'మా దేశంపై యుద్దానికి దిగారు'
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడులను యుద్దానికి తెగబడ్డ చర్యలుగా పరిగణిస్తున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. ఉగ్రవాదుల చర్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. పారిస్ నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఐఎస్ఎస్ జరిపిన దాడులను స్వేచ్ఛాయుత దేశమైన ఫ్రాన్స్ పై ఉగ్రవాదులు చేసిన యుద్ద చర్యలుగా ఆయన అభిప్రాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలో మిత్రపక్షంగా ఉంటూ సిరియా, ఇరాక్ దేశాల్లో చొరబడ్డ ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై వాయు బలగాల ద్వారా దాడులు జరుపుతోంది. ఈ నెల చివర్లో ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో ఉగ్రదాడులపై హై అలర్ట్ ప్రకటించనున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. 2004లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో 191 మందిని బలిగొన్న ఘటన తర్వాత యూరప్లో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటన ఇది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్ల ఘటనలో సుమారు 120 మంది మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే.