ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నరమేధానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది అబ్దుల్ హమీద్ అబౌద్ (27) పోలీసుల ఆపరేషన్‌లో చనిపోయినట్టు మీడియా కథనాలు తెలిపాయి. అబ్దుల్ హమీద్‌ను పట్టుకునేందుకే సెయింట్ డెనిస్‌లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల షూటౌట్ అనంతరం అతడు చనిపోయాడా? లేదా? అన్నది పోలీసులు ధ్రువీకరించలేదు. తాను దాగున్న అపార్ట్‌మెంట్ చుట్టూ పోలీసులు మాటువేసి.. కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో అతడు తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అతడు తనను తాను కాల్చుకొని చనిపోయినట్టు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ రీచీర్ అనధికారికంగా పేర్కొన్నారు.
అయితే, పోలీసుల షూటౌట్‌లో అబ్దుల్ హమీద్ చనిపోయాడని, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. సెయింట్ డెనిస్‌లో బుధవారం భారీ ఎత్తున జరిగిన ఈ షూటౌట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఏడుగురిని అరెస్టు చేశారు. చనిపోయిన వారిలో ఓ మహిళ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుంది. ఆత్మాహుతి బాంబర్ అయిన ఆమె అబ్దుల్ హమీద్ భార్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.