
రైలు పట్టాలపైనా నడిచే 'యునిమోగ్'
ప్రపంచవ్యాప్తంగా లగ్జరీకార్ల తయారీ సంస్థ మెర్జిడెస్ బెంజ్.. ఇప్పుడు కొత్త డిజైన్ వాహనాన్ని రూపొందించింది. యునిమోగ్ పేరిట మల్టీ పర్పస్ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అనేక అవసరాలకు ఈ వాహనాలను వినియోగించుకోవచ్చని సంస్థ చెప్తోంది. ఇంతకు ముందు తయారైన ఎన్నో వాహనాలకు భిన్నంగా ఇప్పుడు రోడ్లపైనే కాక... రైలు పట్టాలపైనా నడిచే సరికొత్త యునిమోగ్ ను మెర్సిడెస్ ఆవిష్కరించింది.
మెర్జిడెస్ ఇప్పటికే రోడ్లతోపాటు రైలు పట్టాలపై నడిచే ఎన్నో యునిమోగ్ వాహనాలను తయారు చేసింది. అయితే ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సరికొత్త యునిమోగ్ మాత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉంది. ఈ కొత్త మోడల్ 423 ని మరిన్ని అప్ డేట్స్ తో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదాలను సైతం గుర్తించి, నిర్మూలించే ప్రత్యేక భద్రతా లక్షణాలను కలిగిన ఈ వాహనాన్ని సురక్షితంగా రైలు పట్టాలుమీద కూడా నడిపే అవకాశం ఉంది. రైలు ఇంజన్ లాగా కూడా పనిచేసే ఈ వాహనం పట్టాలమీద ఉన్న బోగీలను ఒకచోటునుంచీ మరోచోటుకు చేర్చగలిగే విధంగా మెర్సిడెస్ కంపెనీ ఈ యునిమోగ్ వాహనాన్ని రూపొందించింది.
సాధారణ రహదారుల్లోనే కాక ప్రతికూల మార్గాల్లోనూ నడిపేట్లుగా యునిమోగ్ ను మెర్సిడెస్ తయారు చేసింది. 5.1 లీటర్ సామర్థ్యం కలిగిన నాలుగు సిలిండర్లతో కూడిన టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్... సుమారు 231 బిహెచ్ పి పవర్ తోపాటు, 664 పౌండ్ ఫీట్ టార్క్ ను ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే యునిమోగ్.. 1000 టన్నుల బరువైన రైలు బోగీలను కూడా సులభంగా లాగ గల్గుతుంది. వాహనానికి ఉన్న మెటల్ చక్రాలు పట్టాలు మీద.. రబ్బరు చక్రాలు నేల మీద.. నడించేందుకు సహకరిస్తాయి.