ఇలా జరుగుతుందని ముందే తెలుసు: ఆజంఖాన్
లక్నో: నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీలో భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ అనుంగుడు, అఖిలేష్ మంత్రివర్గంలో సీనియర్ అయిన ఆజం ఖాన్.. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తాను ముందే ఊహించానన్నారు.
ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడిన ఆజం ఖాన్.. 'కొన్ని దుష్టశక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటి పరిణామాలు తప్పవు. వాళ్లు మళ్లీ పార్టీలోకి అడుగు పెట్టినప్పుడే ఇలాంటి రోజొకటి వస్తుందని ఊహించా'అని పరోక్షంగా అమర్ సింగ్ విమర్శించారు. కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఎవర్ని తొలగించాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని, ఆమేరకు అఖిలేష్ వ్యవహరించారని ఆజం ఖాన్ అన్నారు.(సీఎం సంచలన నిర్ణయం:యూపీలో రాజకీయ కలకలం)
అమర్ సింగ్ పునరాగమనంతో సమాజ్ వాదీ పార్టీలో మొదలైన అంతర్గతపోరులో ములాయం సింగ్ యాదవ్ ప్రియ సహోదరుడు శివపాల్ యాదవ్ ఒకవైపు ఉండిపోగా, సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరోవైపునకు చేరారు. రెండు వర్గాలకు మధ్య సమన్వయం చేసేందుకు నేతాజీ ములాయం చేసిన ప్రయత్నాలన్ని బెడిసికొట్టడం చివరికి మంత్రుల ఉద్వాసనకు దారితీసింది.