
పారిస్ పేలుళ్లపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
బరెల్లి: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ పారిస్ పేలుళ్లపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సిరియా, ఇరాక్‌లో అమెరికా చర్యలకు ప్రతిచర్యగానే పారిస్ పేలుళ్లు జరిగాయని, ఈ విషయాన్ని ఆ అగ్రరాజ్యం గుర్తించాలని పేర్కొన్నారు. పారిస్ పేలుళ్లను దురదృష్టకరం అని ఖండించిన ఆజంఖాన్.. మధ్యప్రాచ్యం చమురు బావుల నుంచి అక్రమంగా సంపద దోచుకొని.. ఆ సొమ్మును యూరప్ నగరాల వైభవాలకు వాడుకోరాదని పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా, దాని మిత్రరాజ్యాల ఆర్థిర ప్రయోజనాలే ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభానికి మూలకారణమని ఆయన పేర్కొన్నారు. 'ఇరాక్, సిరియా, లిబియా, ఇరాన్‌లోని చమురు బావులను అక్రమంగా దోచుకొని.. ఆ డబ్బుతో పారిస్ వంటి మీ నగరాలను మద్యం, పార్టీలతో వైభవోపేతంగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. వేలమంది నిరాశ్రయులను చేసింది. దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని ఆజంఖాన్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో చమురు సంపద కోసమే అమెరికా, రష్యాలో ప్రస్తుత సంక్షోభాన్ని మరింతగా రాజేస్తున్నాయని మండిపడ్డారు.