ఘటనా స్థలంలో పోలీసులు
పారిస్ : సరదాగా గడుపుదామని పారిస్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఆదివారం అర్ధరాత్రి పారిస్‌లోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం... జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా చుట్టూ ఉన్న వాళ్లపై కత్తి, ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. ఇద్దరు బ్రిటీష్ టూరిస్టులు సహా మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు వెంబడించిన స్థానికులపై కూడా ఐరన్ రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు కూడా రాళ్లతో కొడుతూ అతడిని వెంబడించాడు. అయినప్పటికీ అతడు తప్పించుకున్నాడు. కాగా నిందితుడిని అఫ్ఘాన్ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా పరిగణించలేమని.. కేవలం అపరిచితులను లక్ష్యంగా చేసుకునే అతడు దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
హై అలర్ట్..
గత కొన్ని నెలలుగా పారిస్‌లో ఇలాంటి ఘటనలు అధికమవడంతో పోలీసులు హై అలర్ట్ విధించారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈఫిల్ టవర్ వంటి పర్యాటక స్థలాల్లో నిఘా పెంచారు. కాగా 2015లో చార్లో హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు 240 మంది ఉగ్ర దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం ఇటువంటి ఉన్మాదుల చర్యలు ఎక్కువవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment