అఖిలేశ్కు బీజేపీ మద్దతు..?
న్యూఢిల్లీ: అంతర్గతమే అయినా.. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో రాజకీయ ఆధిపత్యపోరాటానికి వేదికైన సమాజ్ వాది పార్టీ చీలిపోతే లాభపడేది ఎవరు? 'నాన్నే నా గురువూ దైవం..'అని పైకి చెబుతున్నా ఆ నాన్నకు అత్యంత ఆప్తులను కేబినెట్ నుంచి తొలిగించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆ పని ఎందుకు చేశారు? 'ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ములాయం కుటుంబం రాజకీయ డ్రామాలాడుతోంది'అని బీఎస్పీ, కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ విమర్శిస్తున్నా.. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? 2017లో సొంతగా అధికారంలోకి రాలేకుంటే 'అఖిలేశ్- బీజేపీ' ప్రభుత్వ ఏర్పాటే ఎజెండాగా సీఎంకు కమలదళం అండగా నిలుస్తోందా? అనే ప్రశ్నలకు విశ్లేషకులు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు. ఈలోపే బీజేపీ సీనియర్ ఎంపీ శతృఘ్న సిన్హా బాహాటంగా అఖిలేశ్ యాదవ్ కు మద్దతు ప్రకటించడం తీవ్రచర్చనీయాంశమైంది.
'సొంతవాళ్లే అఖిలేశ్ ను ప్రమాదకరమైన రాజకీయ రొంపిలోకి లాగారు. అతణ్ని చూస్తే నా హృదయం ద్రవించిపోతోంది. ఆ ఊబిలో నుంచి అఖిలేశ్ విజయవంతంగా బయటపడాలని ప్రార్థిస్తున్నా' అంటూ శతృఘ్న సిన్హా.. యూపీ సీఎంకు బాసలగా నిలిచారు. అంతేకాదు యువనాయుడైన అఖిలేశ్ పాలనలో దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ది చెందుతుందని నమ్ముతున్నట్లు సిన్హా పేర్కొన్నారు. గతంలో(2012లో)నూ ఈ బీజేపీ నేత అఖిలేశ్ ను పొగిడిన సందర్భాలున్నా.. ప్రస్తుత తరుణంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
నవంబర్ 5న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవాన్ని జరుపుకోనుండగా వేడుకల నిర్వహణపై పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ సోమవారం లక్నోలో కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. సీఎం అఖిలేశ్ తోపాటు బహిష్కృత మంత్రి శివపాల్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఎస్పీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాబాయి- అబ్బాయి వర్గీలు మధ్య తోపులాట చోటుచేసుకుంది.