
నాడు ముంబై....నేడు పారిస్
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శనివారం హైఅలర్ట్ ప్రకటించారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శనివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్ల ఘటనలో సుమారు 120 మంది మృత్యువాతపడ్డారు. అయితే, ఈ ఉగ్రదాడి 2008లో ముంబైలో జరిగిన విషాద ఘటనతో పోలిఉండటంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్రలోని ముంబై సహా పలు నగరాలలో జనసంచారం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్, తదితర ప్రాంతాల్లో అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబై 26/11 ఘటనకు తాజాగా జరిగిన పారిస్ ఉగ్రదాడులకు చాలా మేరకు పోలికలున్నాయని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆయా హోటల్స్, మాల్స్, మార్కెట్ల యజమానులు ప్రశ్నించాలని అధికారులు వారికి సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. పర్యాటకులు, విదేశీ సందర్శకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు నేర విభాగ జాయింట్ కమిషనర్ అటుల్చంద్ర కులకర్ణి వివరించారు. 2008 ముంబై కాల్పుల విషాద ఘటనకు ఇది కాపీ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి పారిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు, పేలుళ్లు సంభవించిన విషయం విదితమే.