Paris attack mastermind
-
ఎట్టకేలకు సూత్రధారి ఖతం!
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నరమేధానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది అబ్దుల్ హమీద్ అబౌద్ (27) పోలీసుల ఆపరేషన్‌లో చనిపోయినట్టు మీడియా కథనాలు తెలిపాయి. అబ్దుల్ హమీద్‌ను పట్టుకునేందుకే సెయింట్ డెనిస్‌లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల షూటౌట్ అనంతరం అతడు చనిపోయాడా? లేదా? అన్నది పోలీసులు ధ్రువీకరించలేదు. తాను దాగున్న అపార్ట్మెంట్ చుట్టూ పోలీసులు మాటువేసి.. కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో అతడు తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అతడు తనను తాను కాల్చుకొని చనిపోయినట్టు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ రీచీర్ అనధికారికంగా పేర్కొన్నారు. అయితే, పోలీసుల షూటౌట్లో అబ్దుల్ హమీద్ చనిపోయాడని, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. సెయింట్ డెనిస్‌లో బుధవారం భారీ ఎత్తున జరిగిన ఈ షూటౌట్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఏడుగురిని అరెస్టు చేశారు. చనిపోయిన వారిలో ఓ మహిళ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుంది. ఆత్మాహుతి బాంబర్ అయిన ఆమె అబ్దుల్ హమీద్ భార్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు
-
పారిస్ దాడుల కీలక సూత్రధారి గుర్తింపు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 129మందిని హతమార్చిన ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేసిన కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించారు. బెల్జియంకు చెందిన 26 ఏళ్ల అబ్బుల్ హమీద్ అబౌద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్టు ఫ్రాన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కొందరు యువకులను రెచ్చగొట్టి.. అతడు ఈ దాడులకు పథక రచన చేసినట్టు భావిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు సిరియన్ కాగా, మరొకరు ఫ్రాన్ జాతీయుడని, అతనిపై ఉగ్రవాదిగా గతంలో కేసు నమోదయిందని నిర్ధారించారు. ఫ్రాన్స్ జాతీయ స్టేడియం బయట తనను తాను పేల్చుకున్న ఆత్మాహుతి బాంబర్ సిరియా వ్యక్తి అని, ఇద్లిబ్కు చెందిన అతని పేరు అహ్మద్ అల్ మహమ్మద్ గుర్తించారు. పారిస్ ఉగ్రవాద దాడులకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత ఇస్లామిక్ స్టేట్ కార్యకర్తల ఇళ్లు, నివాసాలపై పెద్ద ఎత్తున పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి సూత్రధారుల గురించి పక్కా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాది మృతదేహం వద్ద లభించిన సిరియా వ్యక్తి పాస్‌పోర్టును ధ్రువీకరించాల్సి ఉందని, అయితే గత నెల గ్రీస్‌లో తీసుకున్న వేలిముద్రలతో ఈ పాస్‌పోర్టుపైన ఉన్న వేలిముద్రలు సరిపోయాయని చెప్పారు.