ఉన్నాడా? చచ్చాడా?
సెయింట్ డెనిస్: పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్ ఏమయ్యాడన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. అబ్దుల్ హమీద్‌ను హతమార్చేందుకే ఫ్రాన్స్ పోలీసులు సెయింట్ డెనిస్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు ధ్రువీకరించడం లేదు.
మరోవైపు ఎన్‌కౌంటర్‌లో అతడు చనిపోయినట్టు రెండు దఫాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఈ కథనాలపైనా స్పష్టత ఇవ్వడానికి పోలీసులు ముందుకురాకపోవడంతో అసలు దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హమీద్ బతికి ఉన్నాడా? చనిపోయాడా? అన్నది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో షూటౌట్ జరిగిన అపార్ట్‌మెంట్‌లో ఇప్పటికీ ఓ వ్యక్తి నక్కి ఉన్నాడని, అయితే అతను ఉగ్రవాదో, కాదో తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఉగ్రవాదులపై యుద్ధం కొనసాగిస్తాం: హోలాండ్
పారిస్‌లో నరమేధం నేపథ్యంలో ఉగ్రవాదులపై తాము తలపెట్టిన యుద్ధాన్ని ఆపబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్ స్పష్టం చేశారు. సెయింట్ డెనిస్‌లో బుధవారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. అమెరికా, రష్యాలతో కలిసి ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.