మా తల్వార్లకు వారే లక్ష్యం!!
బీరట్, లెబానాన్: పారిస్‌లో 130 మందిని పొట్టనబెట్టుకున్న నరమేధానికి పాల్పడిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు వీరేనంటూ ఐఎస్ఐఎస్ గ్రూపు ఓ వీడియో విడుదల చేసింది. నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు, ఇద్దరు ఇరాకీలు పారిస్ దాడిలో పాల్గొన్నారని తమ వెబ్‌సైట్లలో పోస్టుచేసిన ఈ వీడియోలో పేర్కొంది. 'వాళ్లు ఎక్కడ కనిపిస్తే.. అక్కడ చంపండి' పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటనే తమ తదుపరి లక్ష్యమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.
2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ ఫైటర్లపై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలన్నింటికీ ఈ సందేశం వర్తిస్తుందని ఫ్రెంచ్, అరబ్ భాషలో ఉగ్రవాదులు ఈ వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియోలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఫొటోను చూపించి.. దానితోపాటు 'అవిశ్వాసులతో జతకలిసే ప్రతి ఒక్కరూ మ తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే' అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నారు. పారిస్ దాడితో ఫ్రాన్స్‌ను గడగడలాడించిన తొమ్మిది మంది ఉగ్రవాదులు 'సింహాల్లాంటి' వారని ఈ వీడియోలో పేర్కొన్నారు. పారిస్ దాడికి ముందు ఈ ఉగ్రవాదులు తమకు చిక్కిన నిస్సహాయుల్ని తలనరికి చంపుతున్న దృశ్యాలను ఇందులో చూపించారు. ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన 'అల్ హయత్' ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో పారిస్ దాడి ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా చూపించారు.