మెక్సికో: ప్రపంచం అంతటా ఎస్కలేటర్లు వాడటం సర్వసాధారణమైపోయింది. దాదాపు అన్ని దేశాల్లోనూ.. షాపింగ్ మాల్స్ మొదలు.. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే మెక్సికోలో ఈ మధ్య తరచూ ఎస్కలేటర్లు పాడవుతున్నాయి. దీంతో అక్కడి ప్రయాణికులు అధికారులపై ఫైర్ అయ్యారు. అయితే... ప్రయాణికుల వల్లే ఎస్కలేటర్లు పనిచేయకుండా పోతున్నాయని అధికారులు సరికొత్త వాదన వినిపించారు. ప్రయాణికులు ఎస్కలేటర్లపై మూత్ర విసర్జన చేస్తున్నారని.. దీంతో వాటి పనితీరు దెబ్బ తినడమే కాకుండా, తుప్పుపట్టి పనికి రాకుండా పోతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.
ఈ విషయం గురించి ఫెర్మిన్ రామీర్జ్ అనే అధికారి మాట్లాడుతూ.. ‘పలువురు ప్రయాణికులు ఎస్కలేటర్లపై మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో అవి పని చేయకుండా మొరాయిస్తున్నాయి. ఎస్కలేటర్లను పరీక్షించే సమయంలో అది విసర్జితాలతో తడిసిపోయి ఉంటున్నాయి. నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం’ అని ఆయన పేర్కొన్నాడు. పలు స్టేషన్లలో బాత్రూం సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతుందని కొందరు నెటిజన్లు ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా... రానున్న రెండేళ్లలో మెక్సికోలో 55 ఎస్కలేటర్లను మార్చివేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment