శరీరాన్ని కవచంగా చేసి కొడుకును కాపాడింది!
పారిస్: ఏ దేశంలోనైనా అమ్మ అమ్మనే.. అమ్మతనం ఒక్కటే..! ఐదేళ్ల లూయిస్ గత శుక్రవారం బాటాక్లాన్ థియేటర్‌లో ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ సంగీత విభావరి ఎలా ఉంటుందో చూడటానికి వెళ్లాడు. అక్కడ సంగీత ఝరులు వీనులవిందు చేస్తాయని భావించాడు. కానీ ఊహించనివిధంగా బుల్లెట్ల వర్షం కురిసింది. అయినా ఆ పెను విపత్తు నుంచి ఆ పసివాణ్ణి కాపాడింది అతని తల్లి ఎల్సా డెల్‌ప్లేస్. ఉగ్రవాదులు కురిపిస్తున్న తూటాల వర్షానికి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి ఆ మాతృమూర్తి తన ఐదేళ్ల కొడుకు ప్రాణాలను నిలిపింది. తల్లి మృతదేహం చాటున బిక్కుబిక్కుమంటూ నక్కి బతికిబయటపడ్డ లూయిస్ ఇప్పుడు అమ్మ ఏదని అడుగుతున్నాడు. గత శుక్రవారం పారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం మిగిల్చిన పెనువిషాదం ఇది.
పారిస్‌లోని బాటాక్లాన్ థియేటర్‌లో కాన్సర్ట్‌కు ఐదేళ్ల లూయిస్ తల్లి ఎల్సా డెల్‌ప్లెస్ (35), అమ్మమ్మ పాట్రిషియా సాన్ మార్టిన్ (61)తో కలిసి వెళ్లాడు. అక్కడ జరిగిన ఉగ్రవాదుల నరమేధంలో లూయిస్ తల్లి, అమ్మమ్మ చనిపోయారు. వారిద్దరు ఉగ్రవాద తూటాలకు అడ్డుగా నిలబడి ఆ చిన్నారి ప్రాణాలను నిలిపారు. వారిద్దరి మృతదేహాల నడుమ నెత్తుటిధారల మధ్య లూయిస్ ప్రాణాలు దక్కించుకున్నాడు. కొడుకు ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఆ అమ్మ, అమ్మమ్మలకు ఘనంగా నివాళులర్పిస్తూ ఎల్సా స్నేహితురాలు సిహెమ్ సొయిద్ 'లీ పాయింట్'లో ఓ వ్యాసం రాశారు. తన కొడుకును ఎప్పుడూ ఆశాకిరణంగా భావించేదని, ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన లూయిస్ ఇప్పుడు ఆస్పత్రిలో బిత్తరచూపులు చూస్తున్నాడని ఆమె వివరించింది.
ఎల్సా ఎప్పుడూ ఆనందంగా ఉండేంది. కష్టకాలంలోనూ ఆమె పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడేది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందుండేది. కళా, సాంస్కృతిక ప్రపంచంతో సన్నిహితంగా మసిలేది. ఆమె ఎప్పుడూ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేది. చిలీ నియంత పినొచెట్‌పై పోరాడి ఆమె తల్లి ఇక్కడి వచ్చింది. ఆ పోరాట వారసత్వం ఆమెలో ఉండి ఉంటుంది' అని ఎల్సా మిత్రురాలు ఈ స్మృతి వ్యాసంలో పేర్కొన్నారు.