పారిస్‌లో మళ్లీ దాడులకు ప్లాన్ వేశారు!
- ముగిసిన ఆపరేషన్!
- ఇద్దరు ఉగ్రవాదులు మృతి, ఏడుగురి అరెస్టు
పారిస్: ఫ్రాన్ రాజధాని పారిస్‌లో నరమేధానికి కారణమైన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఫ్రాన్స్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ ముగిసింది. ఉత్తర పారిస్ శివార్లలో సెయింట్ డెనిస్ పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నక్కిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా.. భారీ ఎదురుకాల్పుల అనంతరం ఏడుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ ఆయుధాలతో పోలీసులు అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టడంతో.. అందులో ఉగ్రవాదుల వెంట ఉన్న ఓ మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకొని.. ఆత్మాహుతి చేసుకుంది. మరో ఉగ్రవాది పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఏడు గంటలపాటు కొనసాగిన ఈ భారీ ఆపరేషన్‌లో నలుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
సూత్రధారి హతం?
పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. సెయింట్ డెనిస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దాక్కున్న అతన్ని మట్టుపెట్టేందుకే పోలీసులు ఈ భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే, ఎన్‌కౌంటర్‌లో అతడు చనిపోయినట్టు కథనాలు వచ్చినా.. వాటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అతను ఇంకా బతికున్నాడా? లేక ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడా? అన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదు.
మళ్లీ దాడులు!
సెయింట్ డెనిస్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులు పారిస్‌లో మరోసారి భారీ దాడులకు వ్యూహరచన చేశారని భద్రతా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పారిస్ వ్యాపార జిల్లా లక్ష్యంగా మరోసారి దాడులు చేయాలని వారు సిద్ధమయ్యారని, ఇంతలోనే పోలీసులు వారి అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించారని ఆ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు-పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సెయింట్ డెనిస్‌లో పాఠశాలలు, మెట్రో రైళ్లతోపాటు ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు.