
ట్రంప్ వద్దకు మెర్కెల్.. టెన్షన్ టెన్షన్
బెర్లిన్: జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మంగళవారం శ్వేతసౌదంలో కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సర్దుమణుగుతాయా లేక మరింత పెరుగుతాయా అనే టెన్షన్ మొదలైంది. వాణిజ్యపరమైన అంశాలతోపాటు, వలస విధానం విషయంలో కూడా ఇప్పటికే ట్రంప్‌ను జర్మనీ విమర్శించడంతోపాటు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతున్న బ్రిటన్‌కు ట్రంప్ మద్దతు తెలపడం వంటి చర్యల నేపథ్యం రేపు జరగనున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.
ఒక్క జర్మనీ ఛాన్సలర్‌గా మాత్రమే కాకుండా యూరోపియన్ యూనియన్ ప్రతినిధిగా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడి వద్దకు రేపు వెళుతున్నారని జర్మనీ మీడియా చెబుతోంది. తన వ్యక్తిగత ముఖ్యమైన సైనికులతోపాటు పలువురు వ్యాపారవేత్తలతో ఆమె ట్రంప్ వద్దకు వెళుతున్నారట. వాస్తవానికి యూరోపియన్ యూనియన్‌కు, గ్లోబలైజేషన్‌కు మెర్కెల్ పూర్తి మద్దతుగా ఉంటారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం బ్రిటన్ ఆలోచనకు అనుకూలంగా ఉంటారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపట్ల ట్రంప్ సంతోషం కూడా వ్యక్తం చేశారు.