సిటీలోనే షెల్టర్‌? బిహార్‌ నుంచి వచ్చి ఇక్కడే మకాం | Karnataka gangs ATM heist leads to shootout in Hyderabad ... | Sakshi
Sakshi News home page

సిటీలోనే షెల్టర్‌? బిహార్‌ నుంచి వచ్చి ఇక్కడే మకాం

Published Sun, Jan 19 2025 9:00 AM | Last Updated on Sun, Jan 19 2025 9:00 AM

Karnataka gangs ATM heist leads to shootout in Hyderabad ...

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలోని బీదర్‌తో పాటు మన నగరంలోని అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో తుపాకీతో విరుచుకుపడిన దుండగులు ఇక్కడే షెల్టర్‌ తీసుకున్నారా? అంటే.. ఔననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నగరంలో వీరి వ్యవహారశైలి, నేరం జరిగిన తీరు, వినియోగించిన వాహనంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఈ అంచనాకు వచ్చారు. దీంతో దుండగులు బస చేసే అవకాశం ఉన్న ప్రాంతాల కోసం ఆరా తీస్తున్నారు. మరోపక్క దుండగులు గురువారం సాయంత్రం ట్రాలీ బ్యాగ్స్‌ కంటే ముందే కొత్త బ్యాక్‌ ప్యాక్‌ సైతం ఖరీదు చేశారు. రోషన్‌ ట్రావెల్స్‌ పక్కన ఉన్న దోశ కింగ్‌ హోటల్‌లోనే తమ బ్యాగ్‌లో నుంచి తుపాకీ తదితరాలను తీసి కొత్త బ్యాక్‌ ప్యాక్‌లో పెట్టుకున్నట్లు తేలింది. 

బిహార్‌ టు బీదర్‌ వయా సిటీ.. 
నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు హైదరాబాద్‌ మీదుగానే బీదర్‌ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.  నిందితులు బిహార్‌కు చెందిన వారుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి. బీదర్‌లోని శివాజీ జంక్షన్‌ వద్ద ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్‌ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వచ్చారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నంబర్‌ ప్లేట్‌ ఉంది. ఇది అసలుదైనా, నకిలీదైనా వాహనం మాత్రం హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీ చేసిందని భావిస్తున్నారు.  

చోరీ చేసిన వాహనంతోనే రెక్కీ? 
నగరంలోని ఒక లాడ్జిలో రెండు మూడు రోజులు బస చేసిన దుండగులు చోరీ చేసిన వాహనం పైనే బీదర్‌ వెళ్లి వస్తూ రెక్కీ చేసి ఉంటారని, అందుకే నేరం చేసిన తర్వాత కూడా రాయ్‌పూర్‌ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. శనివారం బీదర్‌ పోలీసులతో కలిసి చేసిన తనిఖీల నేపథ్యంలో రెండు అనుమానాస్పద వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. వీటిలో దుండగులు వాడింది ఏదనేదానిపై ఆరా తీస్తున్నారు.  

తిరుమలగిరి నుంచి మళ్లీ వెనక్కి... 
ఈ నేరగాళ్లకు హైదరాబాద్‌లోని ప్రాంతాలు, రహదారులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్‌ తర్వాత అక్కడ నుంచి ఆటోలో ఎస్కేప్‌ అయ్యారు. సికింద్రాబాద్‌ అల్ఫా హోటల్‌ వద్ద ఆటో దిగిన దుండగులు డ్రైవర్‌కు డబ్బు ఇచ్చి పంపేశారు. ఆపై అక్కడ నుంచి మరో ఆటో మాట్లాడుకుని తిరుమలగిరి చౌరస్తాకు చేరుకున్నారు. ఆ ఆటో కూడా దిగిపోయిన ఇరువురూ రోడ్డు దాటి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పాత బ్యాగ్స్, బ్యాక్‌ ప్యాక్‌తో పాటు వ్రస్తాలను పడేశారు. ఆపై రోడ్డు మీదికి వచ్చి మరో ఆటో ఎక్కారు. ఆ ఆటో తిరిగి సికింద్రాబాద్‌ వైపే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఈ ఆటో ఎటు వెళ్లిందో తెలుసుకోవడంతో పాటు డ్రైవర్‌ను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఆ నాలుగు ప్రాంతాల్లో లోతుగా ఆరా... 
శనివారం ఉదయం నుంచి ఈ నేరానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులు బస చేసి ఉంటారనే అనుమానంతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, అఫ్జల్‌గంజ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అధికారులకు కీలక ఆధారం దొరికినట్లు సమాచారం.  

మనీష్‌ గ్యాంగ్‌ పనేనా? 
బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ మనీష్‌ కుషా్వహా అంటూ సమాచారం ఇచ్చారు. అతని కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. బిహార్‌ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్‌ తల్లిదండ్రులకు చూపించారు. వాళ్లు అది తమ కుమారుడి ఫొటో కాదని చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చింది. వారిచెప్పింది వాస్తవమా? కాదా? నేరం చేసింది మనీష్‌ నేతృత్వంలోని గ్యాంగ్‌ కాదా? అనే కోణాలను పరిశీలిస్తున్నారు.  

పోలీసుల వద్ద తుపాకీ ఉండాల్సిందే ‘సాక్షి’ కథనానికి స్పందించిన సిటీ సీపీ

అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ఉదంతం నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ‘సరి చేయకుంటే సమస్యలెన్నో!’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ స్పందించారు. దీనిపై ఆయన శనివారం ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉండే పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమ వెంట తుపాకులు ఉంచుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కోసం పని చేసే అధికారులు తమ వెంట కచి్చతంగా పోలీసు విభాగం ఇచి్చన తుపాకీ ఉంచుకోవాలని స్పష్టం చేశారు. 

వీరితో పాటు ప్రత్యేక విభాగాల్లో పని చేస్తున్న వారిలో ఎవరికైనా తుపాకీ జారీ అనివార్యమైతే ఆ కోణంలో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తమ వద్ద ఉండే తుపాకులను కేవలం అత్యవసర సందర్భాలు, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలని ఆనంద్‌ స్పష్టం చేశారు. కేవలం తుపాకీ కలిగి ఉండటమే కాదని... క్రమం తప్పకుండా ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాలని కొత్వాల్‌ నిర్ణయించారు. లా అండ్‌ ఆర్డర్‌తో పాటు అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారితో దశల వారీగా దీన్ని చేయించాలని స్పష్టం చేశారు. నగరంలో పని చేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్తవాటి  ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీవీ ఆనంద్‌ నిర్ణయించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement