మా కుటుంబం విచ్ఛిన్నానికి అమర్ సింగ్ కుట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదురుతోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఎస్పీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో కలహాలకు అమర్ సింగే కారణమని ఆరోపించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన కుట్రపన్నారని అఖిలేష్ అన్నారు.
ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విబేధాలు ఆదివారం తారస్థాయికి చేరుకున్నాయి. బాబాయ్ శివపాల్ సహా నలుగురు మంత్రులపై ఈ రోజు అఖిలేష్ వేటు వేశారు. అమర్ సింగ్కు సన్నిహితురాలైన సినీ నటి జయప్రదను ఎఫ్డీసీ పదవి నుంచి తొలగించారు. అనంతరం అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం ఆవేశంగా మాట్లాడిన అఖిలేష్.. అమర్ సింగ్ మద్దతుదారులు తమ మద్దతు దారులు కారని అన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో శివపాల్ తన సోదరుడు ములాయం ఇంటికి వెళ్లారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు ములాయం అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.