ఆయన గుండెల్లో నేను లేని క్షణాన..
న్యూఢిల్లీ: 'అంతా నేనే చేశానని నిందిస్తున్నారు. సరే, ఎంత తిట్టినా నేను భరిస్తా. కానీ నేతాజీ తన హృదయంలో నుంచి నన్ను తీసివేస్తే.. ఆ క్షణాన్ని మాత్రం నేను భరించలేను. బహుశా జీవితంలో నేను అత్యంత దుఃఖపడే సందర్భం అదే కావచ్చు' అని జిగిరీ దోస్త్ ములాయం సింగ్‌ను ఉద్దేశించి అమర్ సింగ్ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ములాయం-అమర్‌సింగ్ విషయంలో తప్పే అవుతుంది. కొడుకు అఖిలేశ్, తమ్ముళ్లు శివపాల్, రాంగోపాల్, నమ్మకస్తుడు ఆజంఖాన్.. ఇలా ఎంతోమంది మొత్తుకుని మొరాయించినా ములాయం.. అమర్ సింగ్‌ను వెంటే ఉంచుకున్నారు. ములాయం ఇంట్లో చెలరేగిన వివాదానికి అసలు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్.. ఇక్కడ ఉండలేక లండన్ వెళ్లిపోయారు. అయితే అఖిలేశ్ వర్గం ఏకంగా పార్టీనే హైజాక్ చేయడం, ములాయం హైబీపీకి గురై అస్వస్థతకు లోనుకావడంతో అమర్ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన మీడియాతో రెండు ముక్కలు మాట్లాడారు. (సమాజ్‌వాదీ పార్టీ హైజాక్: అధినేతగా అఖిలేశ్)
'పార్టీలో చెలరేగుతోన్న విపత్కరాలన్నింటికీ నేనే కారణం అని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో నిజం ఉందని నమ్మితే నిరభ్యంతరంగా నన్ను బహిష్కరించండని ములాయంకు ఎప్పుడో చెప్పా. పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడానికి నేనేమీ బాధపడను. కానీ ములాయం గుండెల్లో నుంచి తీసేస్తే మాత్రం భరించలేను' అని అమర్ సింగ్ భావోద్వేగంతో చెప్పారు. ములాయం, శివపాల్ యాదవ్‌లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో అమర్ సింగ్ కూడా వారితో కలుస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్షన్ కమిషన్‌ను కలిసి, హైజాక్‌కు గురైన పార్టీ గుర్తు 'సైకిల్'ను తమకే ఇప్పించాలని కోరతారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని ములాయం ప్రకటించారు. (ఆత్మరక్షణలో ములాయం.. 'సైకిల్' కోసం పోరాటం)
(చదవండి: ములాయం 'అమర్' ప్రేమ రహస్యం)