
'వాడు లొంగిపోతాడేమో.. తెలీదు'
బ్రస్సెల్స్: పారిస్ ఉగ్రదాడులతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఉగ్రఘటనకు పాల్పడ్డట్లు భావిస్తున్న ఇద్దరు అనుమానితుల సోదరుడు మహమ్మద్ అబ్దేస్లామ్ పేర్కొన్నాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగిన దాడిలో తాను పాలు పంచుకోలేదన్నాడు. పారిస్ పోలీసుల కస్టడీ నుంచి బయటకొచ్చిన అనంతరం అతడు ఈ వివరాలను మీడియాకు వెల్లడించాడు. అయితే, సామాన్యులపై కాల్పులు, ఆత్మాహుతి దాడికి పాల్పడి అబ్దెస్లామ్ బ్రదర్స్‌లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు పరారీలో ఉన్న విషయం విదితమే.
అతడి ఓ సోదరుడు ఇబ్రహీమ్ ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. మరో సోదరుడు సలాహ్పై అంతర్జాతీయంగా అరెస్ట్ వారెంట్ ఉంది. పారిస్ ఉగ్రదాడి సమయంలో ఎక్కడున్నావని మహమ్మద్‌ను మీడియా ప్రశ్నించగా.. తన వ్యాపార భాగస్వామితో ఉన్నట్లు తెలిపాడు. టెలిఫోన్ రికార్డులు కూడా ఇందుకు సాక్ష్యంగా తమ వద్ద ఉన్నాయన్నాడు. 'మాది స్వేచ్ఛాయుత కుటుంబం. చట్టాలు, కోర్టులు వంటి విషయాలలో మాకెప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. పారిస్ ఘటనతో అసలు ఏం జరిగిందో అర్థంకాక మా తల్లిదండ్రులు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు' అని చెప్పాడు.
సోదరుడు, అంతర్జాతీయ ఉగ్రవాది సలాహ్ విషయంపై ప్రశ్నించగా, అతడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదని, లొంగిపోయే సాహసం చేస్తాడా లేదా అన్న విషయం కూడా చెప్పలేమని మహమ్మద్ అబ్దేస్లామ్ పేర్కొన్నాడు. తాము ప్రస్తుతం బాధితులు, వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని, అందరిలాగే ఈ ఘటనపై తామూ చలించిపోయామన్నాడు. తన సోదరులు ఈ దాడికి పాల్పడ్డట్లు క్షణం కూడా భావించడం లేదని అబ్దేస్లామ్ వివరించాడు. గత శుక్రవారం పారిస్లో జరిగిన ఉగ్రదాడుల్లో 129 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.