పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 129మందిని హతమార్చిన ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేసిన కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించారు. బెల్జియంకు చెందిన 26 ఏళ్ల అబ్బుల్ హమీద్ అబౌద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఫ్రాన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు యువకులను రెచ్చగొట్టి.. అతడు ఈ దాడులకు పథక రచన చేసినట్టు భావిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు సిరియన్ కాగా, మరొకరు ఫ్రాన్ జాతీయుడని, అతనిపై ఉగ్రవాదిగా గతంలో కేసు నమోదయిందని నిర్ధారించారు. ఫ్రాన్స్ జాతీయ స్టేడియం బయట తనను తాను పేల్చుకున్న ఆత్మాహుతి బాంబర్ సిరియా వ్యక్తి అని, ఇద్లిబ్‌కు చెందిన అతని పేరు అహ్మద్ అల్ మహమ్మద్ గుర్తించారు.
పారిస్ ఉగ్రవాద దాడులకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తల ఇళ్లు, నివాసాలపై పెద్ద ఎత్తున పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి సూత్రధారుల గురించి పక్కా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాది మృతదేహం వద్ద లభించిన సిరియా వ్యక్తి పాస్‌పోర్టును ధ్రువీకరించాల్సి ఉందని, అయితే గత నెల గ్రీస్‌లో తీసుకున్న వేలిముద్రలతో ఈ పాస్‌పోర్టుపైన ఉన్న వేలిముద్రలు సరిపోయాయని చెప్పారు.