యువకుడిపై పోలీసుల అత్యాచారం!
పారిస్: పోలీసుల ఉన్మాదానికి నిరసనగా ఫ్రాన్స్లో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇటీవల ఓ 22 ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారన్న ఆరోపణలు రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కర్కశత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ సుమారు 2000 మంది ప్రజలు బోబిగ్నిలో నిర్వహించిన నిరసన ర్యాలి హింసకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసురుతూ.. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
మార్సిల్లీలోనూ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. టౌలౌస్, ఓర్లీన్స్లోనూ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని 'ఫ్రాన్స్ 24' వెల్లడించింది. యువకుడిపై అత్యాచారం ఘటనలో ఓ పోలీసుపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.