ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు మళ్లీ కుట్ర!
పారిస్: న్యూ ఇయర్ దగ్గర పడతున్న కొద్దీ ఇతర దేశాలు ఎలా ఉన్నాయో కానీ, ఫ్రాన్స్ మాత్రం చాలా అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్లు ఫ్రాన్స్ అధికారులు గుర్తించి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం ఫ్రాన్స్ నైరుతి దిశగా అధికారులు చేపట్టిన విస్తృత తనిఖీలలో భాగంగా ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. టోలూస్ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా చేసుకుని దాడుకలు పథకం పన్నిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరిని అదుపులోకి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల వరకూ తనిఖీలు చేపట్టి, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని నగరాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆ దేశాల నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకే ముఖ్యంగా ఈ దేశాలలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే మార్కెట్లు, ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. పారిస్ దుర్ఘటన తర్వాత అగ్రరాజ్యం అమెరికాలోనూ కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 130 మందికి పైగా మృతిచెందగా, దాదాపు 300 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.