ముగిసిన ‘ఆపరేషన్ పారిస్’ | Charlie Hebdo attack: five killed in Paris as manhunt for gunmen ends | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘ఆపరేషన్ పారిస్’

Published Sat, Jan 10 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

ముగిసిన ‘ఆపరేషన్ పారిస్’

ముగిసిన ‘ఆపరేషన్ పారిస్’

ఉగ్రవాదులను హతమార్చిన ఫ్రెంచ్ పోలీసులు
మృతుల్లో చార్లీ హెబ్డోపై దాడి చేసిన టెర్రరిస్టులు
సూపర్‌మార్కెట్లో మరో ఉగ్రవాది హతం
పారిస్‌లో హై అలర్ట్; పోలీసుల అధీనంలో నగరం

 
పారిస్: ఉగ్ర భూతం ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డోపై విరుచుకుపడి 12 నిండు ప్రాణాలు తీసి బుధవారం.. మహిళా కానిస్టేబుల్‌ను కాల్చిచంపి గురువారం.. తమ వికృత రూపం చూపిన ఉగ్రవాదులు శుక్రవారం మరోమారు విధ్వంసానికి వ్యూహం పన్నారు. కానీ ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టడాన్ని సవాలుగా తీసుకున్న ఫ్రెంచ్ పోలీసులు ఎట్టకేలకు అందులో విజయవంతమయ్యారు. చార్లీ హెబ్డేపై దాడి చేసిన ఉగ్ర సోదరులుగా భావిస్తున్న ఇద్దరిని ఉత్తర పారిస్‌లోని ఒక ప్రింటింగ్ ప్లాంట్లో హతమార్చారు. ఆ కర్మాగారాన్ని చుట్టుముట్టి, వారిని హతమార్చి, ఉగ్రవాదులు బందీగా పట్టుకున్న వ్యక్తిని సురక్షితంగా విడిపించారు. తూర్పు పారిస్‌లోని ఒక సూపర్‌మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదినీ చంపేశారు.
 
 రెండు బృందాలుగా..రెండు బృందాలుగా విడివడిన ఉగ్రవాదులు శుక్రవారం పారిస్‌లోని రెండు ప్రాంతాల్లో పలువురిని బందీలుగా పట్టుకున్నారు. ప్రింటింగ్ ప్లాంట్లోని ఉగ్ర సోదరులు ఒక బృందం కాగా, పారిస్‌కు తూర్పుగా చార్లీ హెబ్దే కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక సూపర్‌మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకుని అమెడీ కౌలిబలి అనే మరో సాయుధ ఉగ్రవాది ఉన్నాడు. అతడితో ఒక మహిళ కూడా ఉంది. దాడి తర్వాత ఆమె  పరిస్థితేమిటో తెలియడం లేదు. ఈ సమాచారంతో  పారిస్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు పారిస్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. మేయర్ కార్యాలయం, నగరంలోని ప్రఖ్యాత మేరియస్ ప్రాంతాన్ని మూసేయించారు. పౌరులు, పర్యాటకులపై మరిన్ని దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణంగా మేరియస్ వీధి యూదుల ప్రార్థనకు కొద్ది గంటల ముందు యూదులు, పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
 
 ప్రింటింగ్ ప్లాంట్లో..పారిస్‌కు ఈశాన్యంగా ఉన్న దమ్మార్టిన్ ఎన్ గోల్‌లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్లాంట్‌లో ఒక బందీతో  చార్లీ హెబ్డోపై దాడి చేసిన ఉగ్రసోదరులు చెరిఫ్ కౌచి, సయిద్(32) కౌచి(34) ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భవనం దగ్గరలో ఒక సైనిక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. తాము అమరవీరులుగా మరణించేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఆ ఉగ్రవాదులు ప్రకటించారని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. లోపలినుంచి పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్వాట్ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. భవనం పైనుంచి, నలువైపుల నుంచి లోపలికి దూసుకెళ్లి ఉగ్రసోదరులను హతమార్చాయి. అంతకుముందు వారిద్దరూ తప్పించుకునేందుకు విఫల యత్నం చేశారని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాదులిద్దరూ అల్జీరియన్లుగా భావిస్తున్నారు.
 
 సూపర్‌మార్కెట్లో.. ప్రింటింగ్ ప్లాంట్లో ఆపరేషన్ ప్రారంభించడానికన్నా ముందు.. పారిస్‌లోని ఒక సూపర్‌మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకున్న అమెడీ కౌలిబలి అనే ఉగ్రవాది ప్రింటింగ్ ప్లాంట్లోని ఉగ్రసోదరులను హతమారిస్తే.. తన దగ్గరున్న బందీలను చంపేస్తానని పోలీసులను హెచ్చరించాడు. హెచ్చరికగా షాపులో కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. కొందరు గాయాలతోనే తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు. అనంతరం పోలీసులు కాల్పులు జరుపుతూ ఆ షాప్‌లోకి దూసుకెళ్లారు. పరస్పర కాల్పుల్లో ఆ సాయుధుడితో పాటు మరో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.
 
 ప్రింటింగ్ ప్లాంట్లో దాగిన ఉగ్రసోదరులపై దాడి చేయొద్దని అమెడీ కౌలిబలి హెచ్చరించడంతో.. ఆ రెండు బృందాలు ఒకరికొకరు తెలుసని, సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సమన్వయంతో ఈ చర్యలకు దిగాయన్న విషయం అర్థమైందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఐదుగురిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదే గురువారం ఒక మహిళా పోలీసును కాల్చిచంపాడని అనుమానిస్తున్నామన్నారు. ఆ సాయుధ ఉగ్రవాది అమెడీ కౌలిబలి, అతడితో ఉన్న మహిళ హయత్ బౌముదీన్‌ల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మొత్తంమీద దాదాపు 48 గంటలకు పైగా ఫ్రాన్స్‌ను, పారిస్ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు విజయవంతంగా హతమార్చారు.
 
 ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్
 ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో ఫోన్లో మాట్లాడారు. పారిస్ ఘటనను ఖండించిన మోదీ.. ఉగ్రవాదంపై పోరుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో వ్యూహాత్మక పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాల్సి ఉందని ఫ్రాంకోయిస్‌తో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement