'అయినా.. నన్ను భయపెట్టలేకపోయారు'
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగిన ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. పారిస్ ఉగ్రదాడుల్లో భార్యను కోల్పోయిన ఓ బాధితుడు ఆంటోనీ లీరిస్. ఈ ఘటనను జీర్ణించుకోలేని ఆ వ్యక్తి 'మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్లు చచ్చిన శవాలు' అని పేర్కొంటూ చేసిన ఫేస్బుక్ పోస్ట్ అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.
తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని చంపేశారని, నా జీవితాన్ని నాకు దూరం చేశారని పేర్కొన్నాడు. ఇన్నీ చేసినా మీరు నన్ను భయపెట్టలేక పోయారు. 'నా స్వేచ్ఛకు భంగం కలిగించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నేటి ఉదయం కూడా నేను ఆమెను చూశాను.12 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాను. బాటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో 89 మందికి పైగా చనిపోయారు. కానీ, ఇది ఉగ్రవాదుల స్వల్ప విజయం' అని భార్య మృతదేహాన్ని చూస్తూ ఈ విషయాలను పోస్ట్ ద్వారా వివరించాడు.
'నేను, నా బాబు(17 నెలలు) ప్రపంచంలోని అన్ని ఆర్మీల కంటే ధృడంగా ఉన్నాం. మీ గురించి ఆలోచిస్తూ టైం వృథా చేసుకోను. నా బాబును సంతోషంగా, దైర్యంగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తుంటాను. మీరు నా నుంచి అసహ్యాన్ని కూడా పొందలేరు' అంటూ ఉద్వేగభరితంగా తన మనసులోని బాధను ఆంటోనీ లీరిస్ బయటపెట్టాడు.