ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం పర్యవసానంగా ఏర్పడ్డ భీతావహ స్థితినుంచి పారిస్ వాసులు ఇంకా కోలుకోలేదు. నాలుగు రోజులుగా ఫ్రాన్స్ భద్రతా బలగాలు అనుమానిత ప్రాంతాల్లో సాగిస్తున్న గాలింపువల్లా.... అనుమానితుల్ని, వారి సన్నిహితులనూ ప్రశ్నించడంవల్లా సత్ఫలితాలొస్తున్నాయి. మారణహోమం సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి, అతనితో ఉన్న మరో మహిళ బుధవారం భద్రతా బలగాల దాడిలో మరణించగా మరికొందరు అరెస్టయ్యారు. ఇంకొక ఉగ్రవాది జాడ తెలియవలసి ఉన్నదని చెబుతున్నారు. దాడులను ముందే పసిగట్టి నివారించడంలోనూ, దాడులు జరిగిన వెంటనే సాగించిన తనిఖీల్లోనూ వైఫల్యాలను మూటగట్టుకున్న భద్రతా బలగాలకు ఇది ఊరటనిచ్చే విషయం. 'మనం ఉగ్రవాదంపై యుద్ధం సాగిస్తున్నాం...భీతావహులు కావొద్దు...అతిగా ప్రతిస్పందించి యూదులపైనో, ముస్లింలపైనో దాడులకు దిగొద్దు' అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ దేశ ప్రజలను కోరుతున్నారు.
ఆయన సరిగానే చెప్పారు. ఇలాంటపుడు ఎవరూ సహనం కోల్పోకూడదు. ప్రతివారినీ అనుమానించి, ద్వేషించేచోట ప్రేమాభిమానాలు అడుగంటుతాయి. కలహాలు ముదురుతాయి. ఉగ్రవాదులకు కావలసింది సరిగ్గా ఇదే. కాలుష్యాన్ని, మురికిని ఆశ్రయించుకుని ప్రమాదకర బ్యాక్టీరియాలు, వైరస్‌లు పెరిగినట్టుగానే కలహించుకునే సమాజాల్లో ఉగ్రవాదం పుట్టి విస్తరిస్తుంది. ఉగ్రవాద భూతంపై అందరూ సమష్టిగా పోరాడవలసిన అవసరాన్ని గుర్తించకపోతే అంతిమంగా ఆ భూతానిదే పైచేయి అవుతుంది. అయితే దేశ పౌరులకు ఇంతగా చెప్పిన హొలాండ్ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని సరిగా గుర్తించిందా? పారిస్ దాడుల వెనువెంటనే ఫ్రాన్స్ యుద్ధ విమానాలు సిరియాలో ఉగ్రవాద స్థావరాలుగా గుర్తించిన ప్రాంతాలపై బాంబుల వర్షం ప్రారంభించాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ అమెరికా మిత్రపక్షంగా ఉన్న ఫ్రాన్స్ ఇందుకోసమని దాని ప్రత్యర్థిగా ఉన్న రష్యాతో కూడా చేతులు కలిపింది. దాడులు మరికొన్ని వారాలు కొనసాగుతాయని ప్రకటించింది.
ఉగ్రవాదుల దుశ్చర్యలను ఎవరూ సమర్థించరు. వారిపై కఠినంగా చర్యలు తీసు కోవద్దని ఎవరూ అనరు. అయితే, ఆ చర్యల పరమార్ధం ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేసేదిగా ఉండాలి తప్ప దాన్ని మరింత పెంచి పోషించేదిగా మారకూడదు. అమాయకులెవరూ ప్రాణాలు కోల్పోకూడదు. సంబంధంలేనివారు నిష్కారణంగా బలైపోకూడదు. అలాంటి ఉదంతాలవల్ల సామాన్య ప్రజల్లో ప్రభుత్వాలపై ద్వేషం ఏర్పడుతుంది. ఎలాంటి బాధ్యతా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించే తీరువల్ల ఉగ్రవాదులు చేస్తున్న వాదనలకు బలం చేకూరుతుంది. 2001లో ఉగ్రవాదులు తమ దేశంపై దాడులు జరిపి 3,000మందిని పొట్టనబెట్టుకున్నాక అమెరికా తీసుకున్న చర్యలన్నీ అటువంటివే.
సంకీర్ణ బలగాలను రూపొందించి ఇరాక్‌పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని వల్లకాడు చేసిన తీరు మానవేతిహాసంలోనే అత్యంత దారుణం. లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయి, మరిన్ని లక్షలమంది క్షతగాత్రులై జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న తీరు చూస్తే ఎలాంటివారికైనా దుఃఖం కలుగుతుంది. అమెరికా దాడులవల్ల బిన్ లాడెన్ వంటి అనేకమంది కీలకమైన ఉగ్ర నేతలు హతమయ్యారు. కానీ పద్నాలుగేళ్లుగా అఫ్ఘానిస్థాన్, లిబియా, సోమాలియా, సిరియా...ఇలా అనేక దేశాల్లో ఈ దాడుల పేరిట బలైన అమాయకులు అసంఖ్యాకంగా ఉన్నారు. కొంపా గోడూ కోల్పోయి బతకడం కోసం చావుకు తెగించి సముద్రాల్లో చిన్న చిన్న పడవలపై యూరప్ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. ఆ క్రమంలో వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
తాము చేస్తున్న వైమానిక దాడులకు, ఉగ్రవాదం పెరగడానికీ సంబంధం ఉన్నదంటే మొన్నటివరకూ అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలు అంగీకరించేవి కాదు. కానీ ఈమధ్యే సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా ప్రారంభించిన బాంబు దాడుల గురించి అమెరికా, మిత్ర దేశాల స్పందన చూస్తే ఈ విషయంలో అవి పునరాలోచనలో పడ్డాయేమోననిపిస్తుంది. సిరియాలో జోక్యం చేసుకోవాలని పుతిన్ తీసుకున్న నిర్ణయంవల్ల ఉగ్రవాదం మరింత బలపడుతుందని, వారిపట్ల ఆకర్షితులయ్యేవారు పెరుగుతారని ఆ ప్రకటన ఆందోళన వ్యక్తంచేసింది. గత నెల 4న స్వయంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్...మరో నాలుగు రోజులకు అమెరికా రక్షణ మంత్రి ఆష్‌టన్ కార్టర్ ఇదే అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. 'ఇలాంటి బాంబు దాడులు ఉగ్రవాదాన్ని పెంచడమే కాదు...దాని పర్యవసానాలు నేరుగా రష్యాయే చవిచూడాల్సి వస్తుందని' వారిద్దరూ హెచ్చరించారు.
వారన్నది నిజం కూడా అయింది. గత నెలాఖరున 224మంది ప్రయాణికుల దుర్మరణానికి కారణమైన రష్యా విమాన ప్రమాదంలో ఉగ్రవాదుల హస్తమున్నదని తాజాగా రుజువైంది. సిరియా అగ్నిగుండానికి దూరంగా ఉండమని రష్యాకు సలహాలిచ్చిన వారు తాము ఇన్నేళ్లుగా సాగించిందంతా ఘోర తప్పిదమని ఎందుకనో ఇంతవరకూ బహిరంగంగా ప్రకటించలేదు. కనీసం ఫ్రాన్స్‌నైనా ఆ మేరకు హెచ్చరించినట్టు లేదు.
ఉగ్రవాదులపై సాగించదల్చుకున్న ఎలాంటి యుద్ధమైనా ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ వేదికల ఆమోదంతో సాగాలి. వాటి పర్యవేక్షణ ఉండాలి. అమాయకులు ప్రాణాలు కోల్పోతే అందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుండాలి. యుద్ధ నేరాలకు కఠిన శిక్షలుండాలి. అలాంటి పోరు స్థానిక ప్రభుత్వాలనూ, పౌరులనూ కలుపుకొని పోయేలా ఉండాలి. ఎవరి ఆమోదమూ లేకుండా, ఏకపక్షంగా...కేవలం అగ్రరాజ్యాలమన్న ఏకైక కారణంతో 'ప్రపంచ పోలీస్'లా వ్యవహరిస్తామంటే, తాము ఎవరికీ జవాబుదారీ కాదంటే నాగరిక సమాజాలు మెచ్చవు.
సిరియాలోనో, మరొకచోటనో ఉగ్రవాద స్థావర ప్రాంతాలంటూ ఎంచుకుని వైమానిక దాడులకు దిగితే, ఆ ఉగ్రవాదుల చెరలో మగ్గిపోతున్న సాధారణ ప్రజానీకం ప్రాణాలకు ముప్పు కలిగించినట్టవుతుంది. మరోరకంగా చెప్పాలంటే సిరియాలోని తమ స్థావరాలపై జరుగుతున్న దాడులకు నిరసనంటూ పలు దేశాల్లో ఉగ్రవాదులు సాగిస్తున్న మారణకాండకూ... ఈ వైమానిక దాడులకూ తేడా ఉండదు. విచక్షణారహితంగా ఎవరూ వ్యవహరించినా ఫలితాలు ఒకలాగే వస్తాయి. బహుళ సంస్కృతులకు నిలయంగా ఉంటున్న ఫ్రాన్స్ ఈ సంగతిని గుర్తెరగాలి.