నా భార్యను చంపారు..ఐనా మీపై ద్వేషం లేదు! | 'You Won't Have My Hate': Paris Terror Victim's Husband Tells ISIS | Sakshi
Sakshi News home page

నా భార్యను చంపారు..ఐనా మీపై ద్వేషం లేదు!

Published Tue, Nov 17 2015 4:30 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

నా భార్యను చంపారు..ఐనా మీపై ద్వేషం లేదు! - Sakshi

నా భార్యను చంపారు..ఐనా మీపై ద్వేషం లేదు!

పారిస్: 'శుక్రవారం రాత్రి మీరు ఓ విశేషమైన వ్యక్తి విలువైన ప్రాణాలను బలిగొన్నారు. నా జీవిత సర్వస్వాన్ని దూరం చేశారు. ఓ కొడుకుకు తల్లిని దూరం చేశారు. అయినా మీమీద నాకు ద్వేషం కలుగడం లేదు. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు చనిపోయిన ఆత్మలన్న విషయాన్ని నేను తెలుసుకోవాలనుకోవడం లేదు'.. ఇది ఆంటోనీ లీరిస్ ఆవేదన. పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఆయన భార్య ప్రాణాలు కోల్పోయింది. అయినా 129 మందిని పొట్టనబెట్టుకున్న ఈ నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై తనకు ద్వేషం కలుగడం లేదని ఆయన పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నది.

'మీకు ద్వేషం అనే బహుమతిని నేను ఇవ్వబోను. మీ పట్ల ద్వేషం వ్యక్తమవుతుండొచ్చు. కానీ ద్వేషం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అజ్హానమే. ఆ అజ్ఞానమే మిమ్మల్ని ఇలా తయారుచేసింది. నన్ను భయపెట్టాలని నువ్వు చూశావు. సాటి నా దేశవాసులను అనుమానంతో నేను చూసేలా చూడాలనుకున్నావు. భద్రత కోసం నా స్వాతంత్ర్యాన్ని పణంగా పెట్టాలని భావించావు. కానీ నువ్వు ఓడిపోయావు. మేము ఇంకా దృఢంగానే ఉన్నాం' అని ఆయన ఈ ఫేస్‌బుక్‌ పోస్టులో ఉగ్రవాదులను ఉద్దేశించి పేర్కొన్నారు.

శుక్రవారం పారిస్‌లోని బాటాక్లాన్ థియేటర్‌, జాతీయ క్రీడా మైదానం వద్ద ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ మారణహోమంలో బాటాక్లాన్ థియేటర్‌ వద్ద చనిపోయిన 86 మందిలో లీరిస్ భార్య కూడా ఉన్నారు. విగతజీవిగా పడి ఉన్న ఆమెను చూసి.. తాను ఎంతగా ఛిన్నాభిన్నమయ్యాడో ఆయన వివరించాడు.

' ఆమెను నేను ఈ రోజు ఉదయం చూశాను. కొన్ని రాత్రులు, పగళ్ల ఎడతెగని ఎదురుచూపుల అనంతరం ఆఖరికీ చూశాను. తను శుక్రవారం ఇంటినుంచి వెళ్లేటప్పుడు ఎంత అందంగా ఉందో.. అలాగే ఉంది. 12 ఏళ్ల కింద ఆమెతో ప్రేమలో పడి తొలిసారి చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. నిజమే ఆమెను చూసి నేను బాధతో కుప్పకులాను. ఓ చిన్న విజయాన్ని మీకు అందించాను. కానీ అది ఎంతోకాలం నిలువబోదు. ప్రతిరోజు ఆమె మాతోనే ఉంటుంది. స్వేచ్ఛయుత ఆత్మలతో ఒకరోజు స్వర్గంలో మేము కలుసుకుంటాం. కానీ అలాంటి స్వర్గం మీకెన్నడు సాధ్యపడబోదు' అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని సైన్యాలన్నింటికన్నా బలంగా తాను, తన కొడుకు జీవితంలో ముందుకు సాగుతామని, 17 నెలల తన కొడుకును నిద్రనుంచి లేపి.. జాగృత పరిచి, స్వేచ్ఛయుత, ఆనందదాయక జీవితం గడిపేలా తీర్చిదిద్దుతామని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement