ఆంటిగ్వా/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంటిగ్వా ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది. న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోతే భారత్‌కు పంపిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే చెప్పారు. చోక్సీ బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టాక కరేబియన్ దీవులకు పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. పీఎన్‌బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ గత ఏడాది జనవరిలో పరారయ్యాడు.
అంతకు ముందే 2017 నవంబర్‌లో సిటిజెన్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ (సీఐపీ) కింద ఆంటిగ్వా, బార్బడా జంట దీవుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు. కాగా, లక్ష అమెరికా డాలర్లను ఇన్‌వెస్ట్ చేసి ఆంటిగ్వా, బార్బడా పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మరోవైపు చోక్సీ తానేమీ పారిపోలేదని, వైద్య చికిత్స కోసం ఆంటిగ్వాకు వచ్చానని ట్రీట్‌మెంట్ అయిపోగానే భారత్‌కు వస్తానని అతని కేసు విచారిస్తున్న బాంబే హైకోర్టుకు వెల్లడించాడు. గీతాంజలి జెమ్స్ కంపెనీకి చెందిన వజ్రాల వ్యాపారులైన చోక్సీ, నీరవ్ మోదీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్నాడు. వారిద్దరినీ తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ఈడీ, సీబీఐ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment