
అమెరికా చర్యల వల్లే ప్యారిస్ దాడులు: ఆజంఖాన్
ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల గురించి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్‌ల మీద అగ్రరాజ్యాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే ప్యారిస్‌లో దాడులు జరిగాయని, ఈ విషయాన్ని అమెరికా లాంటి దేశాలు గుర్తించాలని ఆయన అన్నారు. అయితే, ఉగ్రదాడులు జరగడం మాత్రం దురదృష్టకరమని చెప్పారు. మధ్యప్రాచ్యంలోని చమురు నిల్వలను దోచుకుని సంపాదించిన సొమ్ముతో యూరోపియన్ దేశాల్లో దీపాలు వెలిగించుకోవడం సరికాదని హితవు పలికారు.
అమెరికా, దాని మిత్ర దేశాలకు మధ్య ఆసియాలో ఉన్న ఆర్థిక ప్రయోజనాలే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణమని ఆజంఖాన్ విశ్లేషించారు. ఇరాక్, సిరియా, లిబియా, ఇరాన్ దేశాల్లోని చమురు క్షేత్రాలను అక్రమంగా ఆక్రమించుకుని సంపాదించిన సొమ్ముతో ప్యారిస్ నగరంలో జల్సాలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐఎస్ఐఎస్ అడ్డాలు అనుకున్న ప్రాంతాలపై దాడులు చేయడంతో పాటు, అమాయక ప్రజలను చంపేస్తున్నారని, వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నారని, ఇందుకు ఏం సమాధానం చెబుతారని ఆయన అన్నారు. భారతీయుల్లా కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి తప్ప.. అనైతిక మార్గాలకు పాల్పడకూదని అమెరికా, రష్యాలకు ఆయన చెప్పారు.