మోడల్‌గా వందేళ్ల భామ్మ
లండన్: అంగంగాలను ప్రదర్శించే అందమైన భామల ఫొటోలను కవర్ పేజీలుగా ప్రచురించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న బ్రిటన్ ఫ్యాషన్ పత్రిక ‘వోగ్’ మొట్టమొదటి సారిగా ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఫ్యాషన్ బైబిల్‌గా ప్రసిద్ధి చెందిన వోగ్ మేగజైన్ వందేళ్ల వార్శికోత్సవాన్ని పురస్కరించుకొని కవర్ పేజీ వందేళ్ల బామ్మ బో గిల్‌బర్ట్ ఫొటోను ఫ్యాషన్ దుస్తుల్లో ప్రచురించింది.
వందేళ్ల మేగజైన్‌కు సందర్భోచితంగా ఉంటుందనే ఉద్దేశమే కాకుండా ఫ్యాషన్‌కు వయస్సుతో నిమిత్తం లేదనే విషయాన్ని నిరూపించడం కోసం కూడా ఈసారి వందేళ్ల భామ్మను మోడల్‌గా ఎంపిక చేసుకున్నామని మేగజైన్ ప్రచురణకర్తలు తెలియజేశారు. హైహీల్స్, మేకప్ లేకుండా ఎన్నడూ ఇంటి గడపదాటని బర్మింగమ్‌కు చెందిన గిల్‌బర్ట్ నల్లటి దుస్తులపై తెల్లటి ప్యాంటు, పైన గులాబీ రంగు కోటు, మెడలో లాన్‌విన్ నెక్లెస్, కళ్లకు వాలెంటినో గ్లాసెస్ ధరించి టీవీగా దిగిన ఫొటోను మేగజైన్ కవర్ పేజీగా వేశారు. ఎన్నో మేగజైన్లకు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఫిల్ పాయింటర్ గిల్‌బర్ట్ మోడలింగ్ ఫొటోలను తీశారు.
వందేళ్ల భామ్మ ఫొటోను ప్రచురించిన జూన్ సంచిక ‘వోగ్’ వచ్చేవారం మార్కెట్లోకి వస్తోంది. తనకు చిన్నప్పటి నుంచి నచ్చిన దుస్తులను ధరించడమే తనకు ఇష్టమని, డీసెంట్‌గా కనిపించే దుస్తులనే ఎప్పుడూ ధరిస్తానని చెప్పారు. యాభై ఏళ్లప్పుడు ఓ మహిళ ప్యాంట్ ధరించడం చూసి తనకు ముచ్చటేసిందని, అప్పటి నుంచి ప్యాంట్లు ధరించడం కూడా తనకు ఇష్టమేనని భామ్మ గిల్‌బర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అలనాటి హాలివుడ్ తార ఆడ్రీ హెప్‌బర్న్ తన ఫ్యాషన్ ఐకానిక్ అని, ఆమె ఎప్పుడు కూడా యువకులను ఆకర్షించడం కోసం దుస్తులు వేసుకోలేదని, అలాగే తాను కూడా ఎన్నడూ యువకులను ఆకర్షించడం కోసం దుస్తులను ధరించలేదని తెలిపారు. ఈ వయస్సులో ఓ మోడల్‌గా ఫొటోలకు ఫోజులివ్వడం నిజంగా తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని గిల్‌బర్ట్ అన్నారు.