
పేలుళ్లకు కుట్ర అతడి పనేనా?
ఫ్రాన్స్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో 129 మరణించి.. మరో 349 మంది తీవ్రంగా గాయపడిన ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తి కోసం ఫ్రెంచి, బెల్జియం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బ్రసెల్స్‌లో జన్మించిన అబ్దెస్లాం సలా (26) అనే వ్యక్తిని అత్యవసరంగా గుర్తించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఫ్రెంచి పోలీసులు తెలిపారు. అతడికి ఉగ్ర దాడులతో సంబంధం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఎవరూ అతడిని వ్యక్తిగతంగా పలకరించొద్దని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నాటి దాడుల తర్వాతి నుంచి ఇప్పటివరకు ఏడుగురిని బెల్జియంలో అరెస్టు చేశారు. వాళ్లలో ఒకడు సలా సోదరుడు అయి ఉంటాడని భావిస్తున్నారు.
అసలు ఉగ్రదాడులకు కుట్ర మొత్తం బెల్జియంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ హోం మంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ తెలిపారు. ఆదివారం నాడు కూడా బ్రసెల్స్ జిల్లాలో ఉగ్రవాదులను, వాళ్ల లింకులను తెలుసుకునేందుకు భారీ స్థాయిలో పోలీసు సోదాలు జరిగాయి. ఈ విషయాన్ని బెల్జియం ప్రభుత్వ ప్రసారసంస్థ ఆర్‌టీబీఎఫ్ వెబ్‌సైట్ తెలిపింది. బ్రసెల్స్‌లోని మోలెన్‌బీక్‌లో నివసించే ఇద్దరు ఫ్రెంచి జాతీయులు కూడా దాడికి పాల్పడి మరణించిన ఉగ్రవాదుల్లో ఉన్నట్లు గుర్తించారు.