బెర్లిన్: ఖరీదైన తన స్పోర్ట్స్ కారును గాడిద పాడు చేసిందంటూ కారు యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనపై జర్మన్‌లోని గిఎస్సెన్ రాష్ట్ర కోర్టులో కేసు దాఖలయింది. ఖరీదైన మెక్‌లారెన్ స్పోర్ట్స్ కారును పార్కు చేసి ఉంచగా ఓ గాడిద దాని వెనుక భాగాన్ని కొరకడంతో రంగు పోవటంతో పాటు సొట్టలు పడిందని కారు ఓనర్ ఫిర్యాదు చేశాడు. ఇందుకు గాను సదరు గాడిద యజమాని 5,876 అమెరికా డాలర్లు పరిహారంగా చెల్లించాలని పిటిషన్ వేశాడు.
అయితే, గాడిద యజమాని మాత్రం ఇందుకు నిరాకరించాడు. అంత ఖరీదైన కారును అక్కడే ఎందుకు ఉంచాల్సి వచ్చిదంటూ అడ్డం తిరిగాడు. మరింత సురక్షితమైన ప్రాంతంలో పార్కు చేసుకోవాలని సూచించాడు. ఆ స్పోర్ట్స్ కారు ఆరంజ్ రంగులో ఉండటంతో క్యారెట్‌గా భావించి గాడిద కొరికి ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి.