
‘అప్పుడు పోలీసులు నన్ను గుర్తుపట్టలేదు!’
బ్రసెల్స్: పారిస్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్‌హమీద్ అబౌద్ ఫ్రాన్స్‌కు పొరుగునే ఉన్న బెల్జియం దేశ నివాసి. మొరాకో సంతతికి చెందిన అతడి స్వ స్థలం బ్రసెల్స్ నగరం. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. స్కూల్‌లో సహ విద్యార్థులను వేధించేవాడు. గత రెండేళ్లుగా యూరప్‌లో ఐసిస్ ఉగ్రవాద కుట్రలు, ఉగ్రవాద సంస్థలోకి రిక్రూట్‌మెంట్లు వంటి కార్యకలాపాల్లో అతడి ప్రమేయం ఉంది.
గతంలో ఈయూ చెక్‌పోస్ట్ వద్ద ఒక పోలీసు అధికారి తనను ఆపి, తన ఫొటోతో సరిపోల్చి చూసికూడా గుర్తుపట్టకుండా వదిలేశాడంటూ అరెస్ట్ నుంచి తాను ఎలా తప్పించుకన్నాడో.. అతడు ఐసిస్ మేగజీన్ దబీక్‌లో గర్వంగా చెప్పాడు. అలాగే ఈ ఏడాది మొదట్లో బెల్జియం భద్రతాదళాలపై దాడికి ప్రణాళిక రచిస్తున్న సమయంలో ఆ విషయం బయటపడటంతో పోలీసులు దాడి చేశారని.. ఆ దాడిలో తన సహచరులు ఇద్దరు చనిపోయినా తాను తప్పించుకుని, ఈయూ నుంచి ఎలా బయటపడ్డాననేదీ వివరించాడు. బెల్జియంలో పోలీసుల దాడి అనంతరం అతడు సిరియా వెళ్లాడు. ఇటీవల సిరియా లోని ఐసిస్ స్థావరం నుంచి పశ్చిమ దేశాలకు హెచ్చరికలు కూడా చేశాడు.
అక్కడ ఉగ్రవాదులు తలలు నరికిన కొందరి మృతదేహాలను కట్టిన జీపును అబౌద్ నవ్వుతూ నడుపుతున్న ఐసిస్ వీడియో గత ఏడాది మొదట్లోనే భద్రతా దళాలకు అందింది. అప్పటికే అతడి గురించి వారికి పూర్తిగా తెలుసు. సిరియాలోని ఉగ్రవాద సంస్థలో జిహాదీలను చేర్పిస్తున్నాడన్న అభియోగంపై.. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బ్రసెల్స్ కోర్టు అతడి పరోక్షంలో తీర్పు చెప్పింది. ఐసిస్ విదేశీ కార్యకలాపాల విభాగంలో అబౌద్ కీలకమైన వ్యక్తి అని.. అతడి కదలికలను అమెరికా నిఘా సంస్థలు కొన్ని నెలలుగా గమనిస్తున్నాయని యూఎస్ నిఘా అధికారి ఒకరు తెలిపారు.