పారిస్ దాడులు: భయంకరమైన సీసీటీవీ దృశ్యాలు
పారిస్: వేగంగా దూసుకొచ్చిన కారు.. సర్రుమంటూ బ్రేకుల శబ్ధంచేస్తూ ఆగింది. కారులోనుంచి ఒకడు కిందికి దిగాడు. 'వాళ్లు' ఎప్పుడూ వేసుకున్నట్లే నలుపు రంగు దుస్తులు ధరించి లోపలికి వచ్చాడు. తన ముఖంలోని భావాలు ఎవరికీ కనిపించకుండా చేతిని అడ్డంపెట్టుకున్నాడు. లోపల ఓ ఖాళీ టేబుల్ వైపునకు నడుస్తూ.. మధ్యలోనే ఆగిపోయాడు. పెదవులు, చేతులు ప్రార్థన చేస్తున్నట్టున్నాయి. చేతిని నడం మీదకు పోనిచ్చి మీట నొక్కినట్లనిపించింది. అంతే.
బ్రహిమ్ అబ్దేస్లామ్ రెండు ముక్కలైపోయాడు. నడుము కట్టుకున్న బెల్ట్ బాంబు అతడి శరీరాన్ని ముక్కలుచేస్తూ పక్కనున్నవాళ్ల ప్రాణాలనూ హరించింది. గత ఏడాది నవంబర్ 13న పారిస్ నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రమూక సృష్టించిన నరమేధానికి సంబంధించిన భయంకరమైన దృశ్యమిది. కాంప్టైర్ వోల్టెయిర్ రెస్టారెంట్ లో ఐఎస్ ఉగ్రవాది బ్రహిమ్ తనను తాన పేల్చుకున్నప్పుడు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్ కు చెందిన ఎం6 మీడియా సంస్థ మొదటిగా ఈ దృశ్యాలను ప్రసారంచేసింది.
ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో కనీవినీ ఎరగని రీతిలో 2015 నవంబర్ 13న జరిగిన ఉగ్రదాడిలో 130 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఫ్రాన్స్ ప్రభుత్వం నరమేధానికి కారకులైనవానిని కొద్ది గంటల్లోనే మట్టుపెట్టామని ప్రకటించింది. కాగా, ఇంకొంతమంది సూత్రధారులకోసం వేట కొనసాగుతోంది. ఫ్రాన్స్ లో మరో ఏడాది వరకు అత్యవసరపరిస్థితులు కొనసాగనున్నాయి.