరూ సమష్టిగా పోరాడవలసిన అవసరాన్ని గుర్తించకపోతే అంతిమంగా ఆ భూతానిదే పైచేయి అవుతుంది. అయితే దేశ పౌరులకు ఇంతగా చెప్పిన హొలాండ్ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని సరిగా గుర్తించిందా? పారిస్ దాడుల వెనువెంటనే ఫ్రాన్స్ యుద్ధ విమానాలు సిరియాలో ఉగ్రవాద స్థావరాలుగా గుర్తించిన ప్రాంతాలపై బాంబుల వర్షం ప్రారంభించాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ అమెరికా మిత్రపక్షంగా ఉన్న ఫ్రాన్స్ ఇందుకోసమని దాని ప్రత్యర్థిగా ఉన్న రష్యాతో కూడా చేతులు కలిపింది. దాడులు మరికొన్ని వారాలు కొనసాగుతాయని ప్రకటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యలను ఎవరూ సమర్థించరు. వారిపై కఠినంగా చర్యలు తీసు కోవద్దని ఎవరూ అనరు. అయితే, ఆ చర్యల పరమార్ధం ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేసేదిగా ఉండాలి తప్ప దాన్ని మరింత పెంచి పోషించేదిగా మారకూడదు. అమాయకులెవరూ ప్రాణాలు కోల్పోకూడదు. సంబంధంలేనివారు నిష్కారణంగా బలైపోకూడదు. అలాంటి ఉదంతాలవల్ల సామాన్య ప్రజల్లో ప్రభుత్వాలపై ద్వేషం ఏర్పడుతుంది. ఎలాంటి బాధ్యతా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించే తీరువల్ల ఉగ్రవాదులు చేస్తున్న వాదనలకు బలం చేకూరుతుంది. 2001లో ఉగ్రవాదులు తమ దేశంపై దాడులు జరిపి 3,000మందిని పొట్టనబెట్టుకున్నాక అమెరికా తీసుకున్న చర్యలన్నీ అటువంటివే. సంకీర్ణ బలగాలను రూపొందించి ఇరాక్‌పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని వల్లకాడు చేసిన తీరు మానవేతిహాసంలోనే అత్యంత దారుణం. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయి, మరిన్ని లక్షలమంది క్షతగాత్రులై జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న తీరు చూస్తే ఎలాంటివారికైనా దుఃఖం కలుగుతుంది. అమెరికా దాడులవల్ల బిన్ లాడెన్ వంటి అనేకమంది కీలకమైన ఉగ్ర నేతలు హతమయ్యారు. కానీ పద్నాలుగేళ్లుగా అఫ్ఘానిస్థాన్, లిబియా, సోమాలియా, సిరియా...ఇలా అనేక దేశాల్లో ఈ దాడుల పేరిట బలైన అమాయకులు అసంఖ్యాకంగా ఉన్నారు. కొంపా గోడూ కోల్పోయి బతకడం కోసం చావుకు తెగించి సముద్రాల్లో చిన్న చిన్న పడవలపై యూరప్ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. ఆ క్రమంలో వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాము చేస్తున్న వైమానిక దాడులకు, ఉగ్రవాదం పెరగడానికీ సంబంధం ఉన్నదంటే మొన్నటివరకూ అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలు అంగీకరించేవి కాదు. కానీ ఈమధ్యే సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా ప్రారంభించిన బాంబు దాడుల గురించి అమెరికా, మిత్ర దేశాల స్పందన చూస్తే ఈ విషయంలో అవి పునరాలోచనలో పడ్డాయేమోననిపిస్తుంది. సిరియాలో జోక్యం చేసుకోవాలని పుతిన్ తీసుకున్న నిర్ణయంవల్ల ఉగ్రవాదం మరింత బలపడుతుందని, వారిపట్ల ఆకర్షితులయ్యేవారు పెరుగుతారని ఆ ప్రకటన ఆందోళన వ్యక్తంచేసింది. గత నెల 4న స్వయంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్...మరో నాలుగు రోజులకు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ ఇదే అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. 'ఇలాంటి బాంబు దాడులు ఉగ్రవాదాన్ని పెంచడమే కాదు...దాని పర్యవసానాలు నేరుగా రష్యాయే చవిచూడాల్సి వస్తుందని' వారిద్దరూ హెచ్చరించారు. వారన్నది నిజం కూడా అయింది. గత నెలాఖరున 224మంది ప్రయాణికుల దుర్మరణానికి కారణమైన రష్యా విమాన ప్రమాదంలో ఉగ్రవాదుల హస్తమున్నదని తాజాగా రుజువైంది. సిరియా అగ్నిగుండానికి దూరంగా ఉండమని రష్యాకు సలహాలిచ్చిన వారు తాము ఇన్నేళ్లుగా సాగించిందంతా ఘోర తప్పిదమని ఎందుకనో ఇంతవరకూ బహిరంగంగా ప్రకటించలేదు. కనీసం ఫ్రాన్స్నైనా ఆ మేరకు హెచ్చరించినట్టు లేదు. ఉగ్రవాదులపై సాగించదల్చుకున్న ఎలాంటి యుద్ధమైనా ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ వేదికల ఆమోదంతో సాగాలి. వాటి పర్యవేక్షణ ఉండాలి. అమాయకులు ప్రాణాలు కోల్పోతే అందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుండాలి. యుద్ధ నేరాలకు కఠిన శిక్షలుండాలి. అలాంటి పోరు స్థానిక ప్రభుత్వాలనూ, పౌరులనూ కలుపుకొని పోయేలా ఉండాలి. ఎవరి ఆమోదమూ లేకుండా, ఏకపక్షంగా...కేవలం అగ్రరాజ్యాలమన్న ఏకైక కారణంతో 'ప్రపంచ పోలీస్'లా వ్యవహరిస్తామంటే, తాము ఎవరికీ జవాబుదారీ కాదంటే నాగరిక సమాజాలు మెచ్చవు. సిరియాలోనో, మరొకచోటనో ఉగ్రవాద స్థావర ప్రాంతాలంటూ ఎంచుకుని వైమానిక దాడులకు దిగితే, ఆ ఉగ్రవాదుల చెరలో మగ్గిపోతున్న సాధారణ ప్రజానీకం ప్రాణాలకు ముప్పు కలిగించినట్టవుతుంది. మరోరకంగా చెప్పాలంటే సిరియాలోని తమ స్థావరాలపై జరుగుతున్న దాడులకు నిరసనంటూ పలు దేశాల్లో ఉగ్రవాదులు సాగిస్తున్న మారణకాండకూ... ఈ వైమానిక దాడులకూ తేడా ఉండదు. విచక్షణారహితంగా ఎవరూ వ్యవహరించినా ఫలితాలు ఒకలాగే వస్తాయి. బహుళ సంస్కృతులకు నిలయంగా ఉంటున్న ఫ్రాన్స్ ఈ సంగతిని గుర్తెరగాలి. -
ఉన్నాడా? చచ్చాడా?
సెయింట్ డెనిస్: పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్ ఏమయ్యాడన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. అబ్దుల్ హమీద్‌ను హతమార్చేందుకే ఫ్రాన్స్ పోలీసులు సెయింట్ డెనిస్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ ఉన్న ఓ అపార్ట్మెంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు ధ్రువీకరించడం లేదు. మరోవైపు ఎన్కౌంటర్లో అతడు చనిపోయినట్టు రెండు దఫాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఈ కథనాలపైనా స్పష్టత ఇవ్వడానికి పోలీసులు ముందుకురాకపోవడంతో అసలు దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హమీద్ బతికి ఉన్నాడా? చనిపోయాడా? అన్నది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో షూటౌట్ జరిగిన అపార్ట్మెంట్లో ఇప్పటికీ ఓ వ్యక్తి నక్కి ఉన్నాడని, అయితే అతను ఉగ్రవాదో, కాదో తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులపై యుద్ధం కొనసాగిస్తాం: హోలాండ్ పారిస్‌లో నరమేధం నేపథ్యంలో ఉగ్రవాదులపై తాము తలపెట్టిన యుద్ధాన్ని ఆపబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్ స్పష్టం చేశారు. సెయింట్ డెనిస్‌లో బుధవారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. అమెరికా, రష్యాలతో కలిసి ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. -
శరీరాన్ని కవచంగా చేసి కొడుకును కాపాడింది!
పారిస్: ఏ దేశంలోనైనా అమ్మ అమ్మనే.. అమ్మతనం ఒక్కటే..! ఐదేళ్ల లూయిస్ గత శుక్రవారం బాటాక్లాన్ థియేటర్లో ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ సంగీత విభావరి ఎలా ఉంటుందో చూడటానికి వెళ్లాడు. అక్కడ సంగీత ఝరులు వీనులవిందు చేస్తాయని భావించాడు. కానీ ఊహించనివిధంగా బుల్లెట్ల వర్షం కురిసింది. అయినా ఆ పెను విపత్తు నుంచి ఆ పసివాణ్ణి కాపాడింది అతని తల్లి ఎల్సా డెల్ప్లేస్. ఉగ్రవాదులు కురిపిస్తున్న తూటాల వర్షానికి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి ఆ మాతృమూర్తి తన ఐదేళ్ల కొడుకు ప్రాణాలను నిలిపింది. తల్లి మృతదేహం చాటున బిక్కుబిక్కుమంటూ నక్కి బతికిబయటపడ్డ లూయిస్ ఇప్పుడు అమ్మ ఏదని అడుగుతున్నాడు. గత శుక్రవారం పారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం మిగిల్చిన పెనువిషాదం ఇది. పారిస్‌లోని బాటాక్లాన్ థియేటర్లో కాన్సర్ట్‌కు ఐదేళ్ల లూయిస్ తల్లి ఎల్సా డెల్ప్లెస్ (35), అమ్మమ్మ పాట్రిషియా సాన్ మార్టిన్ (61)తో కలిసి వెళ్లాడు. అక్కడ జరిగిన ఉగ్రవాదుల నరమేధంలో లూయిస్ తల్లి, అమ్మమ్మ చనిపోయారు. వారిద్దరు ఉగ్రవాద తూటాలకు అడ్డుగా నిలబడి ఆ చిన్నారి ప్రాణాలను నిలిపారు. వారిద్దరి మృతదేహాల నడుమ నెత్తుటిధారల మధ్య లూయిస్ ప్రాణాలు దక్కించుకున్నాడు. కొడుకు ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఆ అమ్మ, అమ్మమ్మలకు ఘనంగా నివాళులర్పిస్తూ ఎల్సా స్నేహితురాలు సిహెమ్ సొయిద్ 'లీ పాయింట్'లో ఓ వ్యాసం రాశారు. తన కొడుకును ఎప్పుడూ ఆశాకిరణంగా భావించేదని, ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన లూయిస్ ఇప్పుడు ఆస్పత్రిలో బిత్తరచూపులు చూస్తున్నాడని ఆమె వివరించింది. ఎల్సా ఎప్పుడూ ఆనందంగా ఉండేంది. కష్టకాలంలోనూ ఆమె పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడేది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందుండేది. కళా, సాంస్కృతిక ప్రపంచంతో సన్నిహితంగా మసిలేది. ఆమె ఎప్పుడూ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేది. చిలీ నియంత పినొచెట్పై పోరాడి ఆమె తల్లి ఇక్కడి వచ్చింది. ఆ పోరాట వారసత్వం ఆమెలో ఉండి ఉంటుంది' అని ఎల్సా మిత్రురాలు ఈ స్మృతి వ్యాసంలో పేర్కొన్నారు. -
పారిస్‌లో భీకర కాల్పులు
-
'ఇక నా ఆలోచనలు, ప్రార్థనలు నీకోసమే ఫ్రెండ్'
న్యూయార్క్: హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఉగ్రవాదుల దాడిలో తన మిత్రుడి మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తన టీంలో అతడితో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. అలాంటి స్నేహితుడిని కోల్పోవడం చెప్పలేని లోటు అంటూ ట్వీట్ చేశాడు. ఫ్రాన్స్ లోని బెటక్లాన్ థియేటర్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరపగా వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో చనిపోయినవారిలో బీబర్ స్నేహితుడు థామస్ అయ్యద్ కూడా ఉన్నాడు. 'ఎన్నో ప్రశంసలు అందుకున్నావు. కానీ దూరమయ్యావు. ఈ సందర్భంగా నేనొకటి భావిస్తున్నాను. కొంతమందిని మనం కలిగి ఉన్నప్పుడు వారిపట్ల ప్రశంసా దోరణితో ఉండాలి' అంటూ ట్వీట్ చేశాడు. 'ప్యారిస్ దాడి గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా మిత్రుడి విషాదం గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లుగా నా టీంలో కలిసి ఉన్నాడు. అతడికి ఇప్పటికే ఎన్నో సార్లు ధన్యవాదాలు తెలపాల్సి ఉంది. కానీ, అవకాశం లేకుండా పోయింది. అందుకే మనతో ఉన్నవారికి అప్పుడప్పుడు ధన్యవాదాలు చెప్పాలి. ప్రశంసించాలి. నా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పటికీ నీతోనే ఉంటాయి థామస్' అంటూ బీబర్ ట్వీట్ చేశాడు. -
నా భార్యను చంపారు..ఐనా మీపై ద్వేషం లేదు!
పారిస్: 'శుక్రవారం రాత్రి మీరు ఓ విశేషమైన వ్యక్తి విలువైన ప్రాణాలను బలిగొన్నారు. నా జీవిత సర్వస్వాన్ని దూరం చేశారు. ఓ కొడుకుకు తల్లిని దూరం చేశారు. అయినా మీమీద నాకు ద్వేషం కలుగడం లేదు. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు చనిపోయిన ఆత్మలన్న విషయాన్ని నేను తెలుసుకోవాలనుకోవడం లేదు'.. ఇది ఆంటోనీ లీరిస్ ఆవేదన. పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఆయన భార్య ప్రాణాలు కోల్పోయింది. అయినా 129 మందిని పొట్టనబెట్టుకున్న ఈ నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తనకు ద్వేషం కలుగడం లేదని ఆయన పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నది. 'మీకు ద్వేషం అనే బహుమతిని నేను ఇవ్వబోను. మీ పట్ల ద్వేషం వ్యక్తమవుతుండొచ్చు. కానీ ద్వేషం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అజ్హానమే. ఆ అజ్ఞానమే మిమ్మల్ని ఇలా తయారుచేసింది. నన్ను భయపెట్టాలని నువ్వు చూశావు. సాటి నా దేశవాసులను అనుమానంతో నేను చూసేలా చూడాలనుకున్నావు. భద్రత కోసం నా స్వాతంత్ర్యాన్ని పణంగా పెట్టాలని భావించావు. కానీ నువ్వు ఓడిపోయావు. మేము ఇంకా దృఢంగానే ఉన్నాం' అని ఆయన ఈ ఫేస్బుక్ పోస్టులో ఉగ్రవాదులను ఉద్దేశించి పేర్కొన్నారు. శుక్రవారం పారిస్‌లోని బాటాక్లాన్ థియేటర్, జాతీయ క్రీడా మైదానం వద్ద ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ మారణహోమంలో బాటాక్లాన్ థియేటర్ వద్ద చనిపోయిన 86 మందిలో లీరిస్ భార్య కూడా ఉన్నారు. విగతజీవిగా పడి ఉన్న ఆమెను చూసి.. తాను ఎంతగా ఛిన్నాభిన్నమయ్యాడో ఆయన వివరించాడు. ' ఆమెను నేను ఈ రోజు ఉదయం చూశాను. కొన్ని రాత్రులు, పగళ్ల ఎడతెగని ఎదురుచూపుల అనంతరం ఆఖరికీ చూశాను. తను శుక్రవారం ఇంటినుంచి వెళ్లేటప్పుడు ఎంత అందంగా ఉందో.. అలాగే ఉంది. 12 ఏళ్ల కింద ఆమెతో ప్రేమలో పడి తొలిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. నిజమే ఆమెను చూసి నేను బాధతో కుప్పకులాను. ఓ చిన్న విజయాన్ని మీకు అందించాను. కానీ అది ఎంతోకాలం నిలువబోదు. ప్రతిరోజు ఆమె మాతోనే ఉంటుంది. స్వేచ్ఛయుత ఆత్మలతో ఒకరోజు స్వర్గంలో మేము కలుసుకుంటాం. కానీ అలాంటి స్వర్గం మీకెన్నడు సాధ్యపడబోదు' అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని సైన్యాలన్నింటికన్నా బలంగా తాను, తన కొడుకు జీవితంలో ముందుకు సాగుతామని, 17 నెలల తన కొడుకును నిద్రనుంచి లేపి.. జాగృత పరిచి, స్వేచ్ఛయుత, ఆనందదాయక జీవితం గడిపేలా తీర్చిదిద్దుతామని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు. -
'అయినా.. నన్ను భయపెట్టలేకపోయారు'
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. పారిస్ ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ బాధితుడు ఆంటోనీ లీరిస్. ఈ ఘటనను జీర్ణించుకోలేని ఆ వ్యక్తి 'మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్లు చచ్చిన శవాలు' అని పేర్కొంటూ చేసిన ఫేస్బుక్ పోస్ట్ అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని చంపేశారని, నా జీవితాన్ని నాకు దూరం చేశారని పేర్కొన్నాడు. ఇన్నీ చేసినా మీరు నన్ను భయపెట్టలేక పోయారు. 'నా స్వేచ్ఛకు భంగం కలిగించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నేటి ఉదయం కూడా నేను ఆమెను చూశాను.12 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాను. బాటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో 89 మందికి పైగా చనిపోయారు. కానీ, ఇది ఉగ్రవాదుల స్వల్ప విజయం' అని భార్య మృతదేహాన్ని చూస్తూ ఈ విషయాలను పోస్ట్ ద్వారా వివరించాడు. 'నేను, నా బాబు(17 నెలలు) ప్రపంచంలోని అన్ని ఆర్మీల కంటే ధృడంగా ఉన్నాం. మీ గురించి ఆలోచిస్తూ టైం వృథా చేసుకోను. నా బాబును సంతోషంగా, దైర్యంగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తుంటాను. మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు' అంటూ ఉద్వేగభరితంగా తన మనసులోని బాధను ఆంటోనీ లీరిస్ బయటపెట్టాడు. -
'వాడు లొంగిపోతాడేమో.. తెలీదు'
బ్రస్సెల్స్: పారిస్ ఉగ్రదాడులతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఉగ్రఘటనకు పాల్పడ్డట్లు భావిస్తున్న ఇద్దరు అనుమానితుల సోదరుడు మహమ్మద్ అబ్దేస్లామ్ పేర్కొన్నాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన దాడిలో తాను పాలు పంచుకోలేదన్నాడు. పారిస్ పోలీసుల కస్టడీ నుంచి బయటకొచ్చిన అనంతరం అతడు ఈ వివరాలను మీడియాకు వెల్లడించాడు. అయితే, సామాన్యులపై కాల్పులు, ఆత్మాహుతి దాడికి పాల్పడి అబ్దెస్లామ్ బ్రదర్స్‌లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు పరారీలో ఉన్న విషయం విదితమే. అతడి ఓ సోదరుడు ఇబ్రహీమ్ ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. మరో సోదరుడు సలాహ్పై అంతర్జాతీయంగా అరెస్ట్ వారెంట్ ఉంది. పారిస్ ఉగ్రదాడి సమయంలో ఎక్కడున్నావని మహమ్మద్‌ను మీడియా ప్రశ్నించగా.. తన వ్యాపార భాగస్వామితో ఉన్నట్లు తెలిపాడు. టెలిఫోన్ రికార్డులు కూడా ఇందుకు సాక్ష్యంగా తమ వద్ద ఉన్నాయన్నాడు. 'మాది స్వేచ్ఛాయుత కుటుంబం. చట్టాలు, కోర్టులు వంటి విషయాలలో మాకెప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. పారిస్ ఘటనతో అసలు ఏం జరిగిందో అర్థంకాక మా తల్లిదండ్రులు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు' అని చెప్పాడు. సోదరుడు, అంతర్జాతీయ ఉగ్రవాది సలాహ్ విషయంపై ప్రశ్నించగా, అతడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదని, లొంగిపోయే సాహసం చేస్తాడా లేదా అన్న విషయం కూడా చెప్పలేమని మహమ్మద్ అబ్దేస్లామ్ పేర్కొన్నాడు. తాము ప్రస్తుతం బాధితులు, వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని, అందరిలాగే ఈ ఘటనపై తామూ చలించిపోయామన్నాడు. తన సోదరులు ఈ దాడికి పాల్పడ్డట్లు క్షణం కూడా భావించడం లేదని అబ్దేస్లామ్ వివరించాడు. గత శుక్రవారం పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 129 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఫ్రాన్స్‌ను టర్కీ ముందే హెచ్చరించిందా!
పారిస్/ఇస్తాంబుల్: భారీ నరమేథం జరిగిన తర్వాత ఆకులు పట్టుకోవటంలో ఫ్రాన్స్ పోలీసులూ అతీతులు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం పారిస్ నగరంలో చోటుచేసుకున్న ఉగ్రదాడులకు సంబంధించిన కీలక సమాచారం.. కొద్ది రోజుల ముందే తెలిసినప్పటికీ ఫ్రాన్స్ పోలీసులు అలసత్వం వహించారని వార్తలు వెలువడుతున్నాయి. ఏడు చోట్ల జరిగిన దాడుల్లో అత్యంత పాశవికమైనదిగా భావిస్తోన్న బెతాక్లాన్ కన్సెర్ట్ సెంటర్ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాది గురించి, అతడి ప్రణాళికల గురించి ఫ్రాన్స్ పోలీసులను పలుమార్లు హెచ్చరించినట్లు టర్కీ ఉన్నతాధికారులు పేర్కొనడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. బెతాక్లాన్ హాలులో ప్రేక్షకులను ఒక్క చోటికి చేర్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాది ఒమర్ ఇస్మాయిల్ మొస్తాఫియా.. 2013 నుంచి టర్కీలో అక్రమంగా నివసించాడని అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్ జాతీయుడైన 29 ఏళ్ల ఒమర్.. 2010 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, స్వదేశంలో ఇతడిపై అనేక కేసులు కూడా నమోదయినట్లు తెలిసింది. అయితే ఇతడి కదలికలపై గట్టి నిఘా పెట్టకపోవడంతో పారిస్ దాడుల వ్యూహరచన సులువుగా అమలుచేసే అవకాశాన్ని పోలీసులే కల్పించినట్లయింది. '2014లో ఒకసారి, 2015 జూన్ లో మరోసారి ఒమర్ ఇస్మాయిల్ గురించిన సమాచారాన్ని ఫ్రాన్స్ పోలీసులకు అందించాం. ఇటీవలే తమ దేశానికి చెందిన నలుగురు ఉగ్రవాదుల జాబితాను ఫ్రాన్స్ అందించింది. ఆ జాబితాలో ఒమర్ పేరు లేకపోవడాన్ని బట్టి ఫ్రాన్స్ పోలీసులు మా హెచ్చరికలను పట్టించుకోలేదని అర్థమైంది. అయితే శుక్రవారం నాటి దాడుల తర్వాతే ఉగ్రవాది ఒమర్ వివరాలపై ఫ్రాన్స్ దృష్టి సారించింది' అని టర్కీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బెతాక్లాన్ హాలులో 89 మందిని హతమార్చిన అనంతరం ఒమర్ ఇస్మాయిల్ తనను తాను పేల్చుకున్నాడు. సంఘటనా స్థలంలో తెగిపడివున్న చేతి వేలు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అది ఒమర్ దేనని తేలటంతో అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఒమర్ వినియోగించిన కంప్యూటర్లతోపాటు ఇంటిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పారిస్ ఉగ్రదాడిపై బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కోర్బెయిన్ భిన్నంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎస్ఐఎస్ పై నేరుగా పోరాడేకంటే వారికి నిధులు సమకూర్చుతున్న దేశాల పనిపట్టాలన్నారు. ప్రధానంగా ధనిక దేశమైన సౌదీ అరేబియాకు ఐఎస్ కు మధ్య ఉన్న సంబంధాలపై చర్చ జరగాలన్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నందున అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉగ్రదాడికి ప్రణాళికలు ఫ్రాన్స్ లోనే జరిగాయన్నవాదనను కొట్టిపారేశారు. కచ్చితంగా సిరియాలోనే ప్లాన్ రూపొంది ఉంటుందని అభిప్రాయపడ్డారు. పారిస్ దాడుల నేపథ్యంలో ఆ దేశంలో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. -
పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు
-
పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 129మందిని హతమార్చిన ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేసిన కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించారు. బెల్జియంకు చెందిన 26 ఏళ్ల అబ్బుల్ హమీద్ అబౌద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఫ్రాన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు యువకులను రెచ్చగొట్టి.. అతడు ఈ దాడులకు పథక రచన చేసినట్టు భావిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు సిరియన్ కాగా, మరొకరు ఫ్రాన్ జాతీయుడని, అతనిపై ఉగ్రవాదిగా గతంలో కేసు నమోదయిందని నిర్ధారించారు. ఫ్రాన్స్ జాతీయ స్టేడియం బయట తనను తాను పేల్చుకున్న ఆత్మాహుతి బాంబర్ సిరియా వ్యక్తి అని, ఇద్లిబ్కు చెందిన అతని పేరు అహ్మద్ అల్ మహమ్మద్ గుర్తించారు. పారిస్ ఉగ్రవాద దాడులకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తల ఇళ్లు, నివాసాలపై పెద్ద ఎత్తున పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి సూత్రధారుల గురించి పక్కా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాది మృతదేహం వద్ద లభించిన సిరియా వ్యక్తి పాస్‌పోర్టును ధ్రువీకరించాల్సి ఉందని, అయితే గత నెల గ్రీస్‌లో తీసుకున్న వేలిముద్రలతో ఈ పాస్‌పోర్టుపైన ఉన్న వేలిముద్రలు సరిపోయాయని చెప్పారు. -
పాప్‌స్టార్ కన్నీరుమున్నీరైంది!
స్టాక్‌హోమ్: ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా పారిస్ దాడులపై స్పందిస్తూ కంటతడి పెట్టింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో శనివారం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన మడోన్నా.. ఈ సందర్భంగా పారిస్ దాడుల మృతుల కోసం కొంతసేపు మౌనం పాటించింది. ఈ దాడుల్లో బాధితుల గురించి మాట్లాడుతూ ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. 'ఇప్పుడు ఈ షో నిర్వహించడం నాకు చాలా కష్టమైన విషయం. గత రాత్రి ఏం జరిగిందన్నది మరిచిపోలేనిది. పారిస్‌లో జరిగిన విషాదకరమైన ఉదంతంలో ఎంతోమంది విలువైన ప్రాణాలు గాలిలో కలిశాయి' అని 51 ఏళ్ల మడోనా పేర్కొంది. 'ఒకవైపు తమవారిని కోల్పోయి బాధితులు దుఃఖిస్తుంటే.. ఇక్కడ నేను ఎందుకు డాన్స్ చేస్తున్నానంటే.. దాడులు చేసినవారి లక్ష్యం మన నోళ్లు మూయించడమే. మనల్ని మౌనంగా ఉంచడమే. అది ఎప్పటికీ జరుగదని నిరూపించడానికి నేనిప్పుడు షో కొనసాగిస్తున్నాను' అని మడోన్నా తెలిపింది. ఈ సందర్భంగా విషాదస్మృతి గీతమైన 'లైక్ ఏ ప్రేయర్' గీతాన్ని ఆలపించి.. మడోన్నా పారిస్ పేలుళ్ల మృతులకు నివాళులర్పించింది. -
పారిస్ పేలుళ్లపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
బరెల్లి: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ పారిస్ పేలుళ్లపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సిరియా, ఇరాక్‌లో అమెరికా చర్యలకు ప్రతిచర్యగానే పారిస్ పేలుళ్లు జరిగాయని, ఈ విషయాన్ని ఆ అగ్రరాజ్యం గుర్తించాలని పేర్కొన్నారు. పారిస్ పేలుళ్లను దురదృష్టకరం అని ఖండించిన ఆజంఖాన్.. మధ్యప్రాచ్యం చమురు బావుల నుంచి అక్రమంగా సంపద దోచుకొని.. ఆ సొమ్మును యూరప్ నగరాల వైభవాలకు వాడుకోరాదని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా, దాని మిత్రరాజ్యాల ఆర్థిర ప్రయోజనాలే ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభానికి మూలకారణమని ఆయన పేర్కొన్నారు. 'ఇరాక్, సిరియా, లిబియా, ఇరాన్‌లోని చమురు బావులను అక్రమంగా దోచుకొని.. ఆ డబ్బుతో పారిస్ వంటి మీ నగరాలను మద్యం, పార్టీలతో వైభవోపేతంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. వేలమంది నిరాశ్రయులను చేసింది. దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని ఆజంఖాన్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో చమురు సంపద కోసమే అమెరికా, రష్యాలో ప్రస్తుత సంక్షోభాన్ని మరింతగా రాజేస్తున్నాయని మండిపడ్డారు. -
టపాసులు పేలినా అదే భయం
నాలుగు రోజుల క్రితం జరిగిన పేలుళ్లు ఇప్పటికీ వాళ్లను భయపెడుతూనే ఉన్నాయి. ఏ మూల చిన్న టపాసు పేలినా కూడా మళ్లీ బాంబు పేలుళ్లు సంభవించాయంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము సమయంలో ప్యారిస్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 129 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా టపాసులు పేలిన చప్పుళ్లు విన్న కొంతమంది.. మళ్లీ బాంబు దాడులు జరుగుతున్నాయన్న అనుమానంతో పోలీసులకు ఫోన్ల మీద ఫోన్లు చేశారట. కొంతమంది యువకులతో కలిసి తాము పాటలు పాడుకుంటున్నామని, అంతలో చాలామంది పరుగులు పెడుతూ ఉండటంతో తాము కూడా పరిగెత్తామని లారిన్ అనే యువతి తెలిపింది. మృతులకు నివాళి అర్పించేందుకు సెంట్రల్ ప్యారిస్ ప్రాంతానికి వెళ్లిన వందలాది మందిలో ఆమె కూడా ఉంది. తనకు బాంబు పేలిన శబ్దం లాంటిది వినిపించిందని, దాంతో వెంటనే పరుగులు తీశానని మరో యువకుడు చెప్పాడు. అయితే కేవలం కొంతమంది టపాసులు కాల్చడం వల్లే ఆ శబ్దాలు వచ్చాయి తప్ప బాంబు పేలుళ్లు కావని పోలీసులు నిర్ధారించారు. అక్కడికి కొంత దూరంలో కూడా అలాంటి చప్పుళ్లే వచ్చాయి.. తీరాచూస్తే అక్కడ ఓ మేడ మీద బల్బు పేలింది. అది చూసి అటు వెళ్లేవాళ్లు అందరూ భయపడి.. కొత్తగా దాడులు జరిగాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేశారు. -
అమెరికా చర్యల వల్లే ప్యారిస్ దాడులు: ఆజంఖాన్
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల గురించి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్‌ల మీద అగ్రరాజ్యాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే ప్యారిస్‌లో దాడులు జరిగాయని, ఈ విషయాన్ని అమెరికా లాంటి దేశాలు గుర్తించాలని ఆయన అన్నారు. అయితే, ఉగ్రదాడులు జరగడం మాత్రం దురదృష్టకరమని చెప్పారు. మధ్యప్రాచ్యంలోని చమురు నిల్వలను దోచుకుని సంపాదించిన సొమ్ముతో యూరోపియన్ దేశాల్లో దీపాలు వెలిగించుకోవడం సరికాదని హితవు పలికారు. అమెరికా, దాని మిత్ర దేశాలకు మధ్య ఆసియాలో ఉన్న ఆర్థిక ప్రయోజనాలే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణమని ఆజంఖాన్ విశ్లేషించారు. ఇరాక్, సిరియా, లిబియా, ఇరాన్ దేశాల్లోని చమురు క్షేత్రాలను అక్రమంగా ఆక్రమించుకుని సంపాదించిన సొమ్ముతో ప్యారిస్ నగరంలో జల్సాలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐఎస్ఐఎస్ అడ్డాలు అనుకున్న ప్రాంతాలపై దాడులు చేయడంతో పాటు, అమాయక ప్రజలను చంపేస్తున్నారని, వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నారని, ఇందుకు ఏం సమాధానం చెబుతారని ఆయన అన్నారు. భారతీయుల్లా కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి తప్ప.. అనైతిక మార్గాలకు పాల్పడకూదని అమెరికా, రష్యాలకు ఆయన చెప్పారు. -
పేలుళ్లకు కుట్ర అతడి పనేనా?
ఫ్రాన్స్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో 129 మరణించి.. మరో 349 మంది తీవ్రంగా గాయపడిన ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తి కోసం ఫ్రెంచి, బెల్జియం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బ్రసెల్స్‌లో జన్మించిన అబ్దెస్లాం సలా (26) అనే వ్యక్తిని అత్యవసరంగా గుర్తించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఫ్రెంచి పోలీసులు తెలిపారు. అతడికి ఉగ్ర దాడులతో సంబంధం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఎవరూ అతడిని వ్యక్తిగతంగా పలకరించొద్దని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నాటి దాడుల తర్వాతి నుంచి ఇప్పటివరకు ఏడుగురిని బెల్జియంలో అరెస్టు చేశారు. వాళ్లలో ఒకడు సలా సోదరుడు అయి ఉంటాడని భావిస్తున్నారు. అసలు ఉగ్రదాడులకు కుట్ర మొత్తం బెల్జియంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ తెలిపారు. ఆదివారం నాడు కూడా బ్రసెల్స్ జిల్లాలో ఉగ్రవాదులను, వాళ్ల లింకులను తెలుసుకునేందుకు భారీ స్థాయిలో పోలీసు సోదాలు జరిగాయి. ఈ విషయాన్ని బెల్జియం ప్రభుత్వ ప్రసారసంస్థ ఆర్‌టీబీఎఫ్ వెబ్సైట్ తెలిపింది. బ్రసెల్స్‌లోని మోలెన్బీక్లో నివసించే ఇద్దరు ఫ్రెంచి జాతీయులు కూడా దాడికి పాల్పడి మరణించిన ఉగ్రవాదుల్లో ఉన్నట్లు గుర్తించారు. -
పారిస్ దాడి: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బ్రసెల్స్: పారిస్ దాడితో సంబంధముందని అనుమానిస్తున్న ముగ్గురిని బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బ్రసెల్స్ లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సాయంత్రం వీరు పారిస్ లో గడిపారు. పారిస్ లో దాడులు జరిగిన ప్రాంతాల్లో బెల్జియం రిజిస్ట్రేషన్లతో ఉన్న రెండు కార్లను గుర్తించారు. ఈ వాహనాలకు, వీరికి ఏమైనా సంబంధం ఉన్న అనే కోణంలో బెల్జియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితుల అరెస్ట్ ను బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ ధ్రువీకరించారు. పారిస్ దాడితో వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై తమ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. కాగా పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 129కి పెరిగింది. 352 మంది గాయపడ్డారు. వీరిలో 99 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
పారిస్‌లో నరమేధం
ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి మారణహోమం సృష్టించారు. సరిగ్గా ఏడేళ్ల కిందట భారతదేశంలోని ముంబై నగరంపై ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన తరహాలోనే ఉగ్రవాదులు పారిస్‌పై దాడికి తెగబడ్డారు. ఎనిమిది మంది ఉగ్రవాదులు బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో పాటు ఆత్మాహుతి దాడులతో అమాయక ప్రజలపై పంజా విసిరారు. ఫుట్‌బాల్ క్రీడ జరుగుతున్న పారిస్ అంతర్జాతీయ స్టేడియం, రాక్ బ్యాండ్ ప్రదర్శన జరుగుతున్న బాతాక్లాన్ థియేటర్లతో పాటు.. పలు కెఫేలపై విచక్షణారహితంగా తూటాలు, బాంబులు పేల్చారు. ఈ మారణహోమంలో 128 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. స్టేడియం వద్ద బాంబులు పేలినప్పుడు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు స్టేడియం లోపల ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. పేలుళ్ల అనంతరం ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:30 గంటల (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3:00 గంటలు) నుంచి మొదలైన ఈ మారణకాండ అర్ధరాత్రి 12 గంటల వరకూ కొనసాగింది. దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో ఏడుగురు ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోగా.. ఒకరిని పారిస్ పోలీసులు హతమార్చారు. ఇంకా ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న అనుమానాలతో ప్రజలు నిలువెల్లా వణికిపోతున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి.. సరిహద్దులను మూసివేశారు. ఈ దాడి తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా) ప్రకటించింది. ఇది ఇస్లామిక్ స్టేట్ దురాగతమేనన్న హోలాండ్.. దాడిని తమ దేశంపై యుద్ధంగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తామని.. అందులో నిర్దయగా వ్యవహరిస్తామని ప్రకటించారు. పారిస్‌పై ఉగ్రదాడితో ప్రపంచం యావత్తూ నివ్వెరపోయింది. ఇది మానవ జాతిపైనే దాడి అని... భారత్, అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్, ఇరాన్ సహా ప్రపంచ దేశాల అధినేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. బాంబులు, తుపాకులు, ఆత్మాహుతి దాడులతో తెగబడ్డ ముష్కరులు బాతాక్లాన్ థియేటర్లో ప్రజలను బంధించి 82 మంది ఊచకోత స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం వద్ద ఆత్మాహుతి, బాంబు దాడులు స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న అధ్యక్షుడు హోలాండ్ సురక్షితం సమీపంలోని రెస్టారెంట్లు, కెఫేలపై తుపాకీ కాల్పులతో బీభత్సం ఏడు చోట్ల ఉగ్రదాడులు.. 128 మంది మృతి, 300 మందికి గాయాలు 8 మంది ఉగ్రవాదులు హతం.. వారిలో ఏడుగురు ఆత్మాహుతి ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితి విధింపు.. సరిహద్దుల మూసివేత దాడి చేసింది మేమే.. సిరియాలో దాడులకు ప్రతీకారం: ఐఎస్ఐఎస్ ఇది ఫ్రాన్స్‌పై యుద్ధం.. నిర్దయగా తిప్పికొడతాం: హోలాండ్ దాడిపై ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి.. మోదీ సహా దేశాధినేతల ఖండన ప్రపంచ కళాసాహిత్యాల కాణాచి పారిస్.. ఉగ్రరక్కసి కరాళనృత్యంతో నెత్తురోడింది. ఉగ్రవాదుల రక్తపిపాసకు ఫ్రాన్స్ రాజధానిలో అమాయక ప్రజలు బలయ్యారు. పగటి పూట పనులు ముగించుకుని సాయంత్రం దాటాక క్రీడా, సాహిత్య, సంగీత కార్యక్రమాలతో సేదతీరుతున్న జనంపై ముష్కర మూకలు పంజావిసిరాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా భావిస్తున్న దుండగులు ఆత్మాహుతి దాడులు, బాంబులు, తుపాకీ కాల్పులతో విరుచుకుపడ్డారు. ఏడేళ్ల కిందట ముంబై మహానగరంలో సాగించిన తరహాలోనే నరమేధానికి తెగబడ్డారు. వారి దాడిలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:30 గంటలకు.. తొలుత స్టేడ్ డి ఫ్రాన్స్ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అది మొదలు అర్ధరాత్రి 1 గంట వరకూ.. మూడున్నర, నాలుగు గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మారణహోమం సాగించారు. నగరంలోని పలు రెస్టారెంట్లు, కెఫేలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఏడేళ్ల కిందట ముంబై నగరంపై జరిగిన ఉగ్రదాడి తరహాలోనే.. సంగీత ప్రదర్శన మందిరమైన బాతాక్లాన్ థియేటర్లో ప్రజలను బంధించి 82 మందిని ఊచకోత కోశారు. పోలీసుల ప్రతి దాడితో రాత్రి 1 గంట తర్వాత మారణకాండ ముగిసింది. మొత్తం 8 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొనగా.. వారిలో ఏడుగురు ఆత్మాహుతితో చనిపోయారు. ఒకరు పోలీసు కాల్పుల్లో హతమయ్యారు. స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం గేట్లు సెంట్రల్ పారిస్‌కు ఉత్తరంగా ఉన్న ఫ్రాన్స్ అంతర్జాతీయ స్టేడియం స్టేడ్ డి ఫ్రాన్స్‌లో.. ఫ్రాన్స్ - జర్మనీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ కూడా స్టేడియంలో ఈ మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. స్టేడియంలో 80 వేల మంది ప్రేక్షకులు ఉన్నారు. రాత్రి 8:30 గంటల సమయంలో స్టేడియం రెండు ప్రవేశ మార్గాల వద్ద రెండు ఆత్మాహుతి దాడులతో పేలుళ్లు సంభవించాయి. స్టేడియం సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ దగ్గర ఒక బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారు. స్టేడియం వద్ద పేలుళ్లతో లోపలున్న ప్రేక్షకులు భీతావహులయ్యారు. ఆట ముగిసిన తర్వాత అందరూ మైదానంలోకి చేరుకుని భయంభయంగా కాలం గడిపారు కానీ.. బయటకు వెళ్లేందుకు సాహసించలేదు. పేలుళ్ల నేపథ్యంలో అధ్యక్షుడు హొలాండేను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. పెటిట్ కాంబోడ్జే, లె కారిలాన్ రెస్టారెంట్లు స్టేడియం వద్ద పేలుళ్లు జరిగిన దాదాపు గంట తర్వాత.. అక్కడికి సుమారు ఐదు మైళ్ల దూరంలోని పెటిట్ కాంబోడ్జే, లె కారిలాన్ రెస్టారెంట్లపై ఉగ్రవాదులు కాల్పులతో దాడులు జరిపారు. ఈ దాడిలో రెస్టారెంట్లలో ఉన్న వారిలో 14 మంది చనిపోయారు. బాతాక్లాన్ సమీపంలోని రెస్టారెంట్లు పెటిట్ కాంబోడ్జే రెస్టారెంట్‌కు దక్షిణంగా ఉన్న బాతాక్లాన్ థియేటర్ సమీపంలో లా బెలె ఎక్విపె బార్, బౌల్వార్డ్ వాల్టేర్ కెఫేలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దాడిలో కెఫేల్లో ఉన్న వారిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బాతాక్లాన్ థియేటర్ అమెరికాకు చెందిన రాక్ బ్యాండ్ (రాక్ మ్యూజిక్ బృందం) ‘ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్’ సంగీత ప్రదర్శన జరుగుతున్న బాతాక్లాన్ థియేటర్లో ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు దాదాపు 100 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసిరి 82 మంది ప్రాణాలను బలిగొన్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి మారణ కాండ సాగింది. పోలీసులు, కమెండోలు దూసుకొచ్చేసరికి ముగ్గురు ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు జాకెట్లు పేల్చుకుని చనిపోయారు. మరొక ఉగ్రవాది పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. కాసా నో స్ట్రాపిజేరియా బాతాక్లాన్కు కూత వేటు దూరంలోని కాసా నోస్ట్రాపిజేరియా కెఫేపై ఉగ్రవాదులు తుపాకులతో దాడి చేశారు. ఐదుగురు చనిపోయారు. దాడి చేసింది మేమే: ఐఎస్ఐఎస్ పారిస్‌లో దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. అరబిక్, ఫ్రెంచి భాషల్లో ఇంటర్నెట్లో విడుదల చేసిన ప్రకటనను.. ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు. అది నిజంగా ఐఎస్ఐఎస్ విడుదల చేసిన ప్రకటనేనా అనేది నిర్ధారించటం సాధ్యం కాకపోయినప్పటికీ.. ఆ సంస్థ గత ప్రకటనల్లాగే ఉండటంతో పాటు ఐఎస్ లోగో కూడా ఉంది. ఇదిలావుంటే.. బతాక్లాన్ థియేటర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఫ్రాన్స్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేస్తున్నామని వ్యాఖ్యానించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడిలో హతులైన ఉగ్రవాదుల్లోని ఒక మృతదేహం సమీపంలో సిరియా పాస్‌పోర్ట్ లభించిందని పారిస్ పోలీసులు తెలిపారు. బతాక్లాస్ వద్ద దాడికి పాల్పడ్డ వారిలో ఒకరిని వేలిముద్రల ద్వారా గుర్తించినట్లు చెప్పారు. ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి... ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు హోలాండ్ ప్రకటించారు. దేశ సరిహద్దులను మూసివేశారు. నగరంలో ఇంకా ఉగ్రవాదులు సంచరిస్తున్నారేమోనన్న అనుమానంతో భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు జారీ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు అధ్యక్షుడు హోలాండ్ బాతాక్లాన్ థియేటర్‌ను సందర్శించారు. పారిస్‌లోని పాఠశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణాలు, టెన్నిస్ కోర్టులు, ఆహార మార్కెట్లు, మ్యూజియంలతో పాటు.. విఖ్యాత ఈఫిల్ టవర్ సహా డిస్నీల్యాండ్ పారిస్ తదితర ప్రధాన పర్యాటక కేంద్రాలను శనివారం మూసివేశారు. శనివారం జరగాల్సిన క్రీడలు, ఇతర కార్యక్రమాలను రద్దుచేశారు. యూరోపియన్ చాంపియన్స్ కప్ రగ్బీ మ్యాచ్, ఐరిష్ రాక్ బ్యాండ్ యూ2 ప్రదర్శనలు రద్దయ్యాయి. నగరంలో అర్థరాత్రి వరకూ ఉగ్రదాడి జరగటంతో పారిస్‌లో అత్యధికులు ప్రజలు శనివారం ఉదయం ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. అయితే.. క్షతగాత్రులకు సాయం చేయటం కోసం వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. దాడులు జరిగిన ప్రాంతాలకు చేరుకుని మృతులకు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాలులు అర్పించారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ఐఎస్‌కు గుణపాఠం నేర్పుతాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పారిస్: తమ దేశ రాజధాని నగరంలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థకు తగిన బుద్ధి చె బుతామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండ్ అన్నారు. ఇప్పటికే ఐఎస్ స్థావ రాలపై అమెరికన్ సైన్యంతో కలిసి దాడులు జరుపుతున్న ఫ్రాన్స్ సైన్యం ఆ మతోన్మాద ఉగ్రవాద సంస్థ చర్యలను ఏ మాత్రం సహించదని హోలాండ్ స్పష్టం చేశారు. పారిస్‌లోని కేఫ్‌లలో జరిగిన కాల్పులు, నేషనల్ స్టేడియంలో జరిగిన ఆత్మాహుతి దాడి, కన్సర్ట్హాల్ లోపల ఉగ్రవాదులు సాగించిన హత్యాకాండతో మొత్తం 127 మంది అమాయక ప్రజలు బలయ్యారని హోలాండ్ వివరించారు. అత్యవసర భద్రతా సమావేశం అనంతరం హోలాండ్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛవాద దేశమైన ఫ్రాన్స్‌పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఈ యుద్ధోన్మాద చర్యలకు పాల్పడిందన్నారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఎంతమంది, వారి ఉద్దేశాలేమిటి, వారి జాతీయత ఏది, అనే అంశాల గురించి పరిశోధన జరుగుతోందన్నారు. -
'నేను కూడా పారిస్ దాడిని ఖండిస్తున్నా'
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో మరోసారి ఇస్లామోఫొబియా తెరపైకి వచ్చింది. పారిస్‌లో జరిగిన నరమేధంలో 127 మంది చనిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ.. బాధితులకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ నెట్వర్కింగ్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మాత్రం ఈ దాడులకు ఇస్లాం మతం, ముస్లిం కమ్యూనిటీయే కారణమన్నట్టు విపరీత వ్యాఖ్యలు చేశారు. కొందరు ముష్కరులు చేసిన దాడిని.. మొత్తం ముస్లింలకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ముస్లింలు అంటే భయపడేలా ఇస్లామోఫోబియాతో చేస్తున్న దాడిని నెటిజన్లు దీటుగా తిప్పికొట్టారు. ముస్లింలు కూడా పారిస్ దాడులను ఖండిస్తున్నారని పేర్కొంటూ.. ట్విట్టర్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. 'నేను ముస్లింను.. పారిస్ దాడులను ఖండిస్తున్నా. మొత్తం 150 కోట్లమంది ముస్లింలు కూడా ఖండిస్తున్నారు' అంటూ పెద్దసంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అమాయకుల ప్రాణాలు బలిగొనడం ఇస్లాం మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పారిస్ దాడులను తాము ఖండిస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ముస్లింలు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. I am a #Muslim. I condemn the #ParisAttack. Over 1.5 billion Muslims do. Please remember this. #paris #parisattacks pic.twitter.com/0O0H6yRbqY — Ulviyye Heydarova (@UlviyyeH) November 14, 2015 -
'మా దేశంపై యుద్దానికి దిగారు'
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడులను యుద్దానికి తెగబడ్డ చర్యలుగా పరిగణిస్తున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. ఉగ్రవాదుల చర్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. పారిస్ నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఐఎస్ఎస్ జరిపిన దాడులను స్వేచ్ఛాయుత దేశమైన ఫ్రాన్స్ పై ఉగ్రవాదులు చేసిన యుద్ద చర్యలుగా ఆయన అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలో మిత్రపక్షంగా ఉంటూ సిరియా, ఇరాక్ దేశాల్లో చొరబడ్డ ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై వాయు బలగాల ద్వారా దాడులు జరుపుతోంది. ఈ నెల చివర్లో ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో ఉగ్రదాడులపై హై అలర్ట్ ప్రకటించనున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. 2004లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 191 మందిని బలిగొన్న ఘటన తర్వాత యూరప్‌లో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటన ఇది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్ల ఘటనలో సుమారు 120 మంది మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే. -
నాడు ముంబై....నేడు పారిస్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శనివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్ల ఘటనలో సుమారు 120 మంది మృత్యువాతపడ్డారు. అయితే, ఈ ఉగ్రదాడి 2008లో ముంబైలో జరిగిన విషాద ఘటనతో పోలిఉండటంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్రలోని ముంబై సహా పలు నగరాలలో జనసంచారం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్, తదితర ప్రాంతాల్లో అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబై 26/11 ఘటనకు తాజాగా జరిగిన పారిస్ ఉగ్రదాడులకు చాలా మేరకు పోలికలున్నాయని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆయా హోటల్స్, మాల్స్, మార్కెట్ల యజమానులు ప్రశ్నించాలని అధికారులు వారికి సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. పర్యాటకులు, విదేశీ సందర్శకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు నేర విభాగ జాయింట్ కమిషనర్ అటుల్చంద్ర కులకర్ణి వివరించారు. 2008 ముంబై కాల్పుల విషాద ఘటనకు ఇది కాపీ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి పారిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు, పేలుళ్లు సంభవించిన విషయం విదితమే. -
శభాష్ సోషల్ మీడియా!
నగరంలో శుక్రవారం రాత్రి టెర్రరిస్టులు సృష్టించిన మారణకాండపై టీవీ ఛానళ్ల కన్నా సోషల్ మీడియా వేగంగా స్పందించింది. రక్తపాతాన్ని ప్రత్యక్షంగా చూసిన సోషల్ మీడియా యూజర్లు తమకు తెలిసిన సమాచారాన్ని వెను వెంటనే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. విద్వేషపూరిత సందేశాలకు అవకాశం ఇవ్వకుండా బహూశా తొలిసారి బాధ్యతాయుతంగా సోషల్ మీడియా వ్యవహరించింది. విద్వేషంతో విడిపోవడం కన్నా ప్రేమతో కలిసుందామన్న సందేశాలు వెల్లువెత్తాయి. టెర్రరిస్టుల దాడుల అనంతరం వీధులన్నింటినీ తక్షణం ఖాళీ చేయాలన్న భద్రతాదళాల హెచ్చరికలతో ఎక్కడికెళ్లాలో తెలియక నిశ్చేష్టులైన బాటసారులకు సోషల్ మీడియా చేయూతనిచ్చింది. ‘మా ఇంటికి రండి, ఆశ్రయిస్తాం’ అంటూ పర్షియన్ పౌరులు ముందుగా సోషల్ మీడియాలో స్పందించారు. అనంతరం ‘మా ఇంట్లో ఐదారుగురు నిద్రించేందుకు చోటుంది, రండి'.. అంటూ కొందరు, ముస్లిం మిత్రులకు కూడా చోటుందని ఇంకొందరు, 'సమీపంలో గురుద్వారా ఉంది. అక్కడికెళ్లండి. ఖల్సా ఉన్నదే మీ రక్షణ కోసం... భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడు గాక...’ అంటూ మరికొందరు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రముఖ సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’ యాజమాన్యం కూడా ‘సేఫ్టీ చెక్’ ఫీచర్‌తో సకాలంతో స్పందించింది. ‘మీ బంధుమిత్రులు ఎక్కడున్నారో, ముందుగా గుర్తించండి... వారి యోగక్షేమాలు కనుక్కోండి! వారు క్షేమంగా ఉంటే సేఫ్‌గా ఉన్నట్టు మార్క్ చేయండి’ అంటూ సందేశాలు పంపింది. టెర్రరిస్టుల కాల్పుల్లో వందమందికి పైగా మరణించిన బెటాక్లాన్ మల్టీపర్పస్ థియేటర్ పరిస్థితి గురించి సోషల్ మీడియా ఎప్పటికప్పుడు తెలియజేసింది. కాల్పులకు ముందు, కాల్పులు కొనసాగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా వేగంగానే స్పందించింది. థియేటర్లోకి టెర్రరిస్టులు జొరబడి కాల్పులు ప్రారంభించినప్పుడు అందులో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు. టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. గేట్లు పూర్తిగా మూసేస్తున్నామన్న ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందుగా పైనున్న ఫ్యాన్లు, లైట్లపై అత్యాధునిక తుపాకులతో కాల్పులు జరిపిన ముష్కరులు, ఆ తర్వాత ప్రేక్షకుల పైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో కాలిఫోర్నియాకు చెందిన ‘ఈగల్స్' అనే రాక్ బ్యాండ్ ఆఫ్ ది డెత్ మెటల్ అనే థీమ్‌తో కచేరీ నిర్వహిస్తోంది. టెర్రరిస్టుల కాల్పుల్లో రాక్ బ్యాండ్‌కు చెందిన కళాకారులెవరూ గాయపడలేదు. కాల్పులకు ముందు కనిపించిన ఉల్లాస వాతావరణం, కాల్పుల తర్వాత కనిపించిన విషాద వాతావరణానికి సంబంధించిన ఫొటోలను పలువురు యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. -
ప్యారిస్ దాడుల గురించి తెలిసి షాకయ్యాను: వైఎస్ జగన్
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన సందేశం పోస్ట్ చేశారు. ప్యారిస్ దాడుల విషయం తెలిసి షాకయ్యానని చెప్పారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి చెబుతున్నానన్నారు. Shocked at the news of #ParisAttacks. Heartfelt condolences to the families who lost their loved ones. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2015 -
తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్
ముంబై: పారిస్ ఉగ్రదాడి నుంచి ప్రముఖ నటి రేణుదేశాయ్ తృటిలో తప్పించుకున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గత కొన్ని రోజుల వరకు రేణుదేశాయ్ పర్యటించారు. పారిస్ ట్రిప్ ముగించుకొని శనివారం ఉదయం ముంబైలో దిగారు. 'ఇప్పుడే ప్యారిస్ నుంచి ముంబైలో ల్యాండ్ అయ్యాను. దిగగానే పారిస్‌పై ఉగ్రదాడి విషయం తెలిసింది. నా క్షేమం కోసం మెసేజ్‌లు చేసిన వారికి కృతజ్జతలు' అంటూ రేణుదేశాయి ట్విట్ చేశారు. I just landed in Mumbai. Heard about the Paris attack right now! I am safe. A heartfelt thank you for the msgs of concern for my safety! — renu (@renuudesai) November 14, 2015 -
ఉగ్రదాడిపై అగ్రనేతల ఖండన
పారిస్ ఉగ్రవాద దాడులను ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ కు అండగా ఉంటామని చెప్పారు. ఎవరేమన్నారంటే.. పారిస్ పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పారిస్‌కు భారత్ అండగా ఉంటుంది: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉగ్రవాద దాడి ఘటన తీవ్రమనోవేదనకు గురిచేసింది. పేలుళ్లలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి: భారత ప్రధాని నరేంద్రమోదీ ఇది కేవలం పారిస్ పై జరిగిన దాడి మాత్రమే కాదు..మానవత్వం పై జరిగిన దాడి. ఫ్రాన్స్‌కు న్యాయం జరిగేవరకు ఫ్రాన్స్‌కు మేం అండగా ఉంటాం: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా: ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ పారిస్ పై ఉగ్రదాడిని ఖండిస్తున్నా: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాన్స్‌లో కాల్పుల ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ -
8 మంది ఉగ్రవాదుల హతం
-
సిరియాలో వేలు పెడతారా.. అందుకే దాడి!
అసలు ఫ్రాన్స్ మీద ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది... దాడి చేసింది ఎవరు.. ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తాయి. ఇస్లామిక్ స్టేట్ వాళ్లే దాడి చేసి ఉంటారని భావించినా, తొలుత స్ఫష్టమైన ఆధారాలేవీ లభించలేదు. తర్వాత మాత్రం దాడి చేసింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. అయితే అసలు ఈ దాడికి కారణం ఏంటన్నది మాత్రం తర్వాత తెలిసింది. సిరియా విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడి చేశామని దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ''ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్దే తప్పని అతడు స్పష్టంగా చెప్పాడు.. నేను ఆ విషయం విన్నాను. సిరియా విషయంలో హోలండ్ జోక్యం చేసుకుని ఉండకూడదన్నాడు. ఇరాక్ గురించి కూడా మాట్లాడాడు'' అని పియెర్ జనాస్జక్ అనే రేడియో ప్రెజెంటర్ తెలిపారు. ద బటాక్లాన్ అనే సంగీత వేదిక వద్ద ఈ ఉగ్రవాది మాట్లాడుతుండగా తాను విన్నానని అన్నారు. 'అల్లాహో అక్బర్' అంటూ మరికొందరు ఉగ్రవాదులు నినాదాలు కూడా చేశారన్నారు. -
8 మంది ఉగ్రవాదుల హతం
పారిస్: ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో 8 మందిని మట్టుపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్ ఉగ్రవాద దాడుల్లో సుమారు 150 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాడి తర్వాత హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా బలగాలు ఇప్పటి వరకు 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిలో ముగ్గురు బాంబులతో కూడిన బెల్టులను ధరించి ఉన్నట్టు సమాచారం. వీరిని బటాక్లాన్ వేదిక వద్దే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు దేశ సరిహద్దులను మూసివేశాయి. మరిన్ని దాడులు జరగకుండా గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎలాంటి దయలేకుండా అణచివేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్ తెలిపారు. జీ20 సదస్సుకు హాజరు కావల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు. దాడుల అనంతరం ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ దాడితో జీ20 సదస్సు రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. -
ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడులు...
-
హీరోయిన్ల గుండె పగిలింది
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల విషయం తెలిసి పలువురు హీరోయిన్లు స్పందించారు. తెల్లవారుజామునే జరిగిన ఈ ఘటన దారుణమంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరోయిన్లు అనుష్కాశర్మ, ప్రియాంకా చోప్రాలతో పాటు త్రిష, ఇలియానా లాంటి వాళ్లు కూడా ఈ ఘటనపై స్పందించారు. పొద్దున్న లేస్తూనే.. ప్యారిస్‌లో దాడుల గురించిన దారుణమైన విషయం తెలిసింది. ఈ పిరికిపందల దాడులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్యారిస్ ప్రజలకు మరింత ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను -అనుష్కాశర్మ ప్యారిస్‌లో జరిగినది తెలిసి చాలా డిస్ట్రబ్ అయ్యాను. అసలు ఈ ప్రపంచానికి ఏమైపోతోంది.. ఈ హింసాకాండ జరగాల్సిన అవసరం ఏముంది.. ప్రే ఫర్ ప్యారిస్.. నా హృదయం గాయపడింది. -ప్రియాంకా చోప్రా పారిస్ ఘటన గురించి వినగానే చాలా బాధ పడ్డాను, పారిస్‌లో ఉగ్రదాడి బాధితులకు కోసం ప్రార్థిస్తున్నాను -హన్సిక ప్యారిస్ గురించి ఇంత దారుణమైన వార్తా! ఆ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. అసలు ఈ జనం ఏం కావాలనుకుంటున్నారు.. (తన ఇన్‌స్టాగ్రామ్‌లో నల్లటి ఫొటో ఒకటి పెట్టింది) -ఇలియానా త్రిష మాత్రం ఏమీ వ్యాఖ్యలు చేయకుండా.. ప్యారిస్ విషయం తెలిసి గుండె బద్దలైందంటూ సింబాలిక్‌గా గుండె పగిలిన బొమ్మ పెట్టింది. Woke up to the horrific news about attacks in Paris. Pray for more courage for the people in Paris against these cowardly attacks . — Anushka Sharma (@AnushkaSharma) November 14, 2015 So disturbed by what has happened in Paris. What is the world coming to.. What is the point of the violence.. #PrayForParis .My heart hurts — PRIYANKA (@priyankachopra) November 14, 2015 Such terrible terrible news about Paris! praying for the families...what do people expect to gain... https://t.co/bW6jeuDdJK — Ileana D'Cruz (@Ileana_Official) November 14, 2015 Praying for Paris and the many lives that have been taken & those that are continually devastated by these terrorists attacks. #PrayForParis — Hansika (@ihansika) November 14, 2015