సూత్రధారి హతం | Paris attacks: 'Ringleader' Abdelhamid Abaaoud killed in raid | Sakshi
Sakshi News home page

సూత్రధారి హతం

Published Fri, Nov 20 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

సూత్రధారి హతం

సూత్రధారి హతం

పారిస్ షూటౌట్‌లో చనిపోయిన ఉగ్రవాది అబౌదే: ఫ్రాన్స్  
 ఆత్మాహుతి చేసుకున్న మహిళా ఉగ్రవాది అతడి బంధువు


ఉగ్రదాడుల వల్ల యూరప్ దేశాల్లో భద్రతా చర్యలు ముమ్మరం
బెల్జియంలో పోలీసు దాడులు
ఇటలీలో అనుమానితుల  కోసం గాలింపు

 
 పారిస్: పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడి సూత్రధారి అబ్దెల్‌హమీద్ అబౌద్ (27) బుధవారం పోలీసుల షూటౌట్‌లో చనిపోయాడని అధికారులు ప్రకటించారు. అబౌద్ పారిస్ నగర శివార్లలోని సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేయటం.. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపటంతో ఏడు గంటల పాటు ఆపరేషన్ కొనసాగటం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో ఒక మహిళా ఉగ్రవాది బాంబులతో కూడిన జాకెట్‌తో తనను తాను పేల్చివేసుకోగా.. పోలీసు కాల్పుల్లో మరొక ఉగ్రవాది చనిపోయిన విషయమూ విదితమే.
 
 అతడు పారిస్ దాడుల సూత్రధారి, బెల్జియంకు చెందిన ఐసిస్ ఉగ్రవాది అబౌదేనని అతడి చర్మం నమూనాల పరీక్ష ద్వారా నిర్ధారించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయ్ మొలిన్ గురువారం తెలిపారు. అతడితో పాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు అపార్ట్‌మెంటును చుట్టుముట్టగానే తొలుత కాల్పులు ప్రారంభించింది ఆమేనని.. ఆ వెంటనే తనను తాను పేల్చివేసుకునే ముందు ‘నాకు సాయం చేయండి’ అంటూ కేకలు వేయటం ద్వారా పోలీసులను తన దగ్గరకు రప్పించుకుని, తనతో పాటు పేల్చివేయాలనే ప్రయత్నం చేసిందని వివరించారు. అపార్ట్‌మెంట్‌పై పోలీస్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
 
 యూరప్ అంతటా భద్రతా చర్యలు...
 ఫ్రాన్స్‌తో పాటు యూరప్ దేశాల్లోనూ పొంచివున్న ఉగ్రప్రమాదంపై ఆందోళన తీవ్రమవుతోంది. పలు దేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ముమ్మరమవుతున్నాయి. యూరప్‌లో ఉగ్రవాద ముప్పు చాలా తీవ్రంగా పెరిగిపోయే అవకాశముందని యూరోపోల్ డెరైక్టర్ రాబ్ ఆందోళన వ్యక్తంచేశారు. పారిస్ దాడిలో పాల్గొన్న ముష్కరుల్లో చాలా మంది బెల్జియం వాసులే కావటంతో దేశంలో అదనపు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్లు బెల్జియం ప్రధాని మైఖేల్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కోసం 40 కోట్ల యూరోలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికా, మిలాన్ చర్చి, లా స్కాలా ఒపెరా హౌస్‌లతో పాటు, థియేటర్లు తదితరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ప్రమాదముందంటూ అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఎఫ్‌బీఐ గుర్తించిన ఐదుగురు అనుమానితుల కోసం దేశంలో గాలిస్తున్నట్లు ఇటలీ  మంత్రి పౌలో తెలిపారు.
 
 న్యూయార్క్‌పై దాడి చేస్తాం: ఐసిస్ వీడియో
 ఈసారి న్యూయార్క్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ ఐఎస్ వీడియోను విడుదల చేసింది. పారిస్ దాడుల భయానక దృశ్యాలతో పాటు.. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌ను, బాంబు జాకెట్‌ను ధరిస్తున్న ఉగ్రవాదిని చూపుతూ అక్కడ దాడి చేస్తామన్న హెచ్చరిక జారీ చేసింది. హెరాల్డ్ స్క్వేర్, మన్‌హటన్ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాలనూ చూపింది. సిరియాలో వైమానిక దాడుల్లో తమ వారందరి మరణానికీ ప్రతీకారం తీర్చుకుంటామని.. తమ దాడులు కొనసాగిస్తామని ఐసిస్ తన మేగజీన్‌లో హెచ్చరించింది.
 
 రసాయన దాడులు చేసే ప్రమాదం...
 రాజధాని పారిస్‌లో 129 మందిని బలిగొన్న శుక్రవారం నాటి ఉగ్రదాడి మిగిల్చిన పెను విషాదం ఇంకా ఫ్రాన్స్‌ను వీడలేదు. ఐసిస్ ఉగ్రవాదులు రసాయన ఆయుధాలు లేదా జీవరసాయన ఆయుధాలతో దాడి చేసే ప్రమాదం పొంచివుందని దేశ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ హెచ్చరించారు. ఆయన గురువారం పార్లమెంటు దిగువసభలో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని మూడు నెలలు పొడిగించాలని పార్లమెంటు సభ్యులను కోరారు. మరోవైపు సిరియాలో ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. పారిస్ దాడులు జరిగిన శుక్రవారం నుంచి ఇప్పటివరకూ 35 ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఫ్రాన్స్ సైన్యం గురువారం తెలిపింది. గురువారం ఆరు స్థావరాలపై 60 బాంబులు వేసినట్లు పేర్కొంది. మొత్తం 30 వేల మంది ఉన్న ఐసిస్‌ను అంతం చేయటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ కోరారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement