రెండుకళ్ల సిద్ధాంతంతో 'సైకిల్'కి రిపేరు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చుతారంటూ చెలరేగుతున్న ఊహాగానాలకు సమాజ్ వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ సమాధానం ఇచ్చారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. ముఖ్యమంత్రిని మార్చబోమని స్పష్టం చేశారు. సీఎం అఖిలేశ్ యాదవ్, ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ లు కూడా ములాయంతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముగ్గురూ మూడు భిన్నవాదలను వినిపించారు.
తొలుత ఆవేశపూరిత ప్రసంగం చేసిన అఖిలేశ్.. 'నాన్నే నాకు గురువు, దైవం' అని, పార్టీని చీల్చాలనే ఆలోచన లేనేలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో శివపాల్, అమర్ సింగ్ ల తీరును ఆక్షేపించారు. 'కేబినెట్ కు సమాంతరంగా అమర్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారా?'అని అఖిలేశ్ ప్రశ్నించారు. పూర్తికాకముందే అఖిలేశ్ నుంచి మైక్ లాగేసుకున్న శివపాల్ యాదవ్.. తన వర్గంపై సీఎం చేస్తోన్న ఆరోపణలకు ఖండించారు.
'ముఖ్యమైన పనిమీద ఇటీవలే సీఎం చాంబర్ కు వెళ్లా. మాటల సందర్భంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సీఎం నాతో అన్నారు. ఇది నినిజం. గంగమ్మమీద ఒట్టు. అఖిలేశ్, బీజేపీ కుమ్మక్కయ్యారు'.. ఇదీ సమాజ్ వాది పార్టీ యూపీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తాజా వాదన. అన్నకొడుకు అఖిలేశ్ బీజేపీ మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని, ఎస్పీని విచ్ఛిన్నం చేసేదిశగా బీజేపీ కూడా అతనికి మద్దతు పలుకుతోందని వ్యాఖ్యానించారు.
ఇద్దరి వాదనలు విన్న తర్వాత మైక్ అందుకున్న ములాయం.. మొదట అఖిలేశ్- శివపాల్ లు ఆలింగనం చేసుకోవాలని ఆదేశించారు. ఇద్దరూ తనకు ముఖ్యులేనని అన్నారు. గతంలో చేసిన తప్పులకు అమర్ సింగ్ ను క్షమించేశానని, కష్టకాలం అతను పార్టీకి అండగా నిలిచాడని ములాయం గుర్తుచేశారు.. శివపాల్, అమర్ సింగ్ లను ఒదులుకోలేనని స్పష్టంగా చెప్పారు. అదేసమయంలో అఖిలేశ్ ను సీఎం పదవినుంచి తొలిగించబోనని తేల్చిచెప్పారు. తద్వారా రెండు కళ్ల సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని సైకిల్ పార్టీ చీఫ్ చెప్పకనే చెప్పారు. నవంబర్ 5న నిర్వహించనున్న సమాజ్ వాది పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపైనా ఈ సమావేశంలో చర్చించారు.