పారిస్ ఉగ్రదాడి సూత్రధారి కోసం వేట; ఇద్దరి మృతి
పారిస్: పారిస్ ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబోద్ కోసం ప్రాన్స్ భద్రత దళాలు ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం ఉత్తర పారిస్లో అబ్దెల్ హమీద్ అబోద్ లక్ష్యంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు మరణించగా, వీరిలో ఓ మహిళా ఉగ్రవాది ఉంది. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో పలువురు పోలీసులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది.
ఉత్తర పారిస్లో ప్రత్యేక సాయుధ బలగాలు సోదాలు చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తారసపడటంతో కాల్పులు జరిపారు. తెల్లవారుజాము 4 గంటలకు కాల్పులు మొదలయ్యాయి. బలగాలకు, అనుమానితులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఓ అపార్ట్మెంట్లో అబ్దెల్ హమీద్ అబోద్ దాక్కున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసుల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
పారిస్ ఉగ్రవాద దాడుల అనంతరం ప్రాన్స్ భద్రత దళాలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.