french police
-
సైకో వీరంగం; కాల్చి చంపిన పోలీసులు
పారిస్ : పారిస్ సమీపంలోని వెల్లిజూయిఫ్ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేయడమే గాక ఒక వ్యక్తిని చంపి, మరో ఇద్దరిని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నిందితున్ని పట్టుకొని అక్కడిక్కడే కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. సౌత్ సెంట్రల్ పారిస్‌కు 8 కిమీ దూరంలో ఉన్న వెల్లిజూయిఫ్ పార్క్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి కత్తితో తనకు అడ్డం వచ్చిన వ్యక్తిని పొడిచి చంపడమే గాక మరో ఇద్దరిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఖురాన్ కాపీతో సహా ఇతర మతపరమైన పత్రాలు దొరికాయి. అయితే గత కొంత కాలంగా అతని మానసిక పరిస్థితి కూడా బాగుండడం లేదని, కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు మరికొందరు పేర్కొంటున్నారు. ఇస్లాం ప్రేరేపితంతో లేక సైకోలా మారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అన్న కోణంలో విచారించాస్తామని పోలీసులు తెలిపారు.కాగా, దాడిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పారిస్ లో తీవ్ర కలకలం, ఆందోళనలు
పారిస్: చైనా పౌరుడిని ఫ్రాన్స్ పోలీసులు కాల్చిచంపడంతో పారిస్ లో ఆందోళనలు మిన్నంటాయి. డిస్ట్రిక్ట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనకు దిగిన ఆందోళనకారులు హింసకు దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. 56 ఏళ్ల చైనా పౌరుడిని అతడి ఇంటి ముందే ఆదివారం రాత్రి పోలీసులు కాల్చిచంపారు. పొరుగువారితో ఘర్షణ పడుతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. కత్తెర్లతో దాడి చేయడంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. పోలీసులు రావడానికి ముందు కత్తెర్లతో అతడు చేపలు కోశాడని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు ప్రకటించారు. అటు చైనా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. తమ దేశ పౌరుడిని కాల్చిచంపిన ఘటనపై దర్యాప్తు జరపాలని ఫ్రాన్స్ రాయబారిని కోరింది. తమ పౌరుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. -
యువకుడిపై పోలీసుల అత్యాచారం!
పారిస్: పోలీసుల ఉన్మాదానికి నిరసనగా ఫ్రాన్స్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇటీవల ఓ 22 ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారన్న ఆరోపణలు రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కర్కశత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ సుమారు 2000 మంది ప్రజలు బోబిగ్నిలో నిర్వహించిన నిరసన ర్యాలి హింసకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసురుతూ.. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. మార్సిల్లీలోనూ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. టౌలౌస్, ఓర్లీన్స్లోనూ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని 'ఫ్రాన్స్ 24' వెల్లడించింది. యువకుడిపై అత్యాచారం ఘటనలో ఓ పోలీసుపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు మళ్లీ కుట్ర!
పారిస్: న్యూ ఇయర్ దగ్గర పడతున్న కొద్దీ ఇతర దేశాలు ఎలా ఉన్నాయో కానీ, ఫ్రాన్స్ మాత్రం చాలా అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్లు ఫ్రాన్స్ అధికారులు గుర్తించి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం ఫ్రాన్స్ నైరుతి దిశగా అధికారులు చేపట్టిన విస్తృత తనిఖీలలో భాగంగా ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. టోలూస్ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా చేసుకుని దాడుకలు పథకం పన్నిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరిని అదుపులోకి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల వరకూ తనిఖీలు చేపట్టి, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని నగరాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆ దేశాల నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకే ముఖ్యంగా ఈ దేశాలలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే మార్కెట్లు, ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. పారిస్ దుర్ఘటన తర్వాత అగ్రరాజ్యం అమెరికాలోనూ కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 130 మందికి పైగా మృతిచెందగా, దాదాపు 300 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నరమేధానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది అబ్దుల్ హమీద్ అబౌద్ (27) పోలీసుల ఆపరేషన్‌లో చనిపోయినట్టు మీడియా కథనాలు తెలిపాయి. అబ్దుల్ హమీద్‌ను పట్టుకునేందుకే సెయింట్ డెనిస్‌లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల షూటౌట్ అనంతరం అతడు చనిపోయాడా? లేదా? అన్నది పోలీసులు ధ్రువీకరించలేదు. తాను దాగున్న అపార్ట్మెంట్ చుట్టూ పోలీసులు మాటువేసి.. కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో అతడు తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అతడు తనను తాను కాల్చుకొని చనిపోయినట్టు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ రీచీర్ అనధికారికంగా పేర్కొన్నారు. అయితే, పోలీసుల షూటౌట్లో అబ్దుల్ హమీద్ చనిపోయాడని, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. సెయింట్ డెనిస్‌లో బుధవారం భారీ ఎత్తున జరిగిన ఈ షూటౌట్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఏడుగురిని అరెస్టు చేశారు. చనిపోయిన వారిలో ఓ మహిళ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుంది. ఆత్మాహుతి బాంబర్ అయిన ఆమె అబ్దుల్ హమీద్ భార్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!
ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరం మీద దాడిచేసి.. పలుప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఫ్రెంచి పోలీసులు మట్టుబెట్టారు. మరొకరు లొంగిపోయారు. అయితే.. ఈ ఆపరేషన్ నుంచి నేర్పుగా తప్పించుకున్నది మాత్రం.. ఓ మహిళా టెర్రరిస్టు. ఆమె పేరు హయత్ బౌముదీన్. ఆమె అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, సాయుధురాలని ఫ్రెంచి అధికారులు చెబుతున్నారు. ఆమెను పట్టుకోడానికి తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. మూడు దాడుల్లో పాల్గొన్నవాళ్లు ఒకరికొకరు అంతా తెలుసని, వారంతా కూడా యెమెన్ దేశంలోని అల్ కాయిదా శిబిరాల్లో శిక్షణ పొందారని అంటున్నారు. 'డబుల్ ట్యాప్' అంటే.. ఒక తుపాకి నుంచి ఒకేసారి రెండు బుల్లెట్లు కాల్చడం లాంటివి అత్యంత అధునాత ఆయుధాల ఉపయోగంలో ప్రొఫెషనల్ శిక్షణ పొందినవాళ్లు మాత్రమే చేయగలిగిన పని. అలాంటి తరహాలో వీళ్లు కాల్పులు జరిపారు. కౌచి సోదరులను పోలీసులు మట్టుబెట్టినా, మహిళా ఉగ్రవాది హయత్ బౌముదీన్ మాత్రం అక్కడినుంచి తప్పించుకోవడంతో ఫ్రాన్సుకు ఇంకా ఉగ్రవాద ముప్పు తప్పలేదనే అధికారులు భావిస్తున్నారు. ఫ్రెంచి ప్రధాని హోలండ్ కూడా ఇదే విషయం చెబుతున్నారు. -
ముగిసిన ‘ఆపరేషన్ పారిస్’
► ఉగ్రవాదులను హతమార్చిన ఫ్రెంచ్ పోలీసులు ► మృతుల్లో చార్లీ హెబ్డోపై దాడి చేసిన టెర్రరిస్టులు ► సూపర్మార్కెట్లో మరో ఉగ్రవాది హతం ► పారిస్‌లో హై అలర్ట్; పోలీసుల అధీనంలో నగరం పారిస్: ఉగ్ర భూతం ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డోపై విరుచుకుపడి 12 నిండు ప్రాణాలు తీసి బుధవారం.. మహిళా కానిస్టేబుల్‌ను కాల్చిచంపి గురువారం.. తమ వికృత రూపం చూపిన ఉగ్రవాదులు శుక్రవారం మరోమారు విధ్వంసానికి వ్యూహం పన్నారు. కానీ ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టడాన్ని సవాలుగా తీసుకున్న ఫ్రెంచ్ పోలీసులు ఎట్టకేలకు అందులో విజయవంతమయ్యారు. చార్లీ హెబ్డేపై దాడి చేసిన ఉగ్ర సోదరులుగా భావిస్తున్న ఇద్దరిని ఉత్తర పారిస్‌లోని ఒక ప్రింటింగ్ ప్లాంట్‌లో హతమార్చారు. ఆ కర్మాగారాన్ని చుట్టుముట్టి, వారిని హతమార్చి, ఉగ్రవాదులు బందీగా పట్టుకున్న వ్యక్తిని సురక్షితంగా విడిపించారు. తూర్పు పారిస్‌లోని ఒక సూపర్మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదినీ చంపేశారు. రెండు బృందాలుగా..రెండు బృందాలుగా విడివడిన ఉగ్రవాదులు శుక్రవారం పారిస్‌లోని రెండు ప్రాంతాల్లో పలువురిని బందీలుగా పట్టుకున్నారు. ప్రింటింగ్ ప్లాంట్‌లోని ఉగ్ర సోదరులు ఒక బృందం కాగా, పారిస్‌కు తూర్పుగా చార్లీ హెబ్దే కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక సూపర్మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకుని అమెడీ కౌలిబలి అనే మరో సాయుధ ఉగ్రవాది ఉన్నాడు. అతడితో ఒక మహిళ కూడా ఉంది. దాడి తర్వాత ఆమె పరిస్థితేమిటో తెలియడం లేదు. ఈ సమాచారంతో పారిస్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు పారిస్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. మేయర్ కార్యాలయం, నగరంలోని ప్రఖ్యాత మేరియస్ ప్రాంతాన్ని మూసేయించారు. పౌరులు, పర్యాటకులపై మరిన్ని దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణంగా మేరియస్ వీధి యూదుల ప్రార్థనకు కొద్ది గంటల ముందు యూదులు, పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రింటింగ్ ప్లాంట్‌లో..పారిస్‌కు ఈశాన్యంగా ఉన్న దమ్మార్టిన్ ఎన్ గోల్లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్లాంట్‌లో ఒక బందీతో చార్లీ హెబ్డోపై దాడి చేసిన ఉగ్రసోదరులు చెరిఫ్ కౌచి, సయిద్(32) కౌచి(34) ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భవనం దగ్గరలో ఒక సైనిక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. తాము అమరవీరులుగా మరణించేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఆ ఉగ్రవాదులు ప్రకటించారని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. లోపలినుంచి పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్వాట్ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. భవనం పైనుంచి, నలువైపుల నుంచి లోపలికి దూసుకెళ్లి ఉగ్రసోదరులను హతమార్చాయి. అంతకుముందు వారిద్దరూ తప్పించుకునేందుకు విఫల యత్నం చేశారని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాదులిద్దరూ అల్జీరియన్లుగా భావిస్తున్నారు. సూపర్మార్కెట్లో.. ప్రింటింగ్ ప్లాంట్‌లో ఆపరేషన్ ప్రారంభించడానికన్నా ముందు.. పారిస్‌లోని ఒక సూపర్మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకున్న అమెడీ కౌలిబలి అనే ఉగ్రవాది ప్రింటింగ్ ప్లాంట్‌లోని ఉగ్రసోదరులను హతమారిస్తే.. తన దగ్గరున్న బందీలను చంపేస్తానని పోలీసులను హెచ్చరించాడు. హెచ్చరికగా షాపులో కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. కొందరు గాయాలతోనే తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు. అనంతరం పోలీసులు కాల్పులు జరుపుతూ ఆ షాప్‌లోకి దూసుకెళ్లారు. పరస్పర కాల్పుల్లో ఆ సాయుధుడితో పాటు మరో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రింటింగ్ ప్లాంట్‌లో దాగిన ఉగ్రసోదరులపై దాడి చేయొద్దని అమెడీ కౌలిబలి హెచ్చరించడంతో.. ఆ రెండు బృందాలు ఒకరికొకరు తెలుసని, సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సమన్వయంతో ఈ చర్యలకు దిగాయన్న విషయం అర్థమైందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఐదుగురిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదే గురువారం ఒక మహిళా పోలీసును కాల్చిచంపాడని అనుమానిస్తున్నామన్నారు. ఆ సాయుధ ఉగ్రవాది అమెడీ కౌలిబలి, అతడితో ఉన్న మహిళ హయత్ బౌముదీన్ల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మొత్తంమీద దాదాపు 48 గంటలకు పైగా ఫ్రాన్స్‌ను, పారిస్ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు విజయవంతంగా హతమార్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్ ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో ఫోన్లో మాట్లాడారు. పారిస్ ఘటనను ఖండించిన మోదీ.. ఉగ్రవాదంపై పోరుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో వ్యూహాత్మక పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాల్సి ఉందని ఫ్రాంకోయిస్‌తో అన్నారు.